జగన్ కు బిగ్ షాక్.. వాలంటీర్ల మూకుమ్మడి రాజీనామా
posted on Sep 3, 2021 @ 4:15PM
గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థ.. సీఎం జగన్మోహన్ రెడ్డి మానస పుత్రిక. వాలంటీర్ వ్యవస్థ గురించి ఎంతో గొప్పగా ప్రచారం చేసుకున్నారు సీఎం జగన్మోహన్ రెడ్డి. జాతీయ స్థాయిలో కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ప్రచారం చేయించుకున్నారు. అయితే సీఎం ప్రతిష్టాత్మకంగా చెప్పుకునే వాలంటీర్ వ్యవస్థ ఇప్పుడు నిత్యం వార్తల్లోకి వస్తోంది. వాలంటీర్లే రోడ్డెక్కుతున్నారు. వైసీపీ నేతల పెత్తనం పెరగడంతో తాము పని చేయలేమంటూ వాలంటీర్లపై ఆందోళనలకు దిగుతున్నారు. అధికారులు కూడా వాళ్లపై ప్రతాపం చూపిస్తున్నారు. దీంతో వేధింపులు భరించలేక ఇప్పటికే కొందరు ఉద్యోగానికి రాజీనామా చేసి వెళ్లారు. కర్నూల్ జిల్లాలో ఓ వాలంటీర్ ఏకంగా లేఖ రాసి సూసైడ్ చేసుకున్నాడు.
తమపై వేధింపులు అపాలని వాలంటీర్లు మొరపెట్టుకుంటున్నా వైసీపీ నేతలు, అధికారుల తీరు మారడం లేదు. దీంతో చిత్తూరు జిల్లాలో ఏకంగా 74 మంది వాలంటీర్లు తమ పదవులకు రాజీనామా చేశారు. పాకాల మండలంలో ఈవో, వైసీపీ నేతలు వేధిస్తున్నారంటూ 74 మంది వాలంటీర్లు రాజీనామా చేశారు. అధికార పార్టీ నేతల వేధింపులకు నిరసనగా పాకాల ఎంపీడీవో కార్యాలయం ఎదుట ధర్నాకు దిగారు. ఈవో కుసుమకుమారిని వెంటనే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. వైసీపీ నేతల వేధింపులు ఆపాలని, నేతలపై చర్యలు తీసుకోవాలని కోరారు.
ఇటీవల విశాఖ మన్యంలో 32 మంది వాలంటీర్లు రాజీనామా చేశారు. మారుమూప్రాంతాల్లో గిరిజన గ్రామాలకు రోడ్లు, రవాణా సదుపాయాలు లేకున్నా విధులు నిర్వహిస్తున్నామని చెప్పారు. అయితే మావోయిస్టులతో సంబంధాలు ఉన్నాయనే అనుమానంతో పోలీసులు వేధిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తాము ఎదుర్కొంటున్న సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోలేదని వాపోయారు. గత్యంతరం లేక రాజీనామా చేస్తున్నామని వాలంటీర్లు తెలిపారు.
ఏపీ వాలంటీర్ల మూకుమ్మడి రాజీనామాలు కలకలం రేపుతున్నాయి. ప్రభుత్వ తీరు, వైసీపీ నేతల దౌర్జన్యాలు తగ్గకపోతే రాబోయే రోజుల్లో మరికొందరు వాలంటీర్లు రాజానామా చేసే అవకాశాలు ఉన్నాయని చెబుతున్నారు. మరోవైపు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చెప్పుకుంటున్న వాలంటీర్ వ్యవస్థలో రాజీనామా కొనసాగుతున్నా ముఖ్యమంత్రి స్పందించకపోవడంపై విమర్శలు వస్తున్నాయి.