సినిమాలపైనా ట్రంపపు కోత!
posted on Sep 30, 2025 @ 4:02PM
ఇకపై మీరు అమెరికాలో కూర్చుని ఓజీ తరహా అచ్చ తెలుగు సినిమా చూడాలంటే.. చాలా చాలా కష్టం. ఆ టికెట్ రేట్లు కూడా మీ వాలెట్ కి చిల్లు పెట్టడం ఖాయం. ఎందుకంటే మన ట్రంప్ మామ.. ఇక్కడా తన ప్రతాపం చూపించేశారు. వంద శాతం సుంకాలతో విరుచుకుపడ్డారు. బాహుబలి ముందరి వరకూ టాలీవుడ్ సినిమాల పరిస్థితి ఏంటంటే.. హాలీవుడ్ సినిమాల ముందు మన సినిమాలు తేలిపోయేవి. దీంతో బడ్జెట్ ఎక్కువైనా పర్లేదు.. క్వాలిటీ తగ్గకుండా పీరియాడిక్స్ ని వదలకుండా వరుస వెంబడి సినిమాలు చేస్తూ వస్తోంది తెలుగు చిత్రసీమ.
సరిగ్గా ఇదే విషయాన్ని చిరంజీవి నాటి సీఎం జగన్ ని కలిసినపుడు అన్నారు కూడా. ఎందుకంటే మన ప్రేక్షకులు థియేటర్లను వెతుక్కుంటూ రావాలంటే ఆ మాత్రం పెట్టుబడి పెట్టక తప్పడం లేదన్నారు. దీంతో మన సినిమాలు హాలీవుడ్ స్థాయిలో ప్రపంచ వ్యాప్తంగా ఇరగదీయడం మొదలు పెట్టాయి. మన బాహుబలి, దేవర వంటి సినిమాలు చైనా, జపాన్ లో కూడా ఆడ్డం మాత్రమే కాదు.. కలెక్షన్ల సునామీ సృష్టించడం మొదలు పెట్టాయి.
దీంతో లోబడ్జెట్- హై ఎండ్ ఎంటర్ టైన్మెంట్ కి కేరాఫ్ గా నిలుస్తున్నాయి మన చిత్రాలు. ఇక మేనరిజమ్స్ సంగతి సరే సరి. తగ్గేదే ల్యే.. అనేది ఇప్పుడు హాలీవుడ్ లెవల్ ట్రెండింగ్. ఆ మాటకొస్తే మన పుష్ప పుష్ప పుష్ప సాంగ్ కి టైం స్క్వైర్ సెంటర్లోనూ విదేశీయులు డ్యాన్సులు ఆడారంటే పరిస్థితేంటో అర్ధం చేసుకోవచ్చు. ఇప్పటికే మన ఇస్రో హాలీవుడ్ చిత్ర సీమను వెక్కిరిస్తోంది. కారణం.. హాలీవుడ్ చిత్రాల బడ్జెట్ లోపలే మనం రాకెట్లు నింగిలోకి వదిలేస్తున్నాం. దీంతో ఇదొక కడుపు మంట.
ఆపై మన అరిటాకు భోజనాలు, కట్టు బొట్టు తీరు తెన్నుకు విశేష స్పందన లభిస్తోంది. మొన్నటి కుంభమేళాకు ఎందరో విదేశీ ప్రముఖులు రావడం మాత్రమే కాకుండా.. వారంతా ఇక్కడి దేవతల నామస్మరణ చేసి కాషాయం కట్టి చేసిన హంగామా అంతా ఇంతా కాదు. అంతే కాదు మన మంత్ర తంత్రాలు, ఆయుర్వేదం, శిల్పకళా చాతుర్యం.. వరల్డ్ వైడ్ గా ఒక మానియా క్రియేట్ చేస్తోంది. మొన్నటి వరకూ మన వాళ్లు విదేశీ అలవాట్లతో ఎక్కడ చెడిపోతారో అన్న భయం నుంచి పశ్చిమ నాగరికత క్రమంగా అంతరించి పోయి.. ప్రపంచమంతా భారతీయత పరుచుకుపోతుందా అన్న దృశ్యం కనిపిస్తోంది. అంతగా మన సంస్కృతీ సంప్రదాయాలు ప్రపంచ వ్యాప్తమై పోతున్నాయి.
వీటన్నిటీకీ వాహకంగా మారుతోంది మన భారతీయ సినిమా. మన సంస్కృతీ సంప్రదాయాలను మోసుకెళ్లడంలో ఇవి ముందుంటున్నాయి. దానికి తోడు ఏ హాలీవుడ్ సినిమాలో ఉండని నవరసాలు మన సినిమాల్లో కనిపిస్తాయ్. దీంతో హండ్రెడ్ పర్సెంట్ ఎంటర్టైన్మెంట్ పక్కా. అలాంటి సినిమాలకు భాషా బేధం లేకుండా విశేష ఆదరణ లభిస్తుండటంతో కన్ను కుట్టిన ట్రంపాసురుడు వీటిపై కూడా తన టారీఫులతో విరుచుకుపడుతున్నాడు. తమ హాలీవుడ్ సినిమాల నాణ్యతా ప్రమాణాలు కూడా మన భారతీయ సినీ నైపుణ్యం ముందు ఎక్కడ కొట్టుకుపోతాయో అన్న భయం కొద్దీ ట్రంప్ ఈ దిశగా వంద శాతం సుంకాల మోత మోగిస్తున్నట్టు తెలుస్తోంది. ఈ ట్రంప్ ఇంకా ఎన్నేసి చిత్రాలు నమోదు చేస్తారో చూడాల్సి ఉంది. గతంలో కొందరు పాలకులు జుట్టు పన్ను వంటివి కూడా వేసేవారు. అలా ట్రంప్ తమ దేశంలో గాలి పీల్చే వారిపైనా పన్ను విధించినా ఆశ్చర్యం లేదంటున్నారు కొందరు. ఇప్పటికే తమ తమ ఇంటికి డబ్బు పంపే వారిపైనా కన్నేసి బిగ్ బిల్ తీసుకొచ్చిన ట్రంప్ ఇంకెన్ని అరాచకాలు సృష్టిస్తాడో అన్న ఆందోళన మొదలైంది.. ఎన్నారై వర్గాల్లో.