కరోనా సాయానికి.. మేముసైతమంటూ విరుష్క జోడీ..
posted on May 7, 2021 @ 12:13PM
కరోనా దేశాన్ని కబలించేస్తోంది. రోజుకు 4 లక్షల కేసులతో కల్లోలం సృష్టిస్తోంది. వేల మంది చనిపోతున్నారు. చికిత్సకు డబ్బులు లేక కొందరు.. ఆసుపత్రిలో వసతులు లేక ఇంకొందరు.. కరోనా మరణమృదంగం సృష్టిస్తోంది. ఉపాధి లేక, వ్యాపారం జరక్క, ఇంటి పెద్ద మరణించి.. ఇలా లక్షలాది కుటుంబాలు రోడ్డున పడుతున్నాయి. దేశ ఆర్థిక, కుటుంబ వ్యవస్థ కకావిలకం అవుతోంది. మరి, వీరిని ఆదుకునేది ఎవరు? ప్రభుత్వం ఎంత వరకు సాయం చేయగలదు? అందుకే, సోనూసూద్ లాంటి వాళ్లు ఇప్పటికే మేమున్నామంటూ తోచిన సాయం అందిస్తున్నారు. తాజాగా, ఇండియన్ పాపులర్ కపుల్స్ విరుష్క జోడీ సైతం.. మేముసైతం అంటూ సాయానికి ముందుకొచ్చారు.
విరాట్ కొహ్లి.. నెంబర్ వన్ క్రికెటర్. అనుష్క శర్మ.. బాలీవుడ్ టాప్ హీరోయిన్. ఇండియాలోకెల్లా క్రేజీ కపుల్. తమ ఆటతో, అభినయంతో.. దేశంలో కోట్లాది మంది అభిమానులను సొంతం చేసుకున్న ఈ జంట.. ప్రస్తుత దేశ సంక్లిష్ట పరిస్థితుల్లో తమ వంతు సాయం అందిస్తామంటూ ప్రకటన చేశారు. విరాళాల సేకరణ కోసం ప్రచారాన్ని ప్రారంభిస్తున్నట్లు టీమ్ ఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ ప్రకటించారు. దేశంలో ప్రజల బాధలు చూసి తీవ్ర ఆవేదన కలిగిందని విరాట్ అన్నారు. తన భార్య అనుష్క శర్మతో కలిసి తాను వైరస్‌పై పోరాటాన్ని ప్రారంభిస్తున్నట్లు వెల్లడించారు. కష్టకాలంలో కరోనాపై పోరాడుతున్న వారికి అండగా ఉందామని పిలుపునిచ్చారు. ketto వెబ్‌సైట్ ద్వారా విరాళాలు సమీకరించనున్నట్లు విరుష్క దంపతులు ఓ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.
‘కరోనా రెండో దశ విజృంభణపై దేశం పోరాటం చేస్తోంది. వైద్యారోగ్య వ్యవస్థ పెను సవాళ్లను ఎదుర్కొంటోంది. దేశంలో ప్రజల బాధలు చూసి తీవ్ర ఆవేదన కలిగింది. కోహ్లీ, నేను కలిసి విరాళాల సేకరణ చేపడుతున్నాం. మనమందరం కలిసి ఈ సంక్షోభాన్ని అధిగమించాలి. దేశానికి, భారతీయులకు మద్దతు ఇవ్వడానికి ముందడుగు వేయండి. మీరు అందించే సహకారం ఈ క్లిష్ట సమయంలో ప్రజల ప్రాణాలను రక్షించడంలో సహాయపడుతుంది’ అని అనుష్క శర్మ అన్నారు.
తమ వంతుగా 2 కోట్లు డొనేట్ చేసి ఈ విరాళాల కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నట్లు విరుష్క జంట తెలిపింది. దీని ద్వారా 7 కోట్లు సమీకరించాలని ఈ జంట లక్ష్యంగా పెట్టుకుంది. విరాట్ కోహ్లీ, అనుష్క శర్మల సంకల్పాన్ని అంతా హర్షిస్తున్నారు. ప్రస్తుతానికి 7 కోట్ల నిధులు సమీకరణ టార్గెట్‌గా పెట్టుకున్నా.. మరింత పెద్ద మొత్తంలో డొనేషన్స్ వచ్చే అవకాశం ఉందని అంచనా.