అమరావతికి ఢిల్లీ మద్దతు.. రంగంలోకి అమిత్ షా.. అలా ముగిసింది.. టాప్ న్యూస్@1PM
posted on Dec 8, 2021 @ 11:58AM
అమరావతి రైతుల మహాపాదయాత్రకు ఊహించని విధంగా మద్దతు లభిస్తోంది. తాజాగా ఢిల్లీ రైతు ప్రతినిధులు మద్దతు తెలుపుతూ అమరావతి రైతులతో కలిసి నడిచారు. అమరావతి రైతుల పోరాటం ఫలిస్తుందని, వారి సమస్యను జాతీయ సమస్యగా గుర్తిస్తున్నామని తెలియజేశారు. మూడు రోజులు ఇక్కడే ఉండి పాదయాత్రలో పాల్గొంటామన్నారు ఢిల్లీ రైతు ప్రతినిధులు.
-------
పార్లమెంటు సాక్షిగా ఎంపీ రఘురామకృష్ణంరాజును వైసీపీ అవమానించిందని టీడీపీ ఎమ్మెల్సీ మంతెన సత్యనారాయణ రాజు అన్నారు. సమస్యను ఎత్తిచూపితే ఎదురుదాడికి దిగడం వైసీపీ ప్రభుత్వంలో రివాజుగా మారిందన్నారు. వరదల అంశాన్ని పక్కదారి పట్టించడానికే అసెంబ్లీలో చంద్రబాబు సతీమణిపై వ్యక్తిత్వ హననానికి పాల్పడ్డారన్నారు. రాష్ట్ర అసెంబ్లీని కౌరవ సభగా మార్చిన వైసీపీ నేతలు... ఇప్పుడు ఈ జాడ్యాన్ని పార్లమెంటుకు కూడా అంటించారని ఆరోపించారు.
------
ఏపీలో 11 మంది వైసీపీ ఎమ్మెల్సీలు ప్రమాణస్వీకారం చేశారు. మండలి చైర్మన్ కార్యాలయంలో కొత్త ఎమ్మెల్సీలతో చైర్మన్ మోషేన్‌రాజు ప్రమాణం చేయించారు. శివరామిరెడ్డి, అరుణ్, రఘురాం, ఉదయ్‌భాస్కర్, ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, హనుమంతరావు, రఘురాజు, కల్యాణి, మాధవరావు, కృష్ణరాఘవ జయేంద్ర భారత్, శ్రీనివాస్ ఎమ్మెల్సీలుగా ప్రమాణస్వీకారం చేశారు.
-----
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ మంగళగిరి నియోజకవర్గంలో పర్యటిస్తున్నారు. మంగళగిరి టౌన్‌లోని 19, 20, 24 వార్డుల్లో పర్యటిస్తున్న లోకేష్... అక్కడి ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఇటీవల మరణించిన కార్యకర్తలు, నాయకుల ఇళ్లకు వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించారు నారా లోకేష్.
----
మాజీ సీఎం కొణిజేటి రోశయ్య విషయంలో వైసీపీ ప్రభుత్వం నిర్లక్ష్యంగా ఉందని మాజీ ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు విమర్శించారు. పిడుగురాళ్ల లో రోశయ్య కాంస్య విగ్రహాన్ని ప్రభుత్వం ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.వచ్చే మార్చి నాటికల్లా పిడుగురాళ్లలో రోశయ్య విగ్రహం పెట్టాలన్నారు. ప్రభుత్వం స్పందించకపోతే టీడీపీ తరుపున తామే కాంస్య విగ్రహం ఏర్పాటు చేస్తామని స్పష్టం చేశారు
------
సింహాచలం దేవస్థానం భూముల పరిరక్షణ కోరుతూ సింహాచలం దేవాలయం తొలి పావంచా వద్ద బీజేపీ ఆధ్వర్యంలో ధర్నాకు దిగారు. భూములు పరిరక్షణ చేయాలని కోరుతూ తొలి పావంచా నుంచి సింహాచలం ఈవో కార్యాలయం పాదయాత్ర చేపట్టారు. అనంతరం ఈవోకి బీజేపీ నేతలు వినతి పత్రం సమర్పించారు. ఈ ధర్నాలో బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు విష్ణుకుమార్ రాజు, ఎమ్మెల్సీ మాధవ్ పాల్గొన్నారు
----
కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా తో తెలంగాణ బిజేపి నాయకులు గురువారం భేటీ కానున్నారు. బండి సంజయ్ కు అందుబాటులో వుండమని అమిత్‌షా ఆఫీసు నుండి ఫోన్ వచ్చింది. రాష్ట్ర ఇన్‌చార్జు తరుణ్ చుగ్ కూడా ఆహ్వానం అందింది. రాష్ట్ర రాజకీయాలు,ముఖ్యంగా వరి విషయంలో రాష్ట్రప్రభుత్వం వైఖరిపై చరించే అవకాశం వుంది. 2023ఎన్నికల అజెండా కూడా సమావేశంలో చర్చించనున్నట్లు తెలుస్తుంది.
--
నల్గొండ జిల్లాలో ఓ దళితుడిని చితకబాది గాయపర్చిన కేసులో నల్గొండ జిల్లా టూ టౌన్ ఎస్ఐ నర్శింహులు, కానిస్టేబుల్ నాగుల్ మీరాపై సస్పెన్షన్ వేటు పడింది. రవీంద్ర నాయక్ కాలనీకి చెందిన రియల్ ఎస్టేట్ వ్యాపారి రొయ్యల శ్రీనును గాయపర్చిన ఘటనపై పోలీస్ ఉన్నతాధికారులు విచారణ జరిపి ఈ మేరకు చర్యలు తీసుకున్నారు.
------
తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన టాలీవుడ్ డ్రగ్స్ కేసులో ఈడీ విచారణ ముగిసింది. ఈడీ కేసులో కూడా సినీ ప్రముఖులకు క్లీన్‌చిట్ లభించింది. డ్రగ్స్ దిగుమతులతో పాటు నిధులు మళ్లింపుపై ఈడీ సుదీర్ఘంగా దర్యాప్తు చేసింది. ఈ కేసుకు సంబంధించి టాలీవుడ్‌కు చెందిన 12 మంది నటీనటులను ఈడీ విచారించింది. సరైన ఆధారాలు లభించకపోవడంతో కేసు మూసివేతకు రంగం సిద్ధమైంది.
---
జమ్మూకశ్మీర్‌లో బుధవారం ఉదయం జరిగిన ఎన్‌కౌంటర్‌లో ముగ్గురు గుర్తుతెలియని ఉగ్రవాదులు హతం అయ్యారు. షోపియాన్ జిల్లా ఈ చోలన్ గ్రామం వద్ద ఉగ్రవాదులున్నారనే సమాచారం మేర జమ్మూకశ్మీర్ పోలీసులు ఆర్మీ, సీఆర్‌పీఎఫ్ బలగాలతో కలిసి కార్డన్ సెర్చ్ చేపట్టారు. ఉగ్రవాదులు కనిపించడంతో భద్రతా బలగాలు కాల్పులు జరిపారు. ఎదురుకాల్పుల్లో ముగ్గురు గుర్తుతెలియని ఉగ్రవాదులు మరణించారని జమ్మూకశ్మీర్ జోన్ పోలీసులు ట్వీట్ చేశారు.