రాజధాని ఫైల్స్ తప్పక చూడండి.. చంద్రబాబు పిలుపు!
posted on Feb 17, 2024 5:38AM
రాజధాని అమరావతికి భూములు ఇచ్చిన రైతుల ఆవేదనను కళ్లకు కట్టినట్లు చూపించిన చిత్రం రాజధాని ఫైల్స్. ఈ చిత్రం తప్పకుండా చూడాలని తెలుగుదేశం పార్టీ జాతీయ అద్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ప్రజలకు ట్విట్టర్ వేదికగా పిలుపు నిచ్చారు. ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న వ్యక్తి ఒక ప్రాంతంపై కక్షగట్టి... అది కూడా రాష్ట్ర రాజధానిపై పగబట్టి సర్వనాశనం చేసిన ప్రాంతం అమరావతి. ఇది ఒక చారిత్రక విషాదం. దీని కోసం కులాల కుంపట్లు రాజేసాడు. విష ప్రచారాలు చేయించాడు.
అధికార బలం మొత్తాన్ని ఉపయోగించి ఉద్యమకారులను చిత్రహింసలకు గురిచేశాడు. ఈ కుట్రలకు, దారుణాలకు అద్దం పట్టిన చిత్రం 'రాజధాని ఫైల్స్'. జగన్ క్రూరత్వానికి, వైసీపీ విధ్వంసానికి నాశనమైన ఒక రాజధాని... దాని కోసం ఎన్నో త్యాగాలు చేసిన ప్రజలు ఎదుర్కొన్న కష్టాలను కళ్ళకు కట్టింది ఈ చిత్రం. అందుకే చిత్రం విడుదలను ఆపడానికి జగన్ శతవిధాలా ప్రయత్నించాడు. కానీ కోర్టు ఆ ఆటలను సాగనివ్వలేదు. సినిమా ప్రదర్శనకు అనుమతి ఇచ్చింది. తెలుగు ప్రజలందరూ థియేటర్లకు వెళ్లి ఈ సినిమాను చూడండి. వాస్తవాలను తెలుసుకోండి. జగన్ రెడ్డీ! నీ సినిమా అయిపోయింది.... అసలు సినిమా ఇప్పుడు మొదలవుతుంది కాస్కో! అంటూ సవాల్ చేశారు.
బాను దర్శకత్వంలో ప్రముఖ నిర్మాత కంఠంనేని రవిశంకర్ నిర్మించిన చిత్రం రాజధాని ఫైల్స్. ఫిబ్రవరి 15వ తేదీన ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. అయితే ఆంధ్రప్రదేశ్‌లో ఈ చిత్రం ప్రదర్శిస్తున్న థియేటర్లలకు అధికారులు చేరుకొని.. ఈ సినిమాను అర్ధంతరంగా నిలిపివేశారు. ఈ చిత్రం నిలిపివేయడంపై అధికారులను ప్రేక్షకులకు ప్రశ్నించగా.. ఈ చిత్రాన్ని తాత్కాలికంగా ఆపమని న్యాయస్థానం స్టే ఆర్డర్ ఇచ్చిందంటూ.. సమాధానం ఇచ్చారు. అయితే ఫిబ్రవరి 16వ తేదీన ఈ చిత్రం ప్రదర్శించ వచ్చంటూ న్యాయస్థానం స్పష్టమైన ఆదేశాలు ఇవ్వడంతో.. ఆంధ్రప్రదేశ్‌లో సైతం ఈ చిత్రం ప్రదర్శితమవుతోంది. న్యాయస్థానం తీర్పుపై ప్రజాస్వామిక వాదులు హర్షం వ్యక్తం చేశారు. ఆ క్రమంలో టీడీపీ అధినేత చంద్రబాబు సైతం పై విధంగా స్పందించారు. మరోవైపు.. ఆంధ్రప్రదేశ్‌లోని ఈ చిత్రం ప్రదర్శితమవుతోన్న థియేటర్లకు అన్ని వర్గాల ప్రజలు పోటెత్తుతున్నారు.