పోయాడనుకున్నారు.. కానీ...
posted on Feb 4, 2015 @ 3:22PM
వైద్యులతో సహా అందరూ చనిపోయారని డిసైడ్ చేసిన వ్యక్తులు అంత్యక్రియలు జరిపే సమయంలో లేచి కూర్చున్న సందర్భాలు గతంలో అనేకం వున్నాయి. ఇప్పుడు అలాంటి ఘటనే మరోసారి జరిగింది. వరంగల్ జిల్లాలోని జీన్యా తండాలో నివసించే బానోతు ధర్మ అనే రైతు తన వ్యవసాయ బావిలో క్రేన్‌తో పూడిక తీయిస్తున్నాడు. ఇక్కడ జరిగిన ప్రమాదంలో ఆయన బావిలోపడిపోయాడు. తీవ్రంగా గాయపడిన ధర్మాని కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తీసుకెళ్ళారు. ఆస్పత్రిలో డాక్టర్లు ఉలుకు పలుకు లేకుండా పడి వున్న ధర్మాని పరీక్షించారు. ధర్మా ఇక బతకడని, ఇక ఇంటికి తీసుకెళ్ళిపొమ్మని చెప్పేశారు. ధర్మా బంధువులు భోరున ఏడుస్తూ ధర్మాని ఇంటికి తీసుకొచ్చారు. దారిలోనే ధర్మా చనిపోయాడనుకుని అందరూ డిసైడ్ అయ్యారు. ధర్మా ‘బాడీ’ని ఇంటికి తీసుకొచ్చి, ఇక అంత్య క్రియల ఏర్పాట్లు చేస్తున్నారు. కాడి కట్టడం కూడా పూర్తి చేశారు. ఇంతలో ధర్మా లేచి కూర్చుని, అందరూ ఏడుస్తున్నారేంటి? ఏం జరిగిందని కూల్‌గా అడిగాడు. దాంతో అక్కడున్న అందరూ బిత్తరపోయారు. ఆనందంతో తబ్బిబ్బయిపోయారు. ధర్మాని మళ్ళీ అర్జెంటుగా ఆస్పత్రికి తీసుకెళ్ళారు. ధర్మా ప్రస్తుతం చికిత్స పొందుతున్నాడు.