కాంగ్రెస్ అధ్యక్షుడు ఎవరు? అనారోగ్యంతో తల్లి అయిష్టతతో తనయుడు అధ్యక్ష పదవికి దూరం
posted on Aug 24, 2020 @ 5:23PM
- ఇప్పటివరకు అధ్యక్షులుగా ఉన్న వారిలో తెలుగు వారు నలుగురు
- 135ఏండ్ల చరిత్రలో నెహ్రూ కుటుంబీకుల అధ్యక్షులుగా 46ఏండ్లు
- 20ఏండ్లు అధ్యక్షత వహించిన సోనియా గాంధీ
- ఏడాది మాత్రమే మోతీలాల్ నెహ్రూ
- రెండేండ్లకే అయిష్టత పెంచుకున్న రాహుల్
- ప్రియాంక వైపు నాయకుల చూపు
భారత స్వాతంత్య్ర సమరంలో సుదీర్ఘపోరాటం, స్వాతంత్య్రం సిద్ధించిన తర్వాత భారతదేశంలో ప్రజాస్వామ్య ప్రభుత్వం ఏర్పాటులో కీలకపాత్ర పోషించిన ఘన చరిత్ర కాంగ్రెస్ సొంతం. దేశభక్తులంటే కాంగ్రెస్ కార్యకర్తలే అన్నంతగా ఆ పార్టీ భారతదేశం చరిత్ర మూలాల్లో నాటుకుపోయింది. 74ఏండ్ల స్వతంత్య్ర భారతదేశాన్ని దాదాపు 49ఏండ్ల పరిపాలించిన ఘనత కూడా ఆ పార్టీదే. 135ఏండ్ల చరిత్ర ఉన్న ఈ పార్టీ ఆవిర్భవం నుంచి ఇప్పటివరకు పార్టీ అధ్యక్షులుగా బాధ్యతలు నిర్వహించిన వారిలో నెహ్రూ కుటుంబీకులు ఎక్కువ ఉన్నారు. దాదాపు 46ఏండ్లు పార్టీ పగ్గాలు ఆ కుటుంబం చేతిలో ఉండగా రికార్డు స్థాయిలో సోనియాగాంధీ రెండు దశాబ్దాలు పార్టీ అధ్యక్ష పదవిలో కొనసాగారు. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో పార్టీ పగ్గాలు చెప్పట్టడానికి మాత్రం సమర్ధవంతమైన నాయకుడే ఆ పార్టీలో కరువయ్యారు. గతమెంతో ఘనకీర్తి అన్న విధంగా కాంగ్రెస్ పార్టీ తీరు ఉంది. పార్టీ అధ్యక్ష ఎన్నికకోసం కసరత్తు జరుగుతున్న ప్రస్తుత తరణంలో అనారోగ్యంతో సోనియాగాంధీ అధ్యక్ష పదవికి దూరంగా ఉండాలని భావిస్తే.. రాహుల్ గాంధీ పార్టీ పగ్గాలు చేపట్టడానికి అయిష్టతతో ఉన్నారు. ఈ సందర్భంగా ఓ సారి పార్టీ చరిత్ర పుటలను తిరిగేస్తే..
ఆవిర్భావం..
బ్రిటిష్ అధికారిగా పనిచేసిన ఏ.ఓ.హుమే 25 డిసెంబరు 1885న ప్రారంభించారు. భారత జాతీయ కాంగ్రెస్(ఇండియన్ నేషనల్ కాంగ్రెస్) పేరుతో రాజకీయ పార్టీగా నమోదు అయిన ఆ పార్టీ అనేక కీలక పరిణామాలను ఎదుర్కోంది. భారతదేశానికి స్వాతంత్య్రం వచ్చిన తర్వాత పార్టీని రద్దు చేయాలని మహాత్మాగాంధీ ప్రతిపాదినను పార్టీ నేతలు ఆమోదించకపోవడంతో దేశ పరిపాలనలో సుదీర్ఘకాలం ఉన్న పార్టీగా రికార్డు నమోదు చేసింది. పార్టీ వ్యవస్థాపకుల్లో ఒకరుగా ఉన్న ఉమేశ్ చంద్ర బెనర్జీ మొదటి అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. ఆ తర్వాత దాదాబాయ్ నౌరోజీ అధ్యక్షబాధ్యతలు స్వీకరించారు. తిరిగి రెండోసారి ఉమేశ్ చంద్ర బెనర్జీ అధ్యక్షుడిగా 1892లో, దాదాబాయ్ నౌరోజీ 1983లో ఎన్నికయ్యారు. మూడోసారి కూడా పార్టీ పగ్గాలు పట్టుకున్న వ్యక్తి దాదాబాయ్ నౌరోజీ 1906లో ముచ్చటగా మూడోసారి ఆయన అధ్యక్ష పదవిని చేపట్టారు.
నెహ్రూ కుటుంబం
దేశస్వాతంత్య్రంలో కీలకపాత్ర పోషించిన వారిలో నెహ్రూకుటుంబం పేరు అందరికీ సుపరిచితం. కాంగ్రెస్ అధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వహించిన ఆ కుటుంబంలోని మొదటి వ్యక్తి మోతిలాల్ నెహ్రూ. 1919లో ఆయన పార్టీ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. ఆ తర్వాత నెహ్రూ నాలుగుసార్లు( 1929-1930, 1936-37, 1946, 1951-1954) అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించారు. దాదాపు తొమ్మిది సంవత్సరాలు ఆయన పార్టీ అధ్యక్షుడిగా పనిచేశారు. నెహ్రూ ప్రధాన మంత్రి గా ఉన్నప్పుడే ఆయన ఏకైక కుమార్తె ఇందియాగాంధీ పార్టీ పగ్గాలు చేపట్టారు. 1959లో ఆమె మొదటిసారి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలిగా ఎన్నికయ్యారు. నెహ్రూ మరణించిన తర్వాత రెండోసారి 1978లో పార్టీ పగ్గాలు అందుకున్నారు. జాతీయ కాంగ్రెస్ పార్టీ రెండుగా చీలింది. ఇందిరా నేతృత్వంలో కాంగ్రెస్ -ఐ గా మారింది. ఆరేండ్ల పాటు పార్టీ అధ్యక్షురాలిగా బాధ్యతలు నిర్వహించారు. 1984లో ఇందిరాగాంధీ హత్య తర్వాత ఆమె కుమారుడు రాజీవ్ గాంధీ ప్రధానమంత్రి పదవిని, పార్టీ అధ్యక్షపదవిని చేపట్టారు. ఆరేండ్లు ఆయన పార్టీ అధ్యక్షుడిగా అనేక కీలకమార్పులు చేశారు. 1991లో రాజీవ్ గాంధీ హత్య జరిగిన తర్వాత పార్టీ అధ్యక్షులుగా ఎవరినీ నియమించాలన్న అంశంపై చాలా చర్చలు జరిగాయి. కాంగ్రెసు పార్టీకి నాయకుడు లేకుండా పోయాడు. ఆ సమయంలో తనకంటూ ప్రత్యేక గ్రూపు లేని వ్యక్తి, కేంద్ర రాజకీయాల్లో ఎంతో అనుభవజ్ఞుడైన పాములపర్తి వెంకట నరసింహారావు(పీవీ నరసింహారావు) అందరికీ ఆమోదయోగ్యుడుగా కనపడ్డారు. దాంతో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా, దేశ ప్రధానికి పీవీ ఎన్నికయ్యారు.1991 నుంచి 1996 వరకు ఆయన బాధ్యతలు నిర్వహించారు.
నలుగురు తెలుగువారు..
జాతీయ కాంగ్రెస్ పార్టీలో అధ్యక్ష స్థానానికి ఎన్నికైన తెలుగువారు నలుగురు. వీరిలో మొదట ఎన్నికైన తెలుగు వ్యక్తి పట్టాభి సీతారామయ్య. ఆయన 1948, 1949లో కాంగ్రెస్ అధ్యక్షుడిగా పనిచేశారు. ఆ తర్వాత ఎన్నిక ముగ్గురు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రులుగా పనిచేసిన వారే. నీలం సంజీవ రెడ్డి 1960 నుంచి 1963 వరకు అధ్యక్షుడిగా కొనసాగారు. కాసు బ్రహ్మనందరెడ్డి 1977, 1978లో ఎన్నికయ్యారు. పీవీ నరసింహారావు 1991 నుంచి 1996 వరకు బాధ్యతలు నిర్వహించారు. ఎక్కువ కాలం అధ్యక్ష బాధ్యతలు నిర్వహించిన తెలుగువ్యక్తిగా కాంగ్రెస్ పార్టీ చరిత్రలో రికార్డు సాధించారు.
రెండు దశాబ్దాల పాటు..
ఆ తర్వాత రెండేండ్లకు అంటే 1998లో సోనియాగాంధీ పార్టీ అధ్యక్షస్థానానికి ఎన్నికై దాదాపు 19ఏండ్ల అంటే 1998 నుంచి 2017 వరకు ఆమె అధ్యక్షురాలిగా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ చరిత్రలోనే అత్యధిక సంవత్సరాలు పార్టీ అధ్యక్షపదవిలో కొనసాగిన ఘనత ఆమెదే. అయితే దేశ ప్రధాని బాధ్యత స్వీకరించాలని పార్టీ నుంచి అంగీకారం వచ్చినా... విదేశీ మహిళ అంటూ ప్రతిపక్షాల వ్యతిరేకతతో ఆమె పార్టీ పదవికే పరిమితమయ్యారు. అయితే సోనియా గాంధీ అనారోగ్యం కారణంగా పార్టీ బాధ్యతల నుంచి తప్పుకోవాలని చూస్తున్నారు. నెహ్రూ కుటీంబీకులు, గాంధీ పేరు ఉన్నవారైతేనే ప్రజల్లో పార్టీకి మనుగడ ఉంటుంది అని నమ్మే పార్టీ నాయకులు రాహూల్ గాంధీ ని అధ్యక్షస్థానంలో కూర్చొబెట్టే ప్రయత్నం చేశారు. 2017లో ఆయనను పార్టీ అధ్యక్షుడిగా ఎన్నిక చేశారు. అయితే సాధారణ పార్లమెంట్ ఎన్నికల్లో ఓడిపోవడం, దేశంలో నానాటికీ పార్టీ ప్రాబల్యం తగ్గడం, అంతర్గత విబేధాలతో విసుగుచెందిన రాహుల్ గాంధీ అధ్యక్షపదవి నుంచి తప్పుకోవడంతో తిరిగి పార్టీ పగ్గాలు సోనియా చేతిలోకే వచ్చాయి. ఆమె అనారోగ్యం, రాహుల్ అయిష్టత కారణంగా కొత్త అధ్యక్షుల కోసం చర్చజరుగుతుంది. ప్రియంకగాంధీ రాక కోసం నేతలు ఎదురుచూస్తున్నారు. అయితే ఆమె నిర్ణయం ఇంకా తెలియలేదు. దాంతో నెహ్రూ కుటుంబం, గాంధీ పేరు లేకుండా కొత్త అధ్యక్షుడి ఎన్నిక కోసం కసరత్తు జరుగుతోంది. మరి ఈ సారి ఎవరి చేతికి పగ్గాలు వస్తాయో చూద్దాల్సిందే..!