అనిశ్చిత స్థితిలో రాష్ట్రం
posted on Jul 26, 2013 @ 4:09PM
పిల్లికి చెలగాటం ఎలక్కి ప్రాణ సంకటం అన్నట్లు వైకాపా ఎత్తుకొన్న సమైక్యరాగంతో ముందుగా ఆ పార్టీకి చెందిన తెలంగాణా నేతలు, ఆ తరువాత కాంగ్రెస్, తెదేపాలకు కొత్త సమస్యలు వచ్చిపడ్డాయి. ఇప్పటికే, వైకాపా తెలంగాణా నేతలు అధ్యక్షురాలు విజయమ్మతో జరిపిన చర్చలు విఫలమయినట్లు వార్తలు వస్తున్నాయి. వారు మళ్ళీ ఈరోజు సాయంత్రం నాలుగు గంటలకి మరో మారు సమావేశం అయ్యే అవకాశం ఉంది. అప్పుడు కూడా చర్చలు విఫలమయితే, వారు తట్టాబుట్టా సర్దుకోవడానికి సిద్దంగా ఉన్నారు.
ఇక, కాంగ్రెస్ కోర్ కమిటీ కూడా సరిగ్గా నాలుగు గంటలకే డిల్లీలో సమావేశం అవుతోంది. అందులో తెలంగాణాపై ఏదో ఒకటి తేల్చుకొని, ఆ తరువాత ఒకటి రెండు రోజుల్లో వర్కింగ్ కమిటీలోఅంతిమ నిర్ణయమ ప్రకటించే అవకాశాలున్నాయి. అందువల్ల కాంగ్రెస్ వైకాపా రాజీనామాలను పట్టించుకొనే స్థితిలో లేదిప్పుడు.
ఇక, తెలుగుదేశం పార్టీ నేతలెవరూ కూడా, వైకాపా చేసిన రాజీనామాలపై గానీ, కేంద్రంలో జరుగుతున్న సమావేశాల గురించి గానీ, ఎటువంటి వ్యాక్యాలు చేయవద్దని, ముఖ్యంగా వైకాపా ముగ్గులోకి లాగే ప్రయత్నం చేస్తున్నందున మరింత అప్రమత్తతతో మెలగాలని చంద్రబాబు తన నేతలందరికీ ఖచ్చితమయిన ఆదేశాలు ఇచ్చికట్టడి చేస్తున్నట్లు తెలుస్తోంది. మరో రెండు మూడు రోజులలో కాంగ్రెస్ రాష్ట్ర విభజనపై ఖచ్చితమయిన ఒక నిర్ణయం తీసుకొన్న తరువాతనే స్పందించడం మంచిదని అంతవరకు సమన్వయము పాటించడం మేలని నిర్ణయించుకొన్నట్లు తెలుస్తోంది. ఒకవేళ రాష్ట్ర విభజనకు కాంగ్రెస్ సిద్దమయితే, అప్పుడు కాంగ్రెస్ అధిష్టానం తన సీమంధ్ర నేతలను అదుపుచేయక తప్పదు. అప్పుడు సహజంగానే తెదేపాపై ఒత్తిడి తగ్గుతుందని చంద్రబాబు అంచనా.
కాంగ్రెస్, తెదేపాలు రెండూ కూడా తమ నేతలను నియంత్రించుకొనగలిగితే అకస్మాత్తుగా సమైక్యరాగం అందుకొన్న వైకాపా అప్పుడు రెండు ప్రాంతాలలో ఒంటరి అయ్యే అవకాశం ఉంది. అందువల్ల తెదేపా అధికార ప్రతినిధులు తప్ప ఇతర నేతలెవరూ కూడా ప్రస్తుత పరిణామాలపై మీడియాకెక్కి మాట్లాడేందుకు ఇష్టపడటం లేదు. మరొక మూడు నాలుగు రోజుల్లో రాష్ట్రంలో నెలకొన్న ఈ అనిశ్చితస్థితి తొలగిపోవచ్చును. అప్పుడు ఎవరు కొత్తగా ఉద్యమ బాట పడతారో, ఎవరు పైచేయి సాధిస్తారో, ఎవరు నష్టపోతారో చూచాయగా తెలిసిపోవచ్చును.