ఇలా చేస్తే కేసు నుంచి బయటపడొచ్చేమో చూడండి అచ్చెన్నా: విజయసాయి
posted on Jun 15, 2020 @ 2:18PM
ఈఎస్ఐ స్కాం ఆరోపణల నేపథ్యంలో టీడీపీ నేత, మాజీ మంత్రి అచ్చెన్నాయుడుని అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. జగన్ సర్కార్ కక్ష సాధింపులో భాగంగానే అచ్చెన్నాయుడుని అరెస్ట్ చేసి ఇబ్బందులకు గురి చేస్తోందని టీడీపీ ఆరోపిస్తోంది. మరోవైపు అధికార వైసీపీ మాత్రం.. తప్పు చేసి అరెస్ట్ అయింది గాక, మళ్లీ రాజకీయం చేస్తున్నారంటూ టీడీపీ నేతలపై మండిపడుతోంది. తాజాగా అచ్చెన్న వ్యవహారంపై ట్విట్టర్ వేదికగా స్పందించిన వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి.. చంద్రబాబు, లోకేష్ లపై విమర్శలు గుప్పించారు.
"అచ్చెన్న అరెస్టును బిసిల అణచివేతగా రంగు పులుముతున్న బాబు గారు ఆ కుటుంబానికి చేసిన అన్యాయాన్ని మర్చినట్టున్నారు. 2002లో బాలయోగి గారి దుర్మరణంతో, లోక్ సభ స్పీకర్ పదవికి తనను ఎంపిక చేయాలని ఎర్రన్నాయుడు ప్రాధేయపడ్డాడు. ఎదిగి పోతాడన్న భయంతో ఏ పోస్టు దక్కకుండా చేశాడు ‘విజనరీ’." అంటూ చంద్రబాబుపై సంచలన వ్యాఖ్యలు చేశారు విజయసాయి రెడ్డి.
"కరోనా తర్వాత ఫీల్డ్ కొస్తా.. అంతు చూస్తా.. అని చిటికెలేసిన ఉత్త’ర కుమారుడు ముందే వచ్చాడు.. వెళ్లి పోయాడు. ఏదీ, ఏం జరగలేదే? కూసాలు కదులుతుంటే పొంతన లేకుండా మాట్లాడటం కామన్. అచ్చెన్న తమ గుట్లన్నీ బయటకు కక్కుతాడేమో అన్న భయంతో అబ్బా కొడుకులకు నిద్ర పట్టడం లేదంట." అంటూ చంద్రబాబు, లోకేష్ లపై విమర్శలు గుప్పించారు.
"అచ్చెన్న కచ్చితంగా బాబు గారి బినామీనే. ఆయన ద్వారానే భూముల కొనుగోళ్లు, వ్యాపారాల్లో వేల కోట్లు పెట్టుబడులుగా పెట్టారని సొంత పార్టీలో చర్చించుకుంటున్నారు. బాబు రాయమంటేనే సిఫారసు లేఖలు రాసానని అంగీకరించి, గుట్లు మట్లన్నీ చెప్పేస్తే కేసునుంచి బయటపడొచ్చేమో చూడండి అచ్చెన్నా." అంటూ విజయసాయి సంచలన ట్వీట్ చేశారు.