తన గొంతు పనికి రాదన్నందుకు లత ఏం చేసిందో తెలుసా?
posted on Feb 6, 2022 @ 11:57AM
లెజండరీ ఆర్టిస్టులు తొలిరోజుల్లో ఎదుర్కొన్న ఛీత్కారాలే లతా మంగేష్కర్ కూడా ఎదుర్కొన్నారు. కెరీర్ లో నిలదొక్కుకోవడానికి అహర్నిశలు శ్రమించారు. తన గొంతు మీద కామెంట్లు చేసిన విమర్శకుల నోళ్లు మూయించాలంటే లత చాలా పెద్ద కసరత్తే చేశారు. గొంతును ఎంతో మెలి పెట్టారు. పలుకుల్లో స్థానికత తొంగిచూసేందుకు తనకు తెలియని ఇతర భాషల్ని కూడా నేర్చుకున్నారు. ఒక సామాన్యమైన వ్యక్తి లెజండ్ ఎలా అవుతాడో తెలుసుకోవాలంటే లత ఎంత కష్టపడిందో కనీసం తెలుసుకోవాలి.
1929 సెప్టెంబర్ 28 జన్మించిన లతామంగేష్కర్ తండ్రి దీనానాథ్ మంగేష్కర్. తల్లిదండ్రులు మొదట పెట్టిన పేరు హేమ. ఆ తరువాతనే లతగా మారారు. పేరుకు తగినట్టుగానే ఆమె గొంతులో, పాటల్లో లాలిత్యం నింపుకున్నారు లతా దీదీ. తండ్రి క్లాసికల్ సింగర్, థియేటర్ యాక్టర్ కాబట్టి... తండ్రి నుంచి సహజంగానే సంగీతం అబ్బింది... అలాగే సినిమాల్లో అవకాశాలకూ మార్గం సుగమంగానే ఉంది. అయితే అవకాశాలు రావచ్చునేమో కానీ.. వాటని నిలబెట్టుకునేందుకు మాత్రం లత చాలానే కష్టపడాల్సి వచ్చింది. లత 13వ ఏటనే తండ్రి పోయాక వినాయక దామోదర్ లత కుటుంబానికి అండగా నిలిచాడు. వినాయక్... లత తండ్రికి ఫ్యామిలీ ఫ్రెండ్. అప్పటికే ఆయనకు నవయుగ చిత్రపథ్ మూవీ కంపెనీ ఉండేది. ఆ కంపెనీని ముంబైకి తరలించడంతో లత అండ్ ఫ్యామిలీ కూడా ముంబైకి రావాల్సి వచ్చింది. మూవీల్లో నిలదొక్కుకోవడానికి ముంబై వచ్చాక హిందూస్తానీ క్లాసికల్ సంగీతాన్ని అభ్యాసం చేశారు లత. అవకాశాలు వస్తున్న సమయానికే వినాయక్ కన్నుమూశారు.
అప్పటికే సంగీత దర్శకుడిగా మంచి పేరు సంపాదించుకున్న గులాం హైదర్.. దీనానాథ్ ఫ్యామిలీకి మిత్రుడు. దీంతో గులాం హైదర్ లతకు బాసటగా నిలిచాడు. ఆమెకు గాయనిగా అవకాశాలు ఇప్పించేందుకు అప్పటికే పేరు ప్రఖ్యాతులున్న నిర్మాత శశిధర్ ముఖర్జీకి దగ్గరకు తీసుకెళ్లాడు. లత వాయిస్ విన్న తరువాత శశిధర్ తిరస్కరించాడు. ఈమె గొంతు చాలా లేతగా ఉంది. పసిపిల్లల గొంతులా ఉంది. సినిమాకు పనికి రాదు పొమ్మన్నాడు. అయితే లతలో దాగి ఉన్న టాలెంట్ ను గుర్తించి, పూర్తి కాన్ఫిడెన్స్ మీద ఉన్న గులాం హైదర్ అప్సెట్ అయ్యాడు. ఈమె గొంతు కోసం నిర్మాతలంతా క్యూ కట్టే రోజు వస్తుందంటూ లతను తీసుకొని బయటికొచ్చేశాడు. గులాం హైదర్ అంచనాలు తప్పలేదు. లత ఎంతో కష్టపడి ఎన్నో రకాల శ్రుతుల్ని మేళవించి అద్భుతంగా రాణించింది. అందుకే 2013లో తన 84వ పుట్టిన రోజు సందర్భంగా గులాం హైదర్ ను తన గాడ్ ఫాదర్ గా పేర్కొన్నారు లత.
కాంట్రవర్సీలు
1) గిన్నిస్ వాల్డ్ రికార్డుల్లో లత పేరెక్కడంపై ప్రముఖ గాయకుడు మహమ్మద్ రఫీ విభేదించారు. 1974లో గిన్నీస్ బుక్ వారు లత అప్పటికి 25 వేల పాటలు పాడి రికార్డు సృష్టించినట్లు నమోదు చేశారు. అయితే మహమ్మద్ రఫీ తాను 28 వేల పాటలు పాడానని క్లెయిమ్ చేయడంతో వివాదాస్పదంగా మారింది. ఇక రఫీ చనిపోయాక 1984లో లత అత్యధిక పాటలు పాడిన గాయనిగా గుర్తించడమే కాక రఫీ చేసిన క్లెయిమ్ ను కూడా నమోదు చేయడం విశేషం. 84 నాటికి లత కనీసం 30 వేల పాటలు పాడిందంటూ సవరించుకుంది.
2) ఈ రోజుల్లోనే ప్లే బ్యాక్ సింగర్లకు తగిన గుర్తింపు గానీ, పారితోషికం గానీ అందడం లేదన్న ఆరోపణలున్నాయి. ఇక ఆ రోజుల్లో సంగతి చెప్పనక్కర్లేదు. లత తమకు కూడా రాయల్టీ కావాలంటూ గొంతెత్తింది. అదే ఆ తరువాత సింగర్లకు కొండంత బలాన్నిచ్చిందంటారు ఇండస్ట్రీ పెద్దలు.
3) ప్రముఖ సంగీత దర్శకుడు ఎస్.డి. బర్మన్ తో దాదాపు నాలుగేళ్ల పాటు మాట్లాడటం మానేసింది. లత ఎదుగుదలకు తానే కారకుడినని బయట చెప్పుకోవడంతోనే లత ఈ పని చేసిందంటారు.
4) తన చెల్లెలైన మరో గాయని ఆశా భోంస్లేతో వర్క్ చేశాడని ఓపీ నయ్యర్ తో పని చేయడానికి ససేమిరా అంది లత.
ఇక లత జీవితంలో అవార్డులకు, రివార్డులకు లెక్కే లేదు. గానకోకిల, క్వీన్ ఆఫ్ మెలోడీ అనేవి ఆమెకు సరిగ్గా సరిపోయే బిరుదులు. 1987లో దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు, 2001లో భారతరత్న పేరుతో అత్యున్నత పౌర పురస్కారం దక్కాయి. పద్మభూషణ్, పద్మ విభూషణ్ లతో పాటు ఇండస్ట్రీలో ఉండే అనేక అవార్డులు అందుకున్నారు. అంతేకాదు... సంగీతంలో ఎంఎస్ సుబ్బులక్ష్మి తరువాత రెండోసారి భారతరత్న అయిన సింగర్ కావడం విశేషం. 1974లో లండన్ లోని రాయల్ ఆల్బర్ట్ హాల్ లో పాడే అవకాశం దక్కించుకున్న మొదటి భారతీయ గాయని లతనే కావడం ఇంకో విశేషం.
మధ్యప్రదేశ్ లోని ఇండోర్ లో పుట్టిన లత... గుజరాత్ వ్యాపారవేత్తలతో రక్త సంబంధం కలిగి ఉంది. అమ్మ తరఫు తండ్రి గుజరాతీ బడా వ్యాపారవేత్తలు. అటువైపు తండ్రి నుంచి చిన్నప్పుడే ఫోక్ సాంగ్స్ నేర్చుకున్నానని పలు సందర్భాల్లో చెప్పుకున్నారు లత.