తిన్నా తినకపోయినా హాస్టల్ ఫీజు కట్టాల్సిందే.. ఆ కార్పొరేట్ విద్యాసంస్థ కక్కుర్తి
posted on Feb 6, 2022 @ 1:30PM
ఎంత పెద్ద పేరుంటే ఏంటి బాస్... మాక్కావాల్సింది నాలుగు రాళ్లు మాత్రమే... అంటుంది బడా కార్పొరేట్ విద్యాసంస్థల యాజమాన్యం నారాయణ. పిల్లల చదువుల కోసం శక్తికి మించి వెచ్చిస్తున్న తల్లిదండ్రుల బలహీనతను ఆసరా చేసుకొని... ఇదివరకే ఏడాదికి సరిపడా ట్యూషన్ ఫీజు కట్టించుకున్నారు. ఇప్పుడు వాళ్ల దృష్టి హాస్టల్ ఫీజులపై పడింది. జనవరిలో సంక్రాంతి సెలవుల పేరుతో విద్యార్థులను ఇంటికి పంపించారు. ఆ వెంటనే కరోనా కేసుల కారణంగా నెలంతా ఆన్ లైన్ క్లాసులకే పరిమితం చేశారు. ఇప్పుడు క్లాసులు స్టార్ట్ చేయాలన్న తాజా నిర్ణయంతో జనవరి మాత్రమే కాకుండా ఫిబ్రవరి హాస్టల్ ఫీజులు కూడా చెల్లించాలని పిల్లల మీద ఒత్తిడి తెస్తున్నారు. అంతేకాకుండా మార్చి హాస్టల్ ఫీజు కూడా ఇప్పుడే చెల్లించాలంటూ పిల్లల్ని వేపుకు తింటున్నారని పలువురు పేరెంట్స్ ఆవేదన చెందుతున్నారు.
హైదరాబాద్ లో కాస్త పేరున్న సంస్థ కావడంతో సరూర్ నగర్ లోని నారాయణ కాలేజీల ో తెలంగాణలోని పలు జిల్లాల నుంచి పేరెంట్స్ తమ పిల్లల్ని చేర్పించారు. తమతో ట్యూషన్ ఫీజు మొత్తం కట్టించుకున్నారని, ప్రభుత్వ ఉద్యోగులై ఉండీ కూడా తమకు వేతనాలు సమయం ప్రకారం రావడం లేదని, అయినా పిల్లల భవిష్యత్తు కోసం ఎంతో శ్రమకోర్చి భారీ ఫీజులు కడుతున్నామని పేరెంట్స్ అంటున్నారు. ఒక విద్యాసంస్థను నడుపుతూ, పిల్లల భవిష్యత్తును, వారిలో ఇంగిత జ్ఞానాన్ని కలిగించే గురువులు మాత్రం తమ పరిస్థితులను అర్థం చేసుకోకుండా కేవలం జేబులు నింపుకోవడమే ఎజెండాగా పెట్టుకోవడం భావ్యం కాదంటున్నారు. కాలేజీ ఫీజుల కోసం సమయానికి తమ దగ్గర డబ్బు లేకపోయినా ప్రైవేట్ పర్సన్స్ దగ్గర క్రెడిట్ కార్డు ఉపయోగించుకొని వేలకు వేలు వడ్డీ కడుతున్నామని, ఇలాంటి పరిస్థితుల్లో హాస్టల్ నడవని రోజులకు సైతం ఫీజులు ఎలా కట్టాలో ఆలోచించాలని, అది కూడా మార్చి తాలూకు హాస్టల్ ఫీజు ఇప్పుడే కట్టాలనడం ఏంటని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా కరోనా కేసులు విపరీతంగా పెరిగి, ఇప్పుడు మరణాలు లక్షల్లో సంభవిస్తున్నాయని, ఇప్పుడైతే భారత్ మరణాల రేటులో మూడో స్థానంలో ఉందన్న విషయం గుర్తించాలంటున్నారు.
రేపటి రోజుల్లో మళ్లీ ప్రభుత్వం ఎలాంటి నిర్ణయమైనా తీసుకోవచ్చన్న ఉద్దేశంతోనే హాస్టల్ ఫీజుల పేరిట పిల్లల్ని టార్చర్ చేస్తున్నారని, అసలే అంతంతమాత్రంగా బుర్రకెక్కుతున్న చదువుల నేపథ్యంలో యాజమాన్యాల చర్య వల్ల పిల్లలు ఒత్తిడికి గురవుతూ తమనూ ప్రశాంతంగా ఉండనివ్వలేక పోతున్నారంటూ వాపోతున్నారు.
ఇలాంటి విద్యాసంస్థలపై, వాటి బ్రాంచీలపై ప్రభుత్వ విద్యాశాఖ అధికారులు దృష్టి సారించాలని, తెలంగాణ సగటు ఉద్యోగులు, సగటు ప్రజల పట్ల సానుకూలంగా స్పందించే మంత్రి కేటీఆర్ తక్షణమే చర్యలకు ఉపక్రమించాలని కోరుతున్నారు. మరి వారి మొరను తెలంగాణ సర్కారు ఆలకిస్తుందా? ట్విట్టర్లో మాత్రమే స్పందించే మంత్రి కేటీఆర్ కు వారి ఆక్రోశం వినిపిస్తుందా?