ఎముకలు విరగొచ్చు.. తలలు పగలొచ్చు! బెంగాల్ బీజేపీ చీఫ్ వార్నింగ్
posted on Nov 9, 2020 @ 12:19PM
పశ్చిమ బెంగాల్లో అధికార తృణామూల్ కాంగ్రెస్, బీజేపీ మధ్య వార్ ముదురుతోంది. వచ్చే ఏడాది జరగనున్న అసెంబ్లీ ఎన్నికల కోసం ఇప్పటి నుంచే కత్తులు దూరుతున్నాయి రెండు పార్టీలు. తమ మాటల తూటాలతో కాక రేపుతున్నారు నేతలు. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ అనుచరులు, కార్యకర్తలను టార్గెట్ చేస్తూ.. బెంగాల్ బీజేపీ చీఫ్ దిలీప్ ఘోష్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి.
దీదీ సోదరులకు ఇదే నా హెచ్చరిక. ఎవరైతే వచ్చే ఆరు నెలల్లో సమస్యలు సృష్టిస్తారో వారికి నా వార్నింగ్. వారి కాళ్లూ చేతులు, ఎముకలు విరిగిపోవచ్చు. తలలు పగలొచ్చు. వారు ఆసుపత్రుల్లో చేరవచ్చు. అంతకన్నా ఎక్కువ కావాలనుకుంటున్నారా? శ్మశానానికి కూడా పోయే అవకాశాలు ఉన్నాయి" అని హల్దియాలో జరిగిన ర్యాలీలో దిలీప్ ఘోష్ హెచ్చరించారు. ఈ వార్నింగులే ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
బెంగాల్ లో అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచేందుకు బీజేపీ పావులు కదుపుతోంది. మమతను ఎలాగైనా ఓడించాలనే లక్ష్యంతో ఇప్పటినుంచే ప్రచారాన్ని ప్రారంభించింది. బీజేపీ ముఖ్య నేతలు కూడా బెంగాల్ లో పర్యటిస్తూ కేడర్ లో జోష్ నింపుతున్నారు. ఇటీవలే కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా కూడా బెంగాల్ లో పర్యటించారు. ఇక బెంగాల్ అధ్యక్షుడు దిలీప్ ఘోష్ తో అయితే చాలా కాలంగా ప్రజల్లో తిరుగుతూనే ఉన్నారు. అయితే అమిత్ షా పర్యటించి వెళ్లిన రెండు రోజుల్లోనే దిలీప్ ఘోష్ ఈ వ్యాఖ్యలు చేయడం దుమారం రేపుతోంది.
దిలీప్ ఘోష్ హెచ్చరికలపై టీఎంసీ నేతలు తీవ్రంగా ఫైరవుతున్నారు. పశ్చిమ బెంగాల్ లో ఉద్రిక్తతలు స్పష్టించేలా బీజేపీ కుట్రలు చేస్తుందని ఆరోపిస్తున్నారు. బీజేపై హైకమాండ్ డైరెక్షన్ లోనే రాష్ట్ర నేతలు రెచ్చిపోతున్నారని టీఎంసీ నేతలు చెబుతున్నారు. ఎముకలు విరగొడతాం.. తలలు పగలకొడతామంటూ బహిరంగంగా వ్యాఖ్యలు చేసినబెంగాల్ బీజేపీ చీఫ్ పై కఠిన చర్యలు తీసుకోవాలని తృణామూల్ కాంగ్రెస్ నేతలు డిమాండ్ చేస్తున్నారు.