తెలుగుదేశం నేతలకు చంద్రబాబు భరోసా.. బెడిసికొట్టిన జగన్ వ్యూహం!
posted on Feb 17, 2024 5:16AM
ఎన్నికల సమయంలో నేతలు పార్టీలు మారడం సాధారణ విషయమే. సుదీర్ఘకాలంగా పార్టీలో కొనసాగుతూ ఎన్నికల సమయంలో ఆశించిన స్థాయిలో అధిష్టానం నుంచి ప్రాధాన్యత దొక్కలేదని భావించే నేతలు రాత్రికి రాత్రే పార్టీలు మారుతుంటారు. అయితే, ఏపీలో వైసీపీ నేతల పరిస్థితి వేరు. గడిచిన నాలుగున్నరేళ్ల కాలంలో సీఎం జగన్ మోహన్ రెడ్డి నియంతృత్వ పాలనతో ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. వచ్చే ఎన్నికల్లో వైసీపీ తరపున బరిలోనిలిస్తే ప్రజల నుంచి ఘోర పరాభవం తప్పదని భావిస్తున్న కొందరు సిట్టింగ్ ఎమ్మెల్యేలు, ఎంపీలు, ముఖ్యనేతలు ఆపార్టీని వీడి తెలుగుదేశం వైపు చూస్తున్నారు. ఇప్పటికే అనేక మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలు, ఎంపీలు అధికార పార్టీని వీడారు. వీరిలో కొందరు టీడీపీలో చేరగా.. మరికొందరు సైకిలె్కేందుకు రెడీ అవుతున్నారు. ఇలా వైసీపీని వీడి వచ్చే వారి సంఖ్య రోజు రోజుకూ పెరుగుతుండటంతో వైసీపీ శ్రేణుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. జగన్ మోహన్ రెడ్డి మాత్రం మళ్లీ అధికారంలోకి మనమే వస్తామని పార్టీ నేతల వద్ద మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తున్నారు. ఇందుకు ఓ వ్యూహాన్ని కూడా సిద్ధం చేశానని జగన్ చెబుతున్నారని వైసీపీ వర్గాల్లో టాక్ నడుస్తోంది. తాజాగా చంద్రబాబు ఇచ్చిన షాక్ తో జగన్ వ్యూహం బెడిసికొట్టినట్లు వైసీపీ నేతలు ఆందోళన చెందుతున్నారు.
రానున్న ఎన్నికల్లో తెలుగుదేశం, జనసేన పార్టీలు కలిసి పోటీచేస్తున్నాయి. దీంతో తెలుగుదేశం తరపున ఎన్నికల్లో సీటు ఆశించిన పలువురు నేతలకు నిరాశే ఎదురు కానుంది. పొత్తులో భాగంగా జనసేన పార్టీకి సీట్ల కేటాయింపు కారణంగా కొన్ని నియోజకవర్గాలలో తెలుగుదేశం అభ్యర్థులు ఎన్నికల బరిలో నిలిచే అవకాశం లేకుండా పోతుంది. దీంతో పలు నియోజకవర్గాల్లో తెలుగుదేశం నేతలు తమ ఇబ్బందిని చంద్రబాబు, లోకేశ్ వద్ద ప్రస్తావించినట్లు చెబుతున్నారు. ఇదే అదునుగా భావించిన వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి తెలుగుదేశం పార్టీలో అసంతృప్తులను వైసీపీ వైపుకు తిప్పుకొనేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. అయితే, జగన్ మోహన్ రెడ్డి పాలనపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతుండటంతో తెలుగుదేశం అసంతృప్త నేతలు జగన్ ఆహ్వానాన్ని తిరస్కరిస్తున్నట్లు వైసీపీ వర్గాల్లో చర్చ జరుగుతున్నది. వైసీపీలోకి వెళ్లి ప్రజల చేతిలో చావుదెబ్బతినే బదులు తెలుగుదేశంలోనే ఉంటూ పార్టీలో కీలక పదవులను దక్కించుకోవటం మేలని అసంతృప్త నేతలు భావిస్తున్నట్లు చెబుతున్నారు. అయితే పలు నియోజకవర్గాల్లో కొందరు వైసీపీ వైపు వెళ్లేందుకు మొగ్గుచూపుతున్నారు. దీంతో వారిని పార్టీ కండువా కప్పి ఆహ్వానించేందుకు జగన్ సిద్ధమవుతున్న క్రమంలో.. చంద్రబాబు ఇచ్చిన హామీతో తెలుగుదేశంలోని అసంతృప్త నేతలంతా ఖుషీ అయ్యారని సమాచారం.
తెలుగుదేశం నేతలతో ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. పొత్తులకు సహకరించిన నేతలకు అధికారంలోకి రాగానే ప్రాధాన్యం ఇస్తామని హామీ ఇచ్చారు. ఈసారి పొత్తులతో ఎన్నికలకు వెళ్తున్నందున టిక్కెట్ రాలేదని ఏ ఒక్కరూ నిరుత్సాహపడొద్దని, పార్టీని నమ్ముకుని ఉన్నవారికి ఖచ్చితంగా గుర్తింపు, ప్రాధాన్యం ఉంటాయని చంద్రబాబు హామీ ఇచ్చారు. జగన్ తో విసిగిపోయిన చాలామంది వైసీపీ నేతలు రాష్ట్రాభివృద్ధి కోసం తెలుగుదేశం లో చేరుతాం అంటున్నారు. మంచి వారై ఉండి, పార్టీకి పనికొస్తారనుకునే వాళ్లని మాత్రమే తీసుకుంటున్నాం. అలాంటి వారి చేరికల్ని ప్రోత్సహించి కలిసి పనిచేయాలని పార్టీ నేతలను చంద్రబాబు కోరారు. రా కదలిరా సభలు ముగియగానే మరో ప్రజా చైతన్య యాత్రకు శ్రీకారం చుడతాననీ, మరో 50 రోజులే సమయం ఉన్నందున ప్రతీ ఒక్కరూ సీరియస్ గా పని చేయాలని పార్టీ నేతలకు చంద్రబాబు సూచించారు.
ఎన్నికల్లో టికెట్ ఆశించి భంగపడ్డ నేతలకు రాబోయే కాలంలో మంచి పదవులు దక్కుతాయని చంద్రబాబు క్లారిటీ ఇవ్వడంతో.. కొద్దికాలంగా తెలుగుదేశంలో అసంతృప్తితో ఉన్న నేతలు తమ అసంతృప్తిని వీడి సంతోషం వ్యక్తం చేస్తున్నారు. రాబోయే ఎన్నికల్లో నియోజకవర్గంలో ఎవరిని బరిలో నిలిపినా వారి తెలుగుదేశంలోని అసంతృప్త నేతలను ఎన్నికల సమయం నాటికి పలు రకాలుగా ప్రలోభపెట్టి వైసీపీలోకి తీసుకొచ్చేందుకు జగన్ సిద్ధం చేసుకున్న వ్యూహం బెడిసికొట్టడంతో వైసీపీ శిబిరంలో ఆందోళన వ్యక్తమౌతోంది.