రాజీనామా చేస్తా.. టీఆర్ఎస్ ఎమ్మెల్యే ఆడియో వైరల్...
posted on Nov 8, 2021 9:20AM
తెలంగాణ రాజకీయాలను షేక్ చేసిన కరీంనగర్ జిల్లా హుజురాబాద్ ఉప ఎన్నిక ఫలితం తర్వాత రాజకీయ సమీకరణలు వేగంగా మారిపోతున్నాయి. ఈటల రాజేందర్ అద్భుత విజయంతో బీజేపీలో జోష్ కనిపిస్తుండగా.. తమకు కంచుకోటగా చెప్పుకునే హుజురాబాద్ లో ఓటమితో కారు పార్టీలో కంగారు కనిపిస్తోంది. అదే సమయంలో టీఆర్ఎస్ ఎమ్మెల్యేలపై రాజీనామా ఒత్తిడి పెరుగుతోంది. ఉప ఎన్నికతో హుజురాబాద్ దశ మారింది. ఏండ్లు పెండింగులో ఉన్న పనులకు మోక్షం దక్కింది. దీంతో తమ నియోజకవర్గానికి ఉప ఎన్నిక వస్తే బాగుండనే భావనలో ఓటర్లు ఉన్నారు. తమ ఎమ్మెల్యేలు రాజీనామా చేయాలనే డిమాండ్లు వినిపిస్తోంది. కొందరు ప్రతిపక్ష ఎమ్మెల్యేలు కూడా దళిత బంధు లాగా అన్ని వర్గాలకు బంధు ఇస్తానంటే తాము రాజీనామా చేయడానికి సిద్ధమని ప్రకటనలు చేస్తున్నారు. మునుగోడు కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కూడా అలాంటి ప్రకటనే చేశారు.
హుజురాబాద్ ఫలితం ఎక్కువగా ఇబ్బంది పడుతోంది అచ్చంపేట టీఆర్ఎస్ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ గువ్వల బాలరాజు. హుజురాబాద్‌లో బీజేపీ అభ్యర్థి ఈటల గెలిస్తే రాజీనామా చేస్తానని ఓ టీవీ చానెల్ డిస్కషన్ లో సవాల్ విసరడమే ఆయనకు ఇప్పుడు ఇక్కట్లు తెచ్చిపెడుతోంది. రాజీనామా సవాల్ విసిరిన అచ్చంపేట టీఆర్ఎస్ ఎమ్మెల్యేకు గువ్వల బాలరాజుకు కొత్త తలనొప్పి ప్రారంభమైంది. వరుసగా ఫోన్లు చేసి.. సార్ మీరెప్పుడు రాజీనామా చేస్తారని అడుగుతున్నారు. ఇందుకు సంబంధించిన ఫోన్ కాల్ ఆడియోలు సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి.
ఆదివారం జనగామ జిల్లాకు చెందిన బీజేపీ నేత ఒకరు గువ్వల బాలరాజుకు ఫోన్ చేశారు. ‘హలో సార్ నేను జనగామ జిల్లా బీజేపీ జనరల్ సెక్రెటరీ శ్రీనివాస్ రెడ్డిని మాట్లాడుతున్నాను.. హుజరాబాద్‌లో బీజేపీ గెలిచి నాలుగు రోజులవుతుంది. మీరు ఎప్పుడు రాజీనామా చేస్తారు..?’ అని ఎమ్మెల్యే గువ్వల బాలరాజును అడుగగా,.. ‘చేస్తా.. చేస్తా’ అంటూ బాలరాజు ఫోన్ కట్ చేశారు. అందుకు సంబంధించిన ఆడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతోంది. ఎమ్మెల్యే గువ్వల చేస్తా అని చెప్పడంతో ఆయన త్వరలోనే రాజీనామే చేస్తారా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.