బాబు లేఖాస్త్రం.. వైసీపీకి దమ్ముందా.. ఒమిక్రాన్ కలకలం..టాప్ న్యూస్@7PM
posted on Dec 12, 2021 @ 5:57PM
కర్నూలు జిల్లా కోసిగిలో తిక్కారెడ్డిపై దాడి జరగడంపై టీడీపీ సీరియస్ గా స్పందించింది. ఘటనలో చర్యలు తీసుకోవాలని ఆ పార్టీ అధినేత చంద్రబాబు డిమాండ్ చేశారు. ఈ మేరకు డీజీపీ గౌతం సవాంగ్‌కు లేఖ రాశారు. తిక్కారెడ్డిపై వైసీపీ కార్యకర్తలు దాడి చేశారని ఆరోపించారు. ఈ ఘటనలో ఐదుగురు టీడీపీ కార్యకర్తలు గాయపడినట్టు లేఖలో చంద్రబాబు వివరించారు. రాష్ట్రంలో వైసీపీ కార్యకర్తల అరాచకాలను అడ్డుకోవడంలో పోలీసులు విఫలమవుతున్నారని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు.
--------
స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ప్లకార్డ్ పట్టుకునే దమ్ము వైసీపీ ఎంపీలకు ఉందా అని పవన్ కల్యాణ్ ప్రశ్నించారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా చేపట్టిన దీక్షను విరమించిన పవన్ కల్యాణ్.. వైసీపీ నేతలపై మండిపడ్డారు. వైసీపీ నేతలు తమకు శత్రువులు కాదని.. వారి విధానాలనే వ్యతిరేకిస్తున్నామన్నారు. పోరాడి తెచ్చుకున్న ప్లాంట్‌ను ఎలా ప్రైవేటీకరిస్తారని ప్రశ్నించారు. స్టీల్‌ప్లాంట్ అనేది ఒక పరిశ్రమ మాత్రమే కాదని అది పోరాటాలకు, త్యాగాలకు గుర్తు అని చెప్పారు.
--------
ఆర్మీ హెలికాఫ్టర్ ప్రమాదంలో మృతి చెందిన వీర జవాన్ సాయితేజ అంత్యక్రియలు స్వగ్రామంలో జరిగాయి. పోలీసులు, సైనిక లాంఛనాలతో పూర్తయ్యాయి. పోలీసులు గాలిలో మూడు రౌండ్ల కాల్పులు జరిపి గౌరవ వందనం సమర్పించారు. సాయితేజ అంత్యక్రియాలకు బంధుమిత్రులు, అభిమానులు, ప్రజలు భారీగా తరలి వచ్చారు. తీవ్ర విచార వదనాలతో సాయితేజకు వీడ్కోలు పలికారు.
---------
ఆంధ్రప్రదేశ్ లో కొవిడ్ కొత్త వేరియంట్ ఒమిక్రాన్ కలకలం రేపుతోంది. ఇప్పటికే ఒక విశాఖలో ఒమిక్రాన్ కేసు నిర్దారణ కాగా.. తిరుపతికి చెందిన మరో యువకుడికి ఒమిక్రాన్ సోకిందని తెలుస్తోంది. బ్రిటన్ నుంచి తిరుపతి వచ్చిన వ్యక్తికి ఒమిక్రాన్ లక్షణాలున్నాయని చెబుతున్నారు. 34 ఏళ్ల ఆ వ్యక్తి శాంపిల్స్ జీనోమ్ టెస్ట్ కు పంపించారు. అవి వచ్చాకే ఒమిక్రాన్ సోకింది లేనిది నిర్దారణ కానుంది. కొవిడ్ పాజిటివ్ వచ్చిన వ్యక్తి ఈ నెల 8న ఢిల్లీ నుంచి తిరుపతికి వచ్చాడు
---
గోదావరి జిల్లాల ప్రజలు జగన్ సర్కారుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కొందరైతే తమ వెటకారంతో జగన్ సర్కారుకు హెచ్చరికలు చేస్తున్నారు. ఈ క్రమంలో తూర్పుగోదావరి జిల్లాలోని ఓ రోడ్డుపై పెట్టిన బోర్డు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ‘జగన్ అన్న ఉన్నాడు జాగ్రత్త.. రోడ్డు వేసే వరకు ఎవరైనా ఈ బోర్డును తొలగిస్తే వారి కుటుంబం ఈ రోడ్డుపైనే పోతుంది’ అనేలా జగన్ ఫొటోలతో ఫ్లెక్సీ చేయించి బోర్డు పెట్టారు.
----
ఏపీ స్కిల్ డెవలప్‌మెంట్ స్కామ్ కేసులో ముగ్గురు నిందితులను సీఐడీ పోలీసులు అరెస్టు చేశారు. ఏ6గా సౌమ్యాద్రి శేఖర్ బోస్, ఏ8గా వికాస్ కన్విల్కర్, ఏ10గా ముకుల్ అగర్వాల్‌ను ఎఫ్ఐఆర్‌లో నమోదు చేశారు. వైద్య పరీక్షల అనంతరం వారిని ఏసీబీ కోర్టులో సీఐడీ అధికారులు హాజరుపర్చారు. ముగ్గురు నిందితులపై విచారణ జరిపిన న్యాయస్థానం వారికి 12 రోజులపాటు రిమాండ్ విధిస్తూ... తదుపరి విచారణ ఈనెల 24కు వాయిదా వేసింది.
---------
పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయంలో 'ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్' (ఈబిఎస్ బి) పై ఛాయాచిత్ర ప్రదర్శనను ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు ఆదివారం ప్రారంభించారు. కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ కు చెందిన రీజనల్ అవుట్ రీచ్ బ్యూరో ఈ ప్రదర్శనను ఏర్పాటు చేసింది.ఈబిఎస్ బి కింద జత చేసిన హర్యానా, తెలంగాణ రాష్ట్రాల వివిధ ఆసక్తికరమైన అంశాలను,కళా రూపాలు, వంటకాలు, పండుగల చిత్రాలు ఏర్పాటు చేశారు
----
టీఆర్ఎస్ మంత్రి గంగుల కమలాకర్ ఎన్నికల నియమావళిని ఉల్లంఘించారని ఎమ్మెల్సీ అభ్యర్థి రవీందర్ సింగ్ ఆరోపించారు. కండువాలతో పోలింగ్ బూత్‌లోకి వచ్చారని, పోలీసులు కూడా వారికి వత్తాసు పలకడం రాజ్యాంగ ఉల్లంఘనే అన్నారు. తాను పోటీలో ఉండటమే పెద్ద విజయంగా భావిస్తున్నానన్నారు. తనకు తన ఓటు కంటే ఎన్ని ఓట్లు ఎక్కువ వస్తే అదే తన విజయంగా భావిస్తానన్నారు.
--------
కిట్టి పార్టీల పేరుతో అధిక వడ్డీలు ఆశ చూపి మోసం చేసి అరెస్ట్ అయిన శిల్పాచౌదరీ కస్టడీని నార్సింగి పోలీసులు వేగవంతం చేశారు. శిల్పాచౌదరికి బ్లాక్ మనీని వైట్‌గా మార్చడానికి ఇచ్చిన వ్యక్తులకు నోటీసులు జారీ చేశారు. 90 కోట్ల రూపాయలు శిల్పాకి విదేశాలో పెట్టుబడుల కోసం ఇచ్చిన వారందరికీ ఇప్పటికే నోటీసులు అందినట్టు సమాచారం. ఎవరెవరు ఇచ్చారు?... ఒక్కొక్కరు ఎంత డబ్బు ఇచ్చారు? అన్న కోణంలో పోలీసులు విచారణ చేస్తున్నారు.
---------
మత ప్రాతిపదికపై ఇండియా విభజన చారిత్రక తప్పిదమని కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అన్నారు. 1971 భారత్-పాక్ యుద్ధం మనకు చెబుతున్నదదేనని పేర్కొన్నారు. 1971లో భారత్ విజయం,ఇండో-బంగ్లాదేశ్ మధ్య మైత్రీ సంబంధాలు 50వ పడిలో పడిన సందర్భంగా ఇండియా గేట్ వద్ద ఆదివార జరిగిన 'సర్ణిమ్ విజయ్ పర్వ్'లో రాజ్‌నాథ్ పాల్గొని ప్రసంగించారు.