బిగ్ బ్రేకింగ్.. ప్రధాని మోడీతో సీఎం కేసీఆర్ సమావేశం
posted on Sep 3, 2021 @ 4:50PM
ఢిల్లీ పర్యటనలో ఉన్న తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు సాయంత్రం ఐదు గంటలకు ప్రధాని నరేంద్ర మోడీతో సమావేశం కానున్నారు. ప్రధానిని సమయం కోరుతూ తెలంగాణ సీఎంవో అధికారులు రెండో రోజుల క్రితమే పీఎంవోకు సమాచారం పంపించారు. అయితే కేసీఆర్ కు ఇవాళ అపాయింట్ మెంట్ ఖరారైంది. ప్రధానితో జరిగే సమావేశంలో రాష్ట్ర సమస్యలపై కేసీఆర్ చర్చిస్తారని అంటున్నారు. ఏపీతో నెలకొన్న జల వివాదాన్ని కూడా ప్రధాని దృష్టికి తీసుకువెళతారని అంటున్నారు.
ఢిల్లీలో తెలంగాణ భవన్ నిర్మాణ భూమి పూజ కోసం బుధవారం హస్తినకు వెళ్లారు కేసీఆర్. గురువారం పార్టీ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. ముందుగా నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం శనివారం ఉదయం ఆయన హైదరాబాద్ తిరిగి వచ్చేయాలి. కేసీఆర్ షెడ్యూల్ లో ప్రధానితో సమావేశం కూడా లేదు. కాని ఇప్పుడు మోడీతో కేసీఆర్ సమావేశం అవుతుండటం ఆసక్తిగా మారింది. శనివారం కేంద్రం హోంమంత్రి అమిత్ షాతోనూ ముఖ్యమంత్రి భేటీ అవుతారని తెలుస్తోంది.
రాష్ట్రంలో ప్రస్తుతం బీజేపీ, టీఆర్ఎస్ నేతల మధ్య మాటల యుద్ధం సాగుతోంది. కేసీఆర్ సర్కార్ పై ఓ రేంజ్ లో ఫైరవుతున్నారు కమలనాధులు. పాదయాత్ర చేస్తున్న ఎంపీ బండి సంజయ్.. కేసీఆర్ సర్కార్ పై తీవ్రమైన ఆరోపణలు చేస్తున్నారు. మరోవైపు బీజేపీ, టీఆర్ఎస్ ఒకటేనని, రెండు పార్టీలు కావాలనే డ్రామాలు చేస్తున్నాయని కాంగ్రెస్ ఆరోపిస్తోంది. ఈ నేపథ్యంలో ప్రధాని మోడీతో కేసీఆర్ సమావేశం అవుతుండటం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.