వినేశ్ ఫోగట్ ఓ పోరాట కెరటం
posted on Aug 14, 2024 @ 2:03PM
భారత రెజ్లర్ వినేశ్ ఫోగట్ ఓ పోరాట కెరటం. పారిస్ ఒలింపిక్స్ లో స్వర్ణ పతకమే లక్ష్యంగా పోరాడిన ఫోగట్ పై అనర్హత వేటు దురదృష్టకరం. ఫైనల్ పోరు వరకూ ఆమె పోరాడిన తీరు అనన్య సామాన్యం. అయితే ఫైనల్స్ కు ముందు కేవలం వంద గ్రాముల అధిక బరువు వినేశ్ స్వర్ణ ఆశలను ఛిద్రం చేసింది. వినేశ్ ఫోగట్ ఆటను ఆరాధించే కోట్లాది మంది హృదయాలు బరువెక్కాయి. అనర్హత వేటుతో తీవ్ర మనోవేదనకు గురైన వినేశ్ ఫోగట్ రెజ్లింగ్ క్రీడకు శాశ్వతంగా గుడ్ బై చెప్పారు.
అసలు ఫోగట్ అనర్హత వేటు వెనుక రాజకీయం ఉందా అన్న అనుమానాలు కూడా సర్వత్రా వ్యక్తం అయ్యాయి. ఆ అనుమానాలలో నిజానిజాల సంగతి పక్కన పెడితే.. బీజేపీ ఎంపీ, భారత రెజ్లింగ్ సమాఖ్య మాజీ అధ్యక్షుడు బ్రిజ్ భూషణ్ కు వ్యతిరేకంగా గత ఏడాది జరిగిన పోరాటంలో ఫోగట్ క్రియా శీలంగా పాల్గొన్నారు. రెజ్లింగ్ సమాఖ్య అధ్యక్షుడిగా బ్రిజ్ భూషన్ మహిళా రెజ్లర్లతో అనుచితంగా వ్యవహరిస్తున్నారంటూ రెజ్లర్లు అప్పట్లో పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టిన సంగతి విదితమే. అప్పట్లో వినేశ్ ఫోగట్ సహచర రెజ్లర్లతో కలిసి వినేశ్ ఫోగట్ ధర్నాలో పాల్గొన్నారు. పోలీసుల దాష్టీకాన్ని చవి చూశారు. అరెస్టు కూడా అయ్యారు. ఒక దశలో తనకు సర్కార్ ఇచ్చిన ఖేల్ రత్న అవార్డును కూడా వినేశ్ ఫోగట్ వెనక్కి ఇచ్చేశారు. దీంతో ఆమెకు వేధింపులు ఎక్కువయ్యాయి. అమెను నానా మాటలు అనడం మొదలెట్టారు. సోషల్ మీడియాలో ట్రోల్ చేశారు.
ఈ నేపథ్యంలోనే వినేష్ ఫోగట్ పై సరిగ్గా ఫైనల్ పోరుకు ముందు అనర్హత వేటు పడటంపై సర్వత్రా అనుమానాలు వ్యక్తం అయ్యాయి. ఎందుకంటే ఫైనల్ పోరు కోసం రింగ్‌లోకి దిగడానికి కొన్ని గంటల ముందు ఆమె బరువు వంద గ్రాములు ఎక్కువ ఉన్న సంగతి తెలిసింది. దీంతో అధిక బరువును తగ్గించుకోవడానికి వినేశ్ నానా పాట్లు పడింది. తిండి మానేసింది. నీళ్లూ ముట్టలేదు. జట్టు కత్తిరించుకుంది. రాత్రంతా మెలకువగానే ఉంది. అయినా ఫలితం లేకపోయింది. దీంతో వంద గ్రాముల బరువు తగ్గించుకోవడానికి మరికొంత సమయం కావాలని ఒలింపిక్స్ అధికారులను బతిమిలాడింది. ప్రాధేయపడింది. అయినప్పటికీ ఫలితం లేకపోయింది. ఫైనల్ పోరుకు ముందు రోజు జరిగిన పోటీలో ఆమె నిర్దిష్టబరుతోనే ఉంది. డిఫెండింగ్ ఛాంపియన్ యుయి సుసాకి పై సాధికర విజయం సాధించిన వినేశ్ ఫోగట్. క్వార్టర్స్ లో ఉక్రెయిన్‌కు చెందిన ఓక్సానా లివాచ్ పై విజయం సాధించింది. సెమీస్‌లో క్యూబాకు చెందిన యుస్నేలిస్ గుజ్‌మన్‌ను ఓడించింది. వరుస విజయాలతో ఫైనల్ కు దూసుకెళ్లిన వినేశ్ ఫోగట్ కు ఇక స్వర్ణం ఖాయమనుకుంటున్న దశలో యాభై కిలోల బరువు పోటీకి వంద గ్రాములు ఎక్కువగా ఉందంటూ వినేశ్ ఫోగట్ పై అనర్హత వేటు వేశారు.
ఫోగట్ తన రెజ్లింగ్ కేరీర్ లో ఎన్నో రికార్డులు సొంతం చేసుకుంది. భారత క్రీడారంగంపై తన సంతకం శాశ్వతం చేసుకుంది. కామన్వెల్త్ గేమ్స్ లో అనేక సార్లు దేశానికి స్వర్ణాలు తెచ్చిపెట్టింది. 2014, 2018 అలాగే 2022 కామన్వెల్త్ గేమ్స్ లో దేశానికి ఫోగట్ స్వర్ణ పతక విజేతగా నిలిచింది. కామన్వెల్త్ , ఆసియన్ గేమ్స్ లో బంగారు పతకం సాధించిన తొలి మహిళా రెజ్లర్ గా వినేశ్ ఫోగట్ చరిత్ర సృష్టించింది. అంతేకాదు వరల్డ్ రెజ్లింగ్ చాంపియన్ షిప్స్ లో రెండు కాంస్యం పతకాలు సాధించింది. అయితే ఒలింపిక్స్ లో స్వర్ణం సాధించాలన్న ఆశ మాత్రం నెరవేరలేదు.
ఇంతకు ముందు ఆమె రెండుసార్లు ఒలింపిక్స్ లో భారత్ తరఫున రెజ్లర్ గా పాల్గొన్నది. 2016 లో 48 కిలోల క్యాటగరీలోనూ 2020 లో 53 కిలోల క్యాటగిరీలోనూ పాల్గొన్న వినేశ్ ఫోగట్ ఈ సారి 50 కిలోల విభాగంలో పాల్గొన్నారు. మొత్తం మీద ఒలింపిక్ స్వర్ణం లక్ష్యం సాధించలేకపోయినా.. యావద్దేశం అభిమానాన్ని, మద్దతులూ వినేశ్ ఫోగట్ సొంతం చేసుకున్నారు. సెమీస్ లో నిర్దుష్ట బరువుతోనే పోటీ పడి విజయం సాధించినందున బ్రాంజ్ మెడల్ కు తాను అర్హురాలినే నంటూ ఆమె క్రీడా కోర్టులో చేసుకున్న అప్పీలుపై శుక్రవారం తీర్పు రానుంది. ఆ తీర్పు అనుకూలంగా వస్తే భారత్ తరఫున రెజ్లింగ్ లో పతకం సాధించిన క్రీడాకారిణిగా ఫోగట్ నిలుస్తుంది. భారత్ పతకాల సంఖ్య మరొకటి పెరుగుతుంది. మొత్తం మీద భారత్ రెజ్లింగ్ లో ఫోగట్ ప్రస్థానం ఒక చెరగని సంతకం అని చెప్పడానికి సందేహించాల్సిన అవసరం లేదు.