Read more!

మావోయిస్టులకు టీఆర్ఎస్ సర్కార్ షాక్

 

 

 

తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే తాము విస్తరించడానికి అవకాశం ఏర్పడుతుందని, తమమీద వున్న నిషేధం తెలంగాణ వరకు అయినా తొలగే అవకాశం వుందని కలలు కంటున్న మావోయిస్టులకు తెలంగాణలో కొత్తగా ఏర్పడిన కేసీఆర్ నాయకత్వంలో టీఆర్ఎస్ ప్రభుత్వం భారీ షాక్ ఇచ్చింది. కేసీఆర్ ప్రభుత్వం ఏర్పడగానే మావోయిస్టులకు అనుకూలంగా వుండే ప్రకటన వచ్చే అవకాశం వుందని చాలామంది భావించారు. అయితే కేసీఆర్ ప్రభుత్వం నుంచి అందుకు విరుద్ధమైన ప్రకటన రావడం మావోయిస్టు వర్గాలను షాక్‌కి గురిచేసింది.

 

మావోయిస్టులపై కొనసాగుతున్న నిషేధం తెలంగాణ రాష్ట్రంలో యధావిధిగా కొనసాగుతుందని తెలంగాణ రాష్ట్ర తొలి హోం మంత్రి నాయిని నర్సింహా రెడ్డి స్పష్టం చేశారు. ఆయన ఆ రాష్ట్ర తొలి హోం మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత మీడియాతో మాట్లాడుతూ.. శాంతిభద్రతలు ఎంత అదుపులో ఉంటే రాష్ట్రం అంత బాగా అభివృద్ధి చెందుతుందన్నారు.  రాష్ట్రంలో ప్రస్తుతం మావోయిస్టుల కార్యకలాపాలు పెద్దగా లేవని, అయితే సానుభూతి పరులు మాత్రం అక్కడకక్కడ ఉన్నారన్నారు. మావోయిస్టులు పౌర సమాజంలోకి రానప్పుడు వారిపై నిషేధం ఎత్తివేసే సమస్యే లేదన్నారు. ఎన్నికల ముందు మావోయిస్టులకు అనుకూలంగా మాట్లాడిన టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇలా మాట్లాడ్డం పట్ల మావోయిస్టులు ఎలా స్పందిస్తారో చూడాలి.