వాలంటీర్ వ్యవస్థ ఘోర వైఫల్యం! ఏలూరు వింత వ్యాధి ఘటనే సాక్ష్యం
posted on Dec 10, 2020 @ 2:15PM
గ్రామ సచివాలయ వ్యవస్థను గొప్పగా ప్రచారం చేసుకుంటోంది జగన్ ప్రభుత్వం. మహాత్మ గాంధీ కలలు గన్న గ్రామ స్వరాజ్యాన్ని సాకారం చేశామని జబ్బలు చరుచుకుంటోంది. క్షేత్రస్థాయిలో మాత్రం వాలంటీర్ వ్యవస్థ ఘోరంగా విఫలమైంది. వాలంటీర్లతో ప్రజలకు కొత్తగా జరుగుతున్న ప్రయోజనాలు ఏమి లేవని తెలుస్తోంది. ఏలూరును వణికిస్తున్న వింత వ్యాధి ఘటనతో సచివాలయ వ్యవస్థ పనితీరు ఎంత దారుణంగా ఉందో బయటపడింది. ఫిట్స్ రావడం, కళ్లుతిరగడం, నోటి నుండి నురగ, మూర్ఛ వంటి లక్షణాలతో ప్రజలు రోడ్డుపై పడిపోయి కొట్టుకుంటున్నా ఎక్కడా వాలంటీర్లు కన్పించలేదు. దీంతో చెప్పకొవడానికే తప్ప ఈ వ్యవస్థతో ఎలాంటి ఉపయోగం లేదని తేలి పోయింది.
గత శనివారం నుంచి ఏలూరులో వింత వ్యాధి ప్రబలింది. ఒక్కొక్కరుగా మొదలై ఇప్పటివరకు దాదాపు 6 వందల మంది ఈ వ్యాధి భారీన పడ్డారు. వింత వ్యాధి కేసులు గంటల్లోనే పెరిగిపోవడంతో ఏలూరు పట్టణమంతా వణికిపోయింది. ఎవరికి ఏం జరుగుతుందోనన్న భయంతో ప్రజలు వణికిపోయారు. ఏం తాగాలన్నా.. తినాలన్నా భయపడి పోయారు. ఏలూరులో ఇంత జరుగుతున్నా వాలంటీర్లు ఎక్కడా కనిపించ లేదు. వ్యాధి భయంతో అల్లాడిపోతున్న జనాలకు ఎలాంటి భరోసా ఇవ్వలేకపోయారు. వింత వ్యాధి సోకిన పడిపోయిన బాధితులకు వెంటనే చికిత్స అంద లేదు. దీంతో జగన్ సర్కార్ గొప్పగా చెప్పుకుంటున్న సచివాలయ సిబ్బంది, వార్డు వాలంటీర్లు ఎటు పోయారన్న విమర్శలు వస్తున్నాయి. గ్రామాల్లో గ్రామ సచివాలయం, పట్టణాల్లో వార్డు సచివాలయాలను జగన్ సర్కార్ ఏర్పాటు చేసింది. ప్రజలకు కావాల్సిన అన్ని సౌకర్యాలు ఇక్కడే లభిస్తాయని ప్రకటించింది. లక్షలాది మంది వాలంటీర్లను నియమించుకుంది. వైద్య సదుపాయాలు కూడా సచివాలయం నుంచే అందిస్తామని తెలిపింది. కాని ఏలూరులో వింత వ్యాధి వణికించినా ఎవరికి కనీస వైద్యం అందించలేదు సచివాలయాలు.
ఏలూరు దక్షిణపు వీధిలో తొలి వింత వ్యాధి కేసు నమోదైంది. అయితే ఇప్పుడు మరో కొత్త విషయం వెలుగులోనికి వచ్చింది. దక్షిణపు వీధిలో 15 రోజుల క్రితం కూడా ఇలాంటి ఘటనలు జరిగియని చెబుతున్నారు. ఫిట్స్ వచ్చి పడిపోయి ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు చనిపోయారని తెలుస్తోంది. సాధారణంగానే చనిపోయారని భావించామని, వారికి కూడా వింత వ్యాధి సోకినట్లుందని మృతుల బంధువులు చెప్పిన విషయాలతో అంతా షాకవుతున్నారు. వాలంటీర్ వ్యవస్థ సరిగ్గా పని చేస్తే 15 రోజుల క్రితమే వింత వ్యాధి గురించి తెలిసేదంటున్నారు. అప్పుడే చర్యలు తీసుకుంటే 6 వందల కేసులు వచ్చేవి కాదంటున్నారు. ప్రతి యాబై కుటుంబాలకు ఒక వాలంటీర్ ను పెట్టామని సీఎం జగన్ చెబుతున్నారని.. ఆ 50 కుటుంబాల్లో ఏం జరుగుతుందో వాలంటీర్లు గుర్తించలేకపోయారా అన్న ప్రశ్న వస్తోంది. ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు వ్యక్తులు ఫిట్స్ సంబంధిత సమస్యతో చనిపోతే వాలంటిర్లు వైద్యాధికారులకు ఎందుకు సమాచారం ఇవ్వలేదనే విమర్శలు వస్తున్నాయి
మరోవైపు వింత వ్యాధి ఘటనపై వాలంటీర్లే కాదు జగన్ సర్కార్ కూడా సరిగా స్పందించలేదని స్థానికులు అరోపిస్తున్నారు. ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు స్పందించి కేంద్ర బృందాలను పంపించారంటున్నారు. వెంకయ్య నాయుడు చొరవ వల్లే ఎయిమ్స్ బృందం ఏలూరుకు వెళ్లి రోగులను పరీక్షించింది. ఉపరాష్ట్రపతి సూచనతో కేంద్రమంత్రి ఎయిమ్స్ అత్యవసర వైద్య విభాగం ప్రొఫెసర్ డాక్టర్ జంషెడ్ నాయర్, పుణే ఎన్ఐవీ వైరాలజిస్ట్ డాక్టర్ అవినాష్ దేవష్టవర్, ఎన్డీసీసీ డిప్యూటీ డైరెక్టర్, డాక్టర్ సంకేత్ కులకర్ణిలతో కూడిన ముగ్గురు వైద్య నిపుణుల బృందాన్ని ఏర్పాటుచేశారు. ఈ బృందం ఏలూరు లోని వైద్యుల నుండి ఇక్కడి పరిస్థితిని ఇప్పటికే అడిగి తెలుసుకున్నారు. ఈ బృందం ఏలూరుకు వచ్చి, ల్యాబ్ నివేదికలను పరిశీలించి తగిన వైద్య సలహాలు అందచేశారు. ఢిల్లీలో ఉన్న వెంకయ్యనాయుడు స్పందించేవరకు రాష్ట్ర సర్కార్ నిద్రలోనే ఉందనే అభిప్రాయం అన్ని వర్గాల నుంచి వస్తోంది. విపక్షాలు కూడా ఇవే ఆరోపణలు చేస్తున్నాయి.