కేసీఆర్ ఆ పదం ఉపసంహరించుకొంటే మేలు: వెంకయ్యనాయుడు
posted on Aug 11, 2014 7:36AM
గవర్నరుకు అధికారాలు కట్టబెట్టడాన్ని తీవ్రంగా వ్యతిరేఖిస్తూ తెలంగాణా ముఖ్యమంత్రి కేసీఆర్, ప్రధానమంత్రి నరేంద్ర మోడీని ‘ఫాసిస్టు’ అని అనడాన్ని రాజకీయ విశ్లేషకులు సైతం తప్పుబడుతున్నారు. కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి వెంకయ్యనాయుడు నిన్న హైదరాబాదులో పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ, ప్రధానమంత్రి వంటి అత్యున్నత వ్యక్తిని ఉద్దేశించి కేసీఆర్ ఆవిధంగా మాట్లాడటం చాలా దురదృష్టకరమని, ఆయన తన మాటలు వెనక్కు తీసుకోవాలని కోరారు. పార్లమెంటు, రాష్ట్రపతి ఆమోదించిన బిల్లులో అంశాలను అమలు చేయడం ఏవిధంగా ఫాసిజమవుతుందని ఆయన ప్రశ్నించారు. ఆంధ్రప్రదేశ్ విభజన బిల్లులో అన్నిఅంశాల గురించి పూర్తిగా ఎరిగి ఉన్నప్పటికీ కేసీఆర్ ఈవిధంగా మాట్లాడటం దురదృష్టకరమని ఆయన అన్నారు. ఆనాడు ఇదే బిల్లును పార్లమెంటు ఆమోదించినపుడు హర్షించిన కేసీఆర్, నేడు ఎందుకు విమర్శిస్తున్నారని ఆయన ప్రశ్నించారు. కేంద్రంతో ఈవిధంగా ఘర్షణపడే బదులు, పరస్పర సహకారంతో తెలంగాణా రాష్ట్రాభివృద్ధికి కృషి చేయాలని ఆయన కేసీఆర్ ను కోరారు. అదేవిధంగా ఆంద్ర, తెలంగాణా ప్రభుత్వాలు ఇకనయినా తమ కలహాలను పక్కన బెట్టి చర్చల ద్వారా సమస్యలను పరిష్కరించుకొంటూ రెండు రాష్ట్రాల అభివృద్ధికి కృషిచేయాలని ఆయన విజ్ఞప్తి చేసారు. కేంద్రానికి అన్ని రాష్ట్రాలు సమానమేనని తెలంగాణా పట్ల ఎటువంటి వివక్ష చూపదని ఆయన అన్నారు.