ఏపీలో మద్యం మాఫియా.. విదేశాలకు పట్టాభి.. చప్పగా గులాబీ ప్లీనరీ... షమీకి అసద్ సపోర్ట్ టాప్ న్యూస్@7PM
posted on Oct 25, 2021 @ 7:41PM
ఏపీలో మద్యపాన నిషేధమని చెప్పి జగన్‌రెడ్డి సొంత వ్యాపారం చేస్తున్నారని టీడీపీ అధినేత చంద్రబాబు విమర్శించారు. సోమవారం రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌ను కలిసిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వ ఆధ్వర్యంలోనే మద్యం మాఫియా నడుస్తోందని ఆరోపించారు. డ్రగ్స్‌తో యువత నిర్వీర్యం అవుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. డ్రగ్స్ కంట్రోల్ చేయమని అడిగితే ప్రభుత్వం నుంచి స్పందన లేదన్నారు
---------
రాజమండ్రి జైలు నుంచి విడుదలైన టీడీపీ నేత పట్టాభి విమానంలో ప్రత్యక్షమయ్యారు. జైలు నుంచి విడుదల తరువాత ఆయన అజ్ఞాతంలో ఉన్నారు. తాజాగా విమానంలో ప్రయాణం చేస్తున్న ఫొటోలు వెలుగులోకి వచ్చాయి. మాల్దీవ్స్‌కు పట్టాభి అంటూ సోషల్ మీడియాలో పోస్టులు వైరల్ అవుతున్నాయి. అయితే టీడీపీ నేతలు, కుటుంబ సభ్యులు నిర్ధారించలేదు.
-------
జనసేన అధినేత పవన్ కల్యాణ్ విశాఖ ఉక్కు పరిరక్షణ సమితి నిర్వహించనున్న సభకు హాజరవనున్నారు. ఈ విషయాన్ని జనసేన పార్టీ ఓ ప్రకటన ద్వారా తెలియజేసింది. ఈ నెల 31న మధ్యాహ్నం 2 గంటలకు ఈ సభను నిర్వహించనున్నారు. 31వ తేదీన పవన్ విశాఖ చేరుకుంటారు. అనంతరం స్టీల్ ప్లాంట్ ప్రాంగణానికి చేరుకుని సభలో పాల్గొంటారు.
------
టీడీపీ ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్‌కు సుప్రీంలో ఊరట లభించింది. గొట్టిపాటి రవికుమార్ గ్రానైట్ కంపెనీ మూసివేతకు ఏపీ ప్రభుత్వం ఇచ్చిన షోకాజ్ నోటీసుపై సుప్రీంకోర్టు స్టే విధించింది. గొట్టిపాటి గ్రానైట్ కంపెనీలో అవకతవకలు జరిగాయంటూ విజిలెన్స్ కమిషన్ నివేదిక ఇచ్చింది. రూ.50 కోట్ల జరిమానాకు సిఫారసు చేసింది. ఏపీ ప్రభుత్వ షోకాజ్ నోటీసును హైకోర్టు సింగిల్ జడ్జి బెంచ్ కొట్టివేసింది. సింగిల్ జడ్జి బెంచ్ ఉత్తర్వులను హైకోర్టు డివిజన్ బెంచ్ పక్కన పెట్టింది. డివిజన్ బెంచ్ ఆదేశాలను సుప్రీంలో ఎమ్మెల్యే గొట్టిపాటి సవాలు చేశారు
------
ఏపీలో 46 శాతం మందికి రెండు డోసుల వ్యాక్సిన్ పూర్తి అయినట్టేనని వైద్యారోగ్య శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ అనిల్ కుమార్ సింఘాల్ తెలిపారు. ఇప్పటికి ఏపీలో 5 కోట్ల 2 లక్షల 40 వేల పై చిలుకు డోసుల కరోనా వ్యాక్సిన్ పూర్తి అయ్యిందన్నారు. 1.85 కోట్ల మందికి రెండు డోసుల వ్యాక్సిన్ పూర్తయిందన్నారు. కనీసం ఒక్క డోసు వ్యాక్సిన్ 85.35 శాతం మేర పూర్తి అయ్యిందని ఆయన పేర్కొన్నారు. మళ్ళీ రాష్ట్ర వ్యాప్తంగా డోర్ టూ డోర్ సర్వే చేస్తామని ఆయన తెలిపారు
-------
తెలంగాణలో అమలుచేస్తున్న కార్యక్రమాలు, సీఎం కేసీఆర్ నాయకత్వంలో ‘త్రీఐమంత్ర’ నడుస్తోందని టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కె. తారక రామారావు అన్నారు. త్రీ ఐ అంటే ఇన్నోవేషన్, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, ఇన్ క్లూజివ్ గ్రోత్ అని వివరించారు. టీఆర్‌ఎస్ ప్లీనరీలో పార్టీవర్కింగ్ ప్రెసిడెంట్ హోదాలో తాను మాట్లాడుతున్నానని చెప్పారు.హైదరాబాద్‌నగరం గూగుల్‌కు గుండెకాయలా, అమెజాన్‌కు ఆయువుపట్టులాంటిదని కేటీఆర్ అభివర్ణించారు.
-----
ఏడున్నర ఏళ్ల పాలనపై చర్చకు సిద్ధమా అంటూ సీఎం కేసీఆర్‌కు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి సవాల్ విసిరారు. నిరుద్యోగులకు ఉద్యోగాలు లేక, విద్యార్థులకు స్కాలర్ షిప్ లేక ఇబ్బందులు పడుతున్నారని ఆయన వ్యాఖ్యానించారు. కేజీ టు పీజీ వరకు ఉచిత విద్యపై చర్చకు సిద్ధమా అని రేవంత్ సవాల్ విసిరారు. ఉద్యమకారులపై పెట్టిన కేసులు ఎందుకు తొలగించడంలేదని నిలదీశారు. కవిత, కేటీఆర్, కేసీఆర్‌పై పెట్టిన కేసులు తొలగించుకున్నారని రేవంత్ ప్రశ్నించారు.
------
రాష్ట్రంలో ప్రశ్నించేవారు ఉండొద్దనే కేసీఆర్ ఆలోచన అని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మండిపడ్డారు. ఇచ్చిన హామీలు ఏమయ్యాయో కేసీఆర్ చెప్పాలి? అని ఆయన ప్రశ్నించారు. టీఆర్ఎస్ అబద్ధాల, అవినీతి, కుటుంబ పార్టీ అని విమర్శించారు. తెలంగాణ ప్రజలను కేసీఆర్ బానిస అనుకుంటున్నారని చెప్పారు. ఈటలను, ఆయన భార్యను జైల్లో పెట్టడానికి కేసీఆర్ కుట్ర చేస్తున్నారని ఆరోపించారు.
----------
ఏ సర్వే చూసినా హుజూరాబాద్ లో ఈటల రాజేందర్ దే విజయమని చెపుతున్నాయని బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు అన్నారు. టీఆర్ఎస్ ఓడిపోబోతోందని ఇంటెలిజెన్స్ సమాచారం ఇచ్చిందని... అందుకే హుజూరాబాద్ కు ముఖ్యమంత్రి కేసీఆర్ రావడం లేదని చెప్పారు. ఏప్రిల్ 27కి ముందు టీఆర్ఎస్ ప్లీనరీ పెట్టుకోవాలి కదా? ఇప్పుడెందుకు పెట్టుకున్నారని ప్రశ్నించారు.
--------
పంజాబ్ సరిహద్దు నుంచి 50 కిలోమీటర్ల లోపలకి వచ్చి కార్యకలాపాలు నిర్వహించేలా భారత సరిహద్దు రక్షణా దళాలకు (బీఎస్‌ఎఫ్) అధికారం ఇవ్వడాన్ని సవాలు చేస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయించనున్నట్లు పంజాబ్ ముఖ్యమంత్రి చరణ్‌జిత్ సింగ్ చన్నీ పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయాన్ని మొదటి నుంచి వ్యతిరేకిస్తూ వస్తున్న ఆయన.. కేంద్రానికి పలుమార్లు ఈ విషయమై ప్రతిపాదనలు చేశారు
---------
పాకిస్తాన్ తో ఓడిపోయిన మ్యాచ్ లో బౌలర్ షమీని దూషిస్తున్నారంటూ హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ ఆగ్రహం వ్యక్తం చేశారు. ముస్లింలపై విద్వేషం, వ్యతిరేకత వెళ్లగక్కుతున్నారని వివరించారు. క్రికెట్ లో గెలుపోటములు సహజమని, జట్టులో 11 మంది ఆటగాళ్లు ఉంటే కేవలం ఒక ముస్లిం ఆటగాడినే లక్ష్యం చేసుకుని విమర్శిస్తున్నారని తెలిపారు. దీన్ని బీజేపీ ప్రభుత్వం ఖండిస్తుందా? అని ఒవైసీ ప్రశ్నించారు.