ఏపీకి షాక్.. సభ టెన్షన్.. ఒమిక్రాన్ వర్రీ.. తగ్గింది లే.. టాప్‌న్యూస్ @1pm
posted on Dec 17, 2021 @ 12:04PM
1. ఎన్జీటీలో ఏపీ ప్రభుత్వానికి షాక్ తగిలింది. కేంద్ర పర్యావరణ అనుమతులు లేకుండా రాయలసీమ ఎత్తిపోతల పథకం నిర్మాణం చేపట్టరాదని ఎన్జీటీ స్పష్టం చేసింది. ప్రాజెక్టు నిర్మాణంలో అధ్యయనానికి నిపుణుల కమిటీని ఎన్జీటీ ఏర్పాటు చేసింది. నాలుగు నెలల్లో కమిటీ నివేదిక ఇవ్వాలని ఆదేశించింది. నిబంధనలు ఉల్లంఘించి నిర్మాణం చేపడితే ఏపీ ప్రభుత్వమే బాధ్యత వహించాలని ఎన్జీటీ స్పష్టం చేసింది.
2. పీఆర్సీపై సీఎం జగన్‌తో మంత్రి బుగ్గన, సలహదారు సజ్జల సమావేశమయ్యారు. జాయింట్ స్టాఫ్ కౌన్సిల్‌లో ఉద్యోగులు ఇచ్చిన డిమాండ్లపై గురువారం ఆయా సంఘాలతో చర్చలు జరిపారు. ఆ చర్చల సారాంశాన్ని ఇవాళ సీఎంకు సజ్జల, బుగ్గన వివరిస్తున్నారు. సీఎంతో సమావేశం అనంతరం ఉద్యోగ సంఘాలతో సజ్జల, బుగ్గన మరోసారి భేటీ కానున్నారు.
3. తెలంగాణలోని పలు కార్పొరేషన్లకు ఛైర్మన్లను సీఎం కేసీఆర్ ఖరారు చేశారు. తెలంగాణ ఉమెన్స్ ఫైనాన్స్ కార్పొరేషన్ ఛైర్మన్‌గా మాజీ ఎమ్మెల్సీ ఆకుల లలిత, బేవరేజెస్ కార్పొరేషన్ ఛైర్మన్‌గా గజ్జెల నగేశ్, స్టేట్ టెక్నాలజీ సర్వీసెస్ ఛైర్మన్‌గా పాటిమీది జగన్మోహన్‌రావు, తెలంగాణ సాహిత్య అకాడమీ ఛైర్మన్‌గా ప్రముఖ రచయిత జూలూరి గౌరీశంకర్, షీప్ అండ్ గోట్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్‌గా దూదిమెట్ల బాలరాజు యాదవ్‌లను కేసీఆర్ నియమించారు.
4. తిరుపతిలోని అమరావతి మహాసభలకు వెళుతున్న టీడీపీ శ్రేణులను ఎక్కడికక్కడ పోలీసులు అడ్డుకుంటున్నారు. చిత్తూరులో మాజీ మేయర్ కటారి హేమలత ప్రయాణిస్తున్న వాహనానికి ఇన్సూరెన్స్ లేదన్న సాకుతో వారు ప్రయాణిస్తున్న వాహనాన్ని సీజ్ చేశారు. సభకు హాజరవుతున్న టీడీపీ శ్రేణులను నేంద్ర గుంట టోల్ ప్లాజా వద్ద తనిఖీల పేరుతో పోలీసులు అడ్డుకుంటున్నారు.
5. టీడీపీ పోలవరం యాత్రను అడ్డుకునేందుకు పోలీసులు చర్యలు చేపట్టారు. టీడీపీ నేతలను ఎక్కిడికక్కడ పోలీసులు అడ్డుకుని హౌస్ అరెస్ట్ చేస్తున్నారు. దెందులూరు మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌ను పోలీసులు అడ్డుకున్నారు. తాను పోలవరం వెళ్లడం లేదని.. పెళ్ళికి వెళ్తున్నానని చింతమనేని చెప్పినప్పటికీ పోలీసులు వినిపించుకోలేదు. ఇరువురి మధ్య వాగ్వివాదం చోటు చేసుకుంది.
6. ప్రజా సమస్యలపై పోరాడుతున్న వారికి ఆంక్షలు, సంకెళ్లు విధిస్తూ జగన్ రెడ్డి నియంత పాలన సాగిస్తున్నారని టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడు మండిపడ్డారు. బ్రిటీష్ నియంత పాలన 2.0లా జగన్ రెడ్డి పాలన ఉందని ఆగ్రహం వ్యక్తం చేశారు. అమరావతి రైతుల మహాసభకు కోర్టు అనుమతిచ్చినా.. ప్రజలు సభకు వెళ్లకుండా వైసీపీ ప్రభుత్వం అడ్డంకులు సృష్టిస్తోందన్నారు.
7. ఎనిమిది కేసులతో తెలంగాణలో ఒమిక్రాన్ కలకలం రేపుతోంది. తెలంగాణలో థర్డ్ వేవ్‌ను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామని డీహెచ్ శ్రీనివాసరావు అన్నారు. నాన్ రిస్క్ దేశాల నుంచి వచ్చిన వారిలో ఏడుగురికి ఒమిక్రాన్ ఉన్నట్లు గుర్తించామని చెప్పారు. కొత్తగా వరంగల్ మహిళకు ఒమిక్రాన్ సోకినట్టు నిర్థారించామని చెప్పారు. బాధితుల్లో ఎలాంటి లక్షణాలు లేవని.. సామూహిక వ్యాప్తి కూడా లేదన్నారు.
8. బెజవాడలో హల్‌చల్ చేసిన చడ్డీ గ్యాంగ్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గుజరాత్‌లో ముగ్గురు చడ్డీ గ్యాంగ్ సభ్యులను అరెస్ట్ చేసి విజయవాడ తీసుకొచ్చారు. చడ్డీ గ్యాంగ్‌ను సీసీఎస్ పోలీసులు విచారిస్తున్నారు. శనివారం మీడియా ముందు చడ్డీ గ్యాంగ్‌ను హాజరుపరిచే అవకాశం ఉందంటున్నారు.
9. హిందూపురంలో ఉద్రిక్తత వాతావరణం చోటు చేసుకుంది. పుష్ప సినిమా బెనిఫిట్ షో కోసం అల్లు అర్జున్ ఫ్యాన్స్ పడిగాపులు కాశారు. బెనిఫిట్ షో రద్దైనట్టు థియేటర్ యాజమాన్యం చెప్పడంతో అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేశారు. థియేటర్ల అద్ధాలు ధ్వంసం చేసి ఆందోళనకు దిగారు. థియేటర్ యాజమాన్యం పోలీసులకు సమాచారం ఇచ్చారు. వెంటనే అక్కడకు చేరుకున్న పోలీసులు అల్లు అర్జున్ అభిమానులపై లాఠీ చార్జ్ చేసి..పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చారు. మరోవైపు.. సినిమా రివ్యూస్‌లో పుష్పకి యావరేజ్ టాక్ వినిపిస్తోంది.
10. మిస్ వరల్డ్‌కు పోటీ పడుతున్న మిస్ ఇండియా 2020 'మానస వారణాసి'కి కొవిడ్-19 పాజిటివ్ అని తేలడం కలకలం రేపింది. ఇండియాకి చెందిన మానస వారణాసితో సహా పలువురు పోటీదారులకు కరోనా సోకడంతో మిస్ వరల్డ్ 2021 పోటీలు వాయిదా పడ్డాయి. వచ్చే 90 రోజుల్లో ప్యూర్టోరికోలోనే మిస్ వరల్డ్ పోటీలు నిర్వహిస్తామని నిర్వాహకులు ప్రకటించారు.