డ్రంకెన్ డ్రైవ్ కేసు.. పక్కనున్నా, వెనుక ఉన్నా జైలు!
posted on Dec 8, 2021 @ 12:07PM
అర్థరాత్రి వరకూ పార్టీ చేసుకుంటారు. ఫుల్లుగా తాగేసి వాహనంలో రోడ్డు మీదకొస్తారు. తాగినోళ్లే కంట్రోల్‌లో ఉండరు.. ఇక బండినేం కంట్రోల్ చేస్తారు? తాగిన మైకంలో సరిగ్గా నడవనే లేరు.. ఇక కారునేం నడుపుతారు? ఒకడు వెహికిల్ డ్రైవ్ చేస్తుంటే.. మిగతా వారు పక్కన చేరి ఎంజాయ్ చేస్తుంటారు. డ్రంకెన్ డ్రైవ్ చేయకూడదని తెలిసినా.. పోలీసులు పట్టుకుంటారనే భయమే ఉండటం లేదు. అంతా తాగి ఉండటంతో.. ఎవడో ఒకడు బండి నడపాల్సిందే. కేసు అయితే డ్రైవింగ్ చేసినవాడినే పట్టుకుంటారు.. తమకేం కాదనే ధీమాతో మిగతా వారు సైతం డ్రంకెన్ డ్రైవ్‌ను ఎంకరేజ్ చేస్తున్నట్టు పోలీసులు గుర్తించారు. అందుకే, ఇకపై పక్కన.. వెనకాల ఉన్న వారిపైనా కేసులు పెట్టి.. జైలుకు పంపించాలని పోలీసులు డిసైడ్ అయ్యారు. ఇప్పటికే అమలు కూడా చేసి చూపించారు.
కార్లు, బైకుల్లో మందుబాబులతో పాటు ప్రయాణిస్తున్న స్నేహితులు, సన్నిహితులపైనా కేసులు నమోదు చేసి జైలుకు పంపుతున్నారు హైదరాబాద్ పోలీసులు. మద్యం తాగి కారులో వేగంగా వెళుతూ బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 2లో ప్రమాదం చేసి ఇద్దరిని బలిగొన్న రోహిత్ గౌడ్‌తో పాటు అతడి పక్కన కూర్చున్న సోమన్‌ను కూడా అరెస్టు చేసి జైలుకు పంపించారు. ఇలాంటి ఘటనలు ఇకపై జరగకుండా, వాహనదారుల్లో భయం పెంచేందుకు ఇలా చేస్తున్నారు.
హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ పోలీస్ కమిషనరేట్ల పరిధిలో 2 నెలల్లో 48 మంది చనిపోయారు. వీరంతా మద్యం మత్తులో డ్రైవర్లు చేసిన ప్రమాదంతోనే ప్రాణాలు కోల్పోయారు. ఇలా, తాగుబోతుల డ్రైవింగ్ వల్ల అమాయకులు మృత్యువాత పడుతుండటాన్ని సీరియస్‌గా తీసుకున్నారు పోలీసులు. డ్రంకెన్ డ్రైవ్ ఘటనలు తగ్గించేలా.. వారిలో భయం కలిగేలా.. కఠిన చర్యలు చేపడుతున్నారు. డ్రంక్ అండ్ డ్రైవ్‌తో ప్రమాదాలకు కారణమైన వారిపై పోలీసులు ఐపీసీ 304 పార్ట్-2 సెక్షన్ కింద కేసు నమోదు చేస్తున్నారు. ఇకపై డ్రైవర్లతో పాటు పక్కన, వెనుక కూర్చున్న వారు కూడా జైలుకు వెళ్లాల్సిందేనని హెచ్చరిస్తున్నారు. మద్యం తాగిన వ్యక్తి వాహనం నడుపుతుంటే పక్కన గానీ/ వెనకాల గానీ.. కూర్చోవడం కూడా తప్పే. తప్పును ప్రోత్సహిస్తున్నట్టే. అందుకు శిక్ష అనుభవించాల్సిందే.