ఆత్మగౌరవం ఉంటే అప్పుడెందుకు రాజీనామా చేయలే!
posted on Jun 4, 2021 @ 1:46PM
టీఆర్ఎస్ పార్టీకి , హుజురాబాద్ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసినట్లు ప్రకటించిన మాజీ మంత్రి ఈటల రాజేందర్.. సీఎం కేసీఆర్ పై తీవ్రస్థాయిలో ఆరోపణలు చేశారు. కుటుంబ పాలన, దొర పాలనంటూ నిప్పులు చెరిగారు. బానిసలుగా ఉన్నవారికే ప్రాధాన్యత ఇస్తున్నారని మండిపడ్డారు. అయితే కేసీఆర్ పై రాజేందర్ చేసిన వ్యాఖ్యలను టీఆర్ఎస్ నేతలు స్ట్రౌంగ్ కౌంటరిచ్చారు. ఈటలది ఆత్మగౌరవం కాదు.. ఆస్తుల రక్షణ అని మండిపడ్డారు. అక్రమంగా సంపాందించిన తన ఆస్తులను కాపాడుకునేందుకు ఆత్మగౌరవమంటూ నాటకాలు ఆడుతున్నారని టీఆర్ఎస్ నేతలు ధ్వజమెత్తారు.
గతంలో ఈటల రాజేందర్ దేవుడని కీర్తించిన కేసీఆర్.. ఇప్పుడు దెయ్యం అయ్యారా అని ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి ప్రశ్నించారు. టీఆర్ఎస్ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు శాసనసభాపక్ష నేతగానూ ఈటలకు అవకాశం దక్కిందన్నారు. టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత రెండు సార్లు మంత్రిగా అవకాశం ఇచ్చారని చెప్పారు. తెలంగాణలో ఏ పథకం తీసుకురావాలని చూసినా ఈటల రాజేందర్‌కు ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్పేవారని, అందులో ఏమైనా అభ్యంతరాలు ఉంటే చెప్పాలని కోరేవారని అన్నారు. ఈటలను పార్టీ ఎంతగానో గౌరవించిందని పల్లా చెప్పారు.
ప్రగతి భవన్‌లోకి రానివ్వలేదని ఈటల చెబుతున్నారని, అందులోకి రానివ్వకపోతే మరి అప్పుడే ఎందుకు రాజీనామా చేయలేదని ఆయన ప్రశ్నించారు. టీఆర్ఎస్ నుంచి బయటకు వెళ్తూ విమర్శలు చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. కేసీఆర్‌పై ఎన్నో అసత్య ప్రచారాలకు తెరదీశారని ఆయన చెప్పారు. గతంలోనూ చాలా మంది నేతలు టీఆర్ఎస్ నుంచి బయటకు వెళ్తూ కేసీఆర్‌పై విమర్శలు చేశారని ఇప్పుడు ఈటల కూడా వారినే అనుసరిస్తూ విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. తెలంగాణలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయని ఆయన అన్నారు. ధాన్య సేకరణ ముఖ్యమంత్రి కేసీఆర్ వద్దంటే తాను కావాలన్నానని ఈటల అసత్యాలు చెబుతున్నారని ఆయన విమర్శించారు.