ఇటు మోడీ.. అటు ప్రియాంక! యూపీ కాంగ్రెస్ లో కొత్త ఆశలు..
posted on Oct 25, 2021 @ 7:41PM
ఉత్తర ప్రదేశ్ లో అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా నాలుగు నెలలకు పైగానే సమయం ఉంది. అయినా ఇంతలోనే మొదలైన ఎన్నికల వేడి రోజురోజుకు రైజ్ అవుతోంది. ఒక వంక ప్రధానినరేంద్ర మోడీ సిద్ధార్థ్నగర్ బహిరంగ సభ వేదిక నుంచి ఒకేసారి 9 వైద్య కళాశాలలను వర్చువల్గా ప్రారంభించి, గత ప్రభుత్వాల నిర్వాకం వల్లనే రాష్ట్రంలో ఆరోగ్య వ్యవస్థ అనారోగ్యంపాలైందని ఆరోపించారు. ఇక ఆ పరిస్థితి ఉండదని హామీ ఇచ్చారు. అయిత అదే రోజున కాంగ్రెస్ ప్రధానకార్యదర్శి ప్రియంకా గాంధీ, కరోనా సమయంలో పేదల ప్రాణాలు కాపాడడంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిర్లక్ష్యం వహించాయని ఆరోపించారు. ప్రభుత్వాల వైఫల్యాలను ఎండ గట్టారు.అలాగే, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే, ప్రతి పేద కుటుంబానికి ప్రతి సంవత్సరం, వైద్య ఖర్చుల నిమిత్తం పదివేల రూపాయలు ఉచితంగా ఇస్తుందని హామీ, ఇచ్చారు.
ప్రధాని మోడీ ఎవరి పేరు ప్రస్తావించకుండానే,గత ప్రభుత్వాలు ఉచితాల పేరున సొంత ఖజానాలు నింపుకుంటే, తమ ప్రభుత్వం పైసా పైసా కూడబెట్టి, మౌలిక సదుపాయాలు కలిపిస్తోందని చెప్పుకొచ్చారు. ఈ రోజు ప్రారంభించిన 9 వైద్య కళాశాలల వల్ల 2500 పడకలు అందుబాటులోకి వచ్చాయి,5వేల మందికి ఉపాధి లభిస్తుందని, ఉచిత వరాలు నాయకుల జేబులు నిమ్పుకునేందుకే కాని, ప్రజలకు మేలు చేయవని చెప్పకనే చెప్పారు.ఇలా నేరుగా ప్రధానమంత్రిని ప్రియాంకా వాద్రా నేరుగా ఎదుర్కోవడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంసమైంది. మరో వంక ప్రియాంక రాకతోకాంగ్రెస్ పార్టలో కొత్త ఆశలు, కొత్త ఉత్సాహం కనిపిస్తోందని పరిశీలకులు భావిస్తున్నారు.అలాగే, అనూహ్యంగా కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సన్నాహాల్లో అందరికంటే వేగంగా అడుగులు వేయడం ఒకవిధంగా అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. తెర వెనక వ్యూహం ఎవరిదో ఏమో గానీ, ప్రియాంకా వాద్రా తెరమీదకు వచ్చిన తర్వాత ఎన్నికల లెక్కలు వేగంగా మారిపోతున్నాయి. ప్రియాంక ఎంట్రీ వరకు ఒక లెక్క ఇప్పుడు మరో లెక్క, అన్నట్లుగా రాజకీయ చర్చ కొత్తమలుపులు తిరుగుతోంది. నిజానికి, యూపీలో ప్రియాంక వాద్రా చూపుతున్న చొరవ వేస్తున్న అడుగులు కేవలం,ఒక్క యూపీకే పరిమితం కాదని, భవిష్యత్’లో దేశం అంతటా ఇదే దూకుడు చూపిస్తుందని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.
ఉత్తరప్రదేశ్’లో ప్రియాంక మాత్రం ఎక్కడ పారేసుకున్నమో అక్కడే వెతుక్కోవాలనే పెద్దల మాటను చక్కగా, తూచా తప్పకుండా పాటిస్తున్నారు.అందుకే, ఆమె అన్నివర్గాల ప్రజలను ఆకట్టుకునే విధంగా వరాల జల్లు కురిపిస్తున్నారు. రాష్ట్రంలో అంచెల వారీగా ‘ప్రతిజ్ఞ’ పేరిట పాదయాత్ర చేస్తున్న, ప్రియాంకా వాద్రా, విడతల వారీగా వారాల జల్లు కురిపిస్తున్నారు.కొద్ది రోజుల క్రితం, రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే రైతు రుణ మాఫీ చేస్తుందని ప్రకటించారు. అలగే, వరి, గోధుమకు రూ.2,500 కనీస మద్దతు ధర కల్పిస్తామని హామీ ఇచ్చారు. దీంతో పాటు రాష్ట్రంలో 20 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేస్తామని, కరోనా సంక్షోభం వల్ల ఎదురైన నష్టం నుంచి బయటపడేందుకు ఒక్కో పేద కుటుంబానికి రూ.25 వేలు అందిస్తామని చెప్పారు.అంతే కాదు, యువతను ముఖ్యంగా చదువుకునే ఆడపిల్లలను ఆకట్టుకునేందుకు, స్మార్ట్ ఫోన్లు, ఈ – స్కూటర్లు ఉచితంగా ఇస్తామని హామీ ఇచ్చారు. విద్యుత్ బిల్లులను పేద కుటుంబాలకు పూర్తిగా, మిగిలిన వారికి సగం మాఫీ చేస్తామన్నమరో హమీనీ ప్రియంక ఇచ్చారు.
,ఇప్పుడు ప్రియాంక గాంధీ.. తాజాగా మరో ప్రకటన చేశారు. ఎన్నికల్లో కాంగ్రెస్ను గెలిపిస్తే రూ.10 లక్షల వరకు ఉచిత వైద్యాన్ని అందించేలా చర్యలు చేపడతామన్నారు. ఈ మేరకు ప్రియాంక ట్వీట్ చేశారు.అయితే, ప్రియాంక హామీలతో కాంగ్రెస్ పార్టీ కొంత పుజుకున్నా, అధికారానికి చేరుకోవడం మాత్రం అయ్యేపనికాదని అంటున్నారు.