కాంగ్రెస్ వేలితో కాంగ్రెస్ కన్ను పొడుస్తున్నతెరాస
posted on Jul 5, 2013 @ 5:07PM
కాంగ్రెస్ పార్టీ తన చేతి వాటం ప్రదర్శించి తెలంగాణాని ఎత్తుకు పోవడంతో కంగుతిన్న తెరాస నేతలిప్పుడిపుడే మెల్లగా కోలుకొంటున్నారు. ముందుగా కోలుకొన్న కేసీఆర్, కాంగ్రెస్ తో విలీనం ప్రసక్తి లేదని ప్రకటించి, దానిని కొంత దారిలోకి తెచ్చుకోన్నాక, ఆ మరునాడే ఆయన కుమారుడు ఈ నెల 23లోగా తెలంగాణా ఇస్తే, తాము మాటకు కట్టుబడి తెరాసను కాంగ్రెస్ లో విలీనం చేస్తామని మరో ఆఫర్ ఇచ్చారు. “కాంగ్రెస్ పార్టీ నిజంగానే తెలంగాణా ఇచ్చే ఉద్దేశ్యమే ఉంటే, దిగ్విజయ్ సింగ్ ప్రకటించినట్లే పదిరోజుల్లో కాకపోయినా, కనీసం పంచాయితీ ఎన్నికలు మొదలయ్యేలోగానైనా తెలంగాణా ప్రకటించాలి. అప్పుడు ప్రజలే కాంగ్రెస్ కి ఓటు వేసి గెలిపిస్తారు. కానీ, ఆలోగా ఇవ్వకపోతే వారిచేతిలో కాంగ్రెస్ భూస్థాపితం కాక తప్పదు. కాంగ్రెస్ పార్టీకి ఇదే ఆఖరి అవకాశం” అని ఆయన అన్నారు.
కేటీఆర్ ఈవిధంగా డిమాండ్ చేయడం పైకి చాల సహజంగానే కనిపిస్తున్నపటికీ, దానివెనుక కాంగ్రెస్ తాజా వాగ్దానంతోనే కాంగ్రెస్ పార్టీని ఇరికించి, రానున్న పంచాయితీ ఎన్నికలలో ఆ పార్టీని పూర్తిగా దెబ్బతీయాలనే ఆలోచన దాగి ఉంది. ఒక్క తెరాసకే కాదు యావత్ రాష్ట్ర ప్రజలకి కూడా కాంగ్రెస్ పదిరోజుల్లో తెలంగాణా ఇవ్వలేదని నమ్ముతున్నారు. గనుకనే, కేటీఆర్ కూడా కాంగ్రెస్ కు తన వాగ్దానం గురించి మరో మారు గుర్తు చేసి, అది ఇవ్వకపోతే ఏమిచేయాలో తెలంగాణా ప్రజలకు హిత బోధ చేస్తున్నారు.
ఈవిధంగా తెరాస నేతలందరూ కాంగ్రెస్ పై ఒత్తిడి తెస్తూ, అది ఎలాగూ పదకొండో రోజున గతంలో లాగే ‘పది రోజులంటే పది రోజులు కాదంటూ’ చెప్పక తప్పదు గనుక, అప్పుడు కాంగ్రెస్ ని ప్రజల ముందు దోషిగా నిలబెట్టి, పంచాయితీ ఎన్నికలలో పూర్తి ఆధిపత్యం సంపాదించవచ్చుననే ఆలోచనతోనే ఈవిధమయిన డిమాండ్ చేస్తున్నారు. ఇక కాంగ్రెస్ కూడా మళ్ళీ మరో మారు తనకు తానే పదిరోజుల డెడ్ లైన్ విధించుకొని మరో పెద్ద పొరపాటు చేసింది. ఆ పొరపాటుకి పంచాయితీ ఎన్నికలలో అది మూల్యం చెల్లించేలా చేయడమే తెరాస లక్ష్యం.
ఈ వంకతో తెరాస ఎన్నికలలో ఆదిపత్యం సంపాదించగలిగితే, ఇంత వరకు తనపై వచ్చిన ఆరోపణలన్నీ గాలికి కొట్టుకొనిపోతాయని తెరాస అభిప్రాయం. అందువల్ల ఎన్నికలు దగ్గిరపడుతున్న కొద్దీ తెరాస తన డిమాండును మరింత గట్టిగా వినిపిస్తూ, ప్రజలకి కాంగ్రెస్ పార్టీ తమని మరోసారి మోసం చేసిందనే భావన కల్పించే ప్రయత్నాలు తప్పక చేస్తుంది.