ఒక కొత్త ప్రవాహం ఈ "వెళ్లిపోవాలి"!
posted on May 11, 2022 @ 9:30AM
ఇతర భాషల్లో, దేశాల్లో సినిమాకు నిర్వచనం మార్చి, పూర్వం ఊహించి ఎరగని విధానాలలో కథలను తెర మీదికి తీసుకొస్తున్నారనీ, మనవాళ్ళు ఇంకా మూసపద్ధతులనుంచి బయటపడటం లేదనీ విచారపడే, ప్రత్యేక తెగ తెలుగు ప్రేక్షకుల కోసం ఒక కొత్తగాలి వీచినట్లు వచ్చింది " Camera Stylo" banner నుంచి "వెళ్ళిపోవాలి" సినిమా అనవచ్చు. సినిమా తీయడంలో, రిలీజ్ చేయడం లో కూడా మామూలు పద్ధతులకు పూర్తి భిన్నంగా ప్రయత్నించి, సఫలీకృతం గా బయటికి తీసుకొచ్చిన మొదటి సినిమా బహుశా తెలుగులో ‘‘వెళ్ళిపోవాలి‘‘ మాత్రమే నేమో.
ఏవిధంగా చూచినా ఇదొక విప్లవం లాంటిది సినీ చరిత్రలో. ఒక చెప్పుకోదగ్గ కథా, ఒక ప్రధానపాత్ర, పెద్ద సంఘర్షణ , ఒక క్లైమాక్స్ , ఇవేవీ లేని పూర్తి నిడివి సినిమా ఇది. చాలా మామూలు డిజిటల్ కెమెరాతో, అత్యంత చిన్న పెట్టుబడితో అన్నీ తామే అయి ఒక ముగ్గరు మిత్రులు చెప్పిన తమ కథ ఈ సినిమా విషయం. అలా అని ఇది ఏ డాక్యుమెంటరీ సినిమానో కాదు. ఇలా ప్రయోగాత్మకంగా docufilms genre లో సినిమాలు తీసిన వాళ్ళు వేరే ప్రపంచం సినిమా డైరెక్టర్ లు అబ్బాస్ కియొరస్తమీ, నూరి బెల్గ్ చెయ్లన్ లాంటి కొందరు ఉన్నా, వాళ్ళ అనుభవాలే సినిమాగా తీసినా వాళ్ళు వాళ్ళ పాత్రలను వేరే నటులతో నటింపచేశారు. ఒక్క ఈ ‘‘వెళ్ళిపోవాలి‘‘ సినిమా తీసిన ముగ్గురు, మెహెర్, రాజిరెడ్డి, అజయ్ వాళ్ళ సంగతులనే కథ చేసి, వారి వారి పాత్రలు వాళ్ళే నటించడం బహుశా మొత్తం ప్రపంచ సినీ చరిత్రలో నే తొలిసారి జరిగింది.
రచనలు చేయటం అనే ఒక కామన్ అభిరుచి, వయసు నలభైలలో ఉన్న, పరిచయస్తులకు ఎక్కువ, మరీ బాల్య ప్రాణస్నేహితులకు తక్కువ అయిన ముగ్గురు మిత్రులు ప్రస్తుతజీవితంలో ఎదుర్కుంటున్న సమస్య, ‘‘స్వంత ఇల్లు ఎక్కడ ఏర్పరుచుకోవాలి?‘‘ పుట్టిపెరిగిన వేరు వేరు ఊర్ల నుంచి ఉద్యోగాల కోసం హైదరాబాద్ కు వచ్చిన వాళ్ళకు ఇది అంతుచిక్కని ప్రశ్న. జీతం దొరికే ఏదో ఒక పని దొరికిందని తప్ప ఇంకేవిధంగానూ తమకు స్వంతం అనిపించని ఈ నగరం లో ఇల్లు ఏర్పరుచుకోవటం ఆర్థికంగా అసంభవం. ఇక్కడ ఆత్మీయతా దుర్లభమే. అటు ఉండొచ్చిన ఊరూ ఇన్నేళ్ల వలస తరువాత పరాయిగా కనిపిస్తుంది. ఊరితో, అక్కడ మనుషులతో వీరి అనుబంధం కీలుబందు వదులైన కుర్చీకాలులా ఊగుతుంటుంది, ఆసరా నిమ్మళంగా ఇవ్వలేదు అది. ఆ juncture లో మనిషికి ఇల్లు కట్టుకోవడమనే సమస్య రూపాంతరం చెంది అసలు అది తన అస్తిత్వ సమస్యగా ఎలా మారి కలవరపెడుతుందో అనేదే ఈ సినిమా కథ.
జీతానికి, జీవితానికీ, మూలాలకీ, ఉండవలసొచ్చిన నగరాలకు ఒక అర్థం వెతకడం మొదలు పెడుతుంది మనసు. ఒక క్షణం బలంగా మనదంటూ ఒక కుటుంబం, ఊరూ, జీవితం కావాలని, మరుక్షణం వీటివేటికీ అంత ప్రాధాన్యత ఇవ్వడం అవసరమా ఎలాగూ ‘‘సగాన పడ్డాం జీవితంలో, ఇంకా ఎందుకు ఒక ఇల్లు ఏర్పరుచుకోవడం కోసం తక్కిన సగం జీవితం తాకట్టు పెట్టుకోవడం ‘‘ అని ఒక వైరాగ్యమూ ఆవహిస్తుంది.
అదొక విషాదమైన సందిగ్ధం. కానీ ఆ సందిగ్ధాన్ని ఎవరికి తోచిన రీతిలో, ఎవరికి చేతనైన మార్గంలో వారి వారి జవాబు వెతుక్కోవడంలో తప్పనిసరి సౌందర్యం ఆవిష్కృతమైంది ఈ ముగ్గురి కథలలో. సినిమా చివర్లో వచ్చిన "మనం సగం సన్యాసులం, సగం సంసారులం" అనే మాట ఈ సినిమాలో కనిపించే ముగ్గురికీ ఉన్న మూలసూత్రం.
కానీ ఆ మూడు ముఖ్యమైన పాత్రల్లో, ఆ నిష్పత్తుల లో తేడాలు, ఆ రెండిటినీ ఎంతలో ఎక్కడ నిలబెట్టాలో తెలుసుకోవడంలో తేడాలు ఉన్నాయి.
అసలు ఈ "clinging to one's roots, past, desire for belongingness" మనిషి ప్రాథమిక సమస్యా? మౌలిక సమస్యా?
మెటఫర్లు, లేటెంట్ అర్థాలు , దృశ్యాల framing లకు significances, అన్ని నెట్టిపారేసి అతి మామూలు ముచ్చట్లోతోనే ప్రస్తుతపు ప్రతిమనిషి అస్తిత్వ వేదనను నింపాదిగా కథలా వ్రాసుకొచ్చింది ఈ కెమెరా stylo.
ఆ నెమ్మది కథనంలోనే బోలెడంత agitation feel చేయించింది.
"వెళ్ళిపోవాలి" చీకట్లనూ వెలుతుర్ల నూ, ఇరుకిరుకు జేగురు గదులనూ, పచ్చటి వైశాల్యాలను కథకు అవసరమైనప్పుడు అవసరమైనట్లు చూసింది.
అందులో జీవితం మీద కావలసినంత ప్రేమ కనిపించింది, బ్రతుకంటే విరక్తీ కనిపించింది.
ఈ సినిమా లెన్స్ లైట్ ను, దాని అన్ని hues తో beautiful గా పట్టుకుంది. Hues, that are beyond just physical also... నగరంలో వానకు తడిసిన నారింజ రంగు రోడ్లు అవి దాటుతున్న అజయ్ మనఃస్థితిని, సగం ఖాళీగా ఉన్న పచ్చటిపొలాలు, పడిపోతున్న జేగురు రంగు ఇల్లు రాజిరెడ్డి ఆలోచనలనూ, చీకటి మేడ, ఎండిన సిమెంట్ రోడ్లు మెహెర్ apparent out look నూ పట్టిచ్చిన్నట్టు ఉంటుంది. ముగ్గురు
ఆడవాళ్ల ఉనికి ప్రాణం ఈ మగవాళ్ళ కథలకూ, తెరకూ కూడా.
"కత్తిని బేరం చేసేప్పుడు దాని వాదరకు విలువ కట్టాలి, పిడికి కాదు", సినిమా అయినా అంతే. అది ఎంత పదునుగా తను చెప్పదలుచుకున్నది చెపుతున్నదో చూడాలి కానీ కెమెరా సైజూ, బడ్జెట్ బరువూ కాదు లెక్కించాల్సింది.
మనిషి ఎప్పుడూ ఇంకా ఎక్కడికో వెళ్ళేందుకు చూస్తుంటాడు వాకిలికి ఒక కాలు లోపలికి, ఒక కాలు వెలుపలికి వేసి.
Congrats to the whole team.
(విశ్లేషణాత్మక సమీక్ష అందించిన పద్మజ సూరపురాజు గారికి ధన్యవాదములు.)
◆వెంకటేష్ పువ్వాడ.