వెంకయ్యను కీర్తించిన షా.. కుప్పంలో అరాచకాలు.. గొడ్డలి వేట్లు ఎవరివి.. టాప్ న్యూస్@1PM
posted on Nov 14, 2021 @ 11:28AM
ఉపరాష్ట్రపతి వెంకయ్య స్వస్థలంలో ఆయన గురించి మాట్లాడాలన్న తన అభిలాష ఇప్పుడు నెరవేరిందని కేంద్ర హోంమంత్రి అమిత్‌షా అన్నారు. ఆదివారం వెంకటాచలంలో స్వర్ణభారత్ ట్రస్ట్ 20వ వార్షికోత్సవ వేడుకలకు ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, కేంద్ర హోంమంత్రి అమిత్‌షా హాజరయ్యారు. ఈ సందర్భంగా అమిత్ షా మాట్లాడుతూ బీజేపీ గ్రాఫ్ పెరగడానికి వెంకయ్య ముఖ్య కారణమని...ఆయన క్రమశిక్షణకు మారుపేరని అన్నారు.-----------అమరావతి రాజధాని కోసం రైతులు చేపట్టిన మహాపాదయాత్ర ప్రభంజనంలా సాగుతోంది. 14వ రోజుకు చేరింది. ప్రకాశం జిల్లాలోని పర్చూరు, అద్దంకి, సంతనూతలపాడు, ఒంగోలు నియోజవర్గాలు దాటి కొండేపి నియోజకవర్గంలోకి పాదయాత్ర అడుగుపెట్టింది. ఇప్పటి వరకు రైతుల మహాపాదయాత్ర 152.9 కి.మీ. పూర్తి చేసుకుంది. రైతుల పాదయాత్రకు సంఘీభావం తెలిపేందుకు భారీ ఎత్తున మహిళలు తరలివస్తున్నారు.
------------
‘‘బాబాయ్‌ని లేపేసి నారాసుర రక్తచరిత్ర అంటూ చంద్రబాబుపై నీ దొంగ పేపర్లో రాయించిన అబ్బాయి జగనూ... సుపారీ రూ.40 కోట్లు, గొడ్డలి వేట్లు నీ ఇంటివేనట కదా! ఇప్పుడేం రాయిస్తారు మీ పత్రికలో..!’’ అని తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ప్రశ్నించారు. ఈ మేరకు ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. మరోవైపు ఎయిడెడ్ విద్యాసంస్థల విలీనంపై జారీ చేసిన జీవోలను కొట్టివేయాలన్నారు లోకేష్.
----------
కుప్పంలో అధికార పార్టీ అరాచకాలు పెరిగిపోతున్నాయి. కుప్పం మున్సిపాలిటీ పరిధి పాతపేట మునిస్వామిపురంలో ఘర్షణ చోటు చేసుకుంది. టీడీపీ శ్రేణులపై వైసీపీ కార్యకర్తలు దాడి చేశారు. ఈ ఘటనలో పలువురికి గాయాలయ్యాయి. కుప్పంలో ఓటర్లకు స్థానికేతరులు డబ్బులు పంచుతున్నారని టీడీపీ శ్రేణులు ఆరోపిస్తూ.. అడ్డుకున్నారు. ఈ నేపథ్యంలో ఇరు వర్గాల మధ్య ఘర్షణ జరిగి.. పలువురు గాయపడ్డారు. వారిని ఆస్పత్రికి తరలించారు.
----------
తిరుపతిలో నిర్వహిస్తున్న 29వ సదరన్ జోనల్ కౌన్సిల్ సమావేశానికి హాజరయ్యేందుకు వచ్చిన కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా, ఏపీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఈ ఉదయం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, ఈవో డాక్టర్ కేఎస్ జవహర్‌రెడ్డి, వేదపండితులు మహాద్వారం వద్ద వీరికి స్వాగతం పలికారు. అనంతరం స్వామివారిని దర్శించుకున్న షా, జగన్‌కు రంగనాయకుల మండపంలో వేద పండితులు ఆశీర్వచనాలు పలికారు.
------
కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా తిరుపతి పర్యటనను అడ్డుకుంటామని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ ఇటీవల హెచ్చరించిన నేపథ్యంలో తిరుపతి పోలీసులు అప్రమత్తమయ్యారు. షా నేటి తిరుపతి పర్యటన నేపథ్యంలో కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసిన పోలీసులు తిరుపతి బైరాగిపట్టెడలో వాకింగ్ చేస్తున్న నారాయణను అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్‌కు తరలించారు.
----------
ఒకరోజు మాత్రమే అసెంబ్లీ సెషన్స్ నిర్వహణపై టీడీపీ సీనియర్ నేత యనమల రామకృష్ణుడు మండిపడ్డారు. ఇది జగన్ రెడ్డి పలాయనవాదానికి నిదర్శనమన్నారు. చట్టసభలపై జగన్ రెడ్డి నిర్లక్ష్యానికి నిలువుటద్దమని వ్యాఖ్యానించారు. అసెంబ్లీ, కౌన్సిల్ ఫేస్ చేయాలంటే జగన్‌లో సైకో ఫియర్ ఉందన్నారు. కనీసం 15 రోజులు సెషన్స్ పెట్టాలని టీడీఎల్పీ తరఫున తాము డిమాండ్ చేస్తున్నామని తెలిపారు.పెట్రోల్, డీజిల్ ధరల పెంపుతో ప్రజలపై భారాలు మోపారన్నారు.
----------
మావోయిస్టు నేత ఆర్కే జీవిత చరిత్రను ప్రచురించడానికి అనుమతివ్వాలని ఆర్కే సతీమణి శిరీష కోరారు. చనిపోయిన తర్వాత ఎవరైనా సంస్మరణ సభ జరుపుకుంటారని...తాను అదే విధంగా ఆర్కే సంస్మరణ సభ చేయాలని ప్రయత్నిస్తే అడ్డుకున్నారని అన్నారు. 2004 ఆర్కేతో చర్చలకు వచ్చినపుడు మీడియాలో వచ్చిన కథనాలు, ఫోటోలు జ్ఞాపకాలు దాచుకున్నానని తెలిపారు.2010లో అరెస్ట్ అయినప్పుడు తనపై వచ్చిన ఆరోపణలు, కథనాలు కూడా దాచుకున్నానన్నారు.
----
కరీంనగర్ జిల్లాలోని గంగాధర వ్యవసాయ మార్కెట్‌లో భారీ వర్షాల కారణంగా ధాన్యం తడిసిపోయింది. వర్షానికి ధాన్యం డ్రైనేజీలో కొట్టుకుపోవడంపై రైతులు ఆవేదన చెందుతున్నారు. నెల రోజులు అయినా అధికారులు ధాన్యం కొనడం లేదని రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారుల నిర్లక్ష్యం వల్లే ధాన్యం తడిసిందని రైతులు మండిపడ్డారు.
---------
ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ కంచుకోట అయిన గోరఖ్‌పూర్ నుంచి సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ ప్రచార యాత్ర చేపట్టారు. ద్రవ్యోల్బణం ప్రధానాంశంగా ఆయన బీజేపీ పాలనను తన యాత్రలో తూర్పారబడుతున్నారు. అడుగడునా ఆయన యాత్రకు ప్రజల నుంచి పెద్దఎత్తున స్పందన కనిపిస్తోంది. ప్రత్యేకంగా డిజైన్ చేసిన వాహనంలో అఖిలేష్ తన యాత్ర సాగిస్తూ, బీజేపీ పాలనలో ధరల పెరుగదలను ఎండగడుతున్నారు.