ఓటుకి నోటు కేసులో మరో ఇద్దరికీ నోటీసులు
posted on Aug 18, 2015 8:52AM
ఓటుకి నోటు కేసులో ఏసిబి అధికారుల దర్యాప్తు ఇంకా కొనసాగుతూనే ఉంది. ప్రతీ పదిపదిహేనురోజులకు ఒకసారి ఎవరో ఒకరికి నోటీసులు ఇస్తూ, అందరూ ఊహిస్తున్నట్లుగా ఈ కేసును అటకెక్కించేయలేదని, అది ఇంకా సజీవంగానే ఉందనే భావన ప్రజలకి కలిగేలా చేస్తున్నట్లున్నారు. మళ్ళీ నిన్న మాజీ కాంగ్రెస్ ఎంపీ డీకె. ఆదికేశవులు నాయుడు కుమారుడు శ్రీనివాసనాయుడికి, అతని స్నేహితుడు విష్ణు చైతన్యకి ఏసిబి అధికారులు నోటీసులు ఇచ్చారు. ఈ కేసు విషయంలో విచారించేందుకు వారిద్దరినీ మంగళవారం తమ ముందు కావలసిందిగా ఆదేశిస్తూ సెక్షన్:160వ క్రింద నోటీసులు అందజేశారు. బెంగూళూరులో నివాసముంటున్న శ్రీనివాసనాయుడు ప్రస్తుతం విదేశీ పర్యటనలో ఉన్నందున ఏసిబి అధికారులు అక్కడ ఉన్న ఆయన సిబ్బందికి నోటీసులు అందజేసి వెనక్కి తిరిగి వచ్చారు. వారిరువురూ ఈ కేసులో సాక్షులని భావించడం చేతనే ఏసిబి అధికారులు వారికి నోటీసులు అందజేసినట్లు తెలుస్తోంది.