నేతాజీకి భారతరత్న వద్దు... అదృశ్యంపై దర్యాప్తు సంగతేంటి....
posted on Aug 11, 2014 @ 11:34AM
భారత ప్రభుత్వం ఈసారి ఐదుగురికి అత్యున్నత పౌర పురస్కారం ‘భారతరత్న’ ఇవ్వడానికి సన్నాహాలు చేస్తోంది. ఈ ఐదుగురిలో నేతాజీ సుభాష్ చంద్రబోస్ కూడా వున్నారన్న వార్తలు వచ్చిన నేపథ్యంలో నేతాజీ కుటుంబం ఈ అంశం మీద స్పందించింది. నేతాజీ మునిమనవడు చంద్రకుమార్ బోస్ స్పందిస్తూ, ‘‘నేతాజీకి భారతరత్న ఇవ్వాలన్న ఆలోచనను మా కుటుంబంలోని 60 మంది పూర్తిగా వ్యతిరేకిస్తున్నారు. నేతాజీకి భారతరత్న ఇవ్వాల్సిన అవసరం లేదు. ఆయన అదృశ్యం వెనుక వున్న మిస్టరీని ఛేదించి, మా కుటుంబానికి, ఆయన అభిమానులకు ఒక స్పష్టత ఇవ్వాల్సిందిగా భారత ప్రభుత్వాన్ని కోరుతున్నాం. 1945 నుంచి నేతాజీ ఆచూకీ తెలియడం లేదు. ఆయనకు మీరు ‘మరణానంతరం భారతరత్న పురస్కారం’ ప్రదానం చేస్తున్నారంటే.. ఆయన ఎప్పుడు చనిపోయారో చెప్పాలి. కానీ, ఆయన చనిపోయారనడానికి ఆధారం ఎక్కడుంది? ఆయనను గౌరవించే సరియైున మార్గమేంటంటే.. నేతాజీ అదృశ్యం వెనుక ఉన్న నిజాన్ని తెలిపే ప్రభుత్వ ఫైళ్లను బయటపెట్టడమే’ అని చంద్రకుమార్ బోస్ వ్యాఖ్యానించారు.