పెట్రోల్ తో టామోటా పోటీ.. ధర దడదడ..
posted on Nov 23, 2021 9:09AM
రాయలసీమను ముంచెత్తిన కుండపోత వర్షాలు కూరగాయలపై పెను ప్రభావాన్ని చూపిస్తున్నాయి. వేలాది ఎకరాల్లో పంటలు జలమయం కావడంతో మార్కెట్లకు దిగుబడి తగ్గిపోయింది. చిత్తూరు, అనంతపురం జిల్లాల్లో కూరగాయల పంటలు భారీగా ధ్వంసం అయ్యాయి. దీంతో మదనపల్లి మార్కెట్ లో కొరత ఏర్పడింది. ముఖ్యంగా టమోటా ధరలు రోజుకు రోజుకు భారీగా పెరిగిపోతున్నాయి. మదనపల్లి మార్కెట్ లో కిలో టమోటా రేట్ సెంచరీ క్రాస్ చేసింది.
మదనపల్లె మార్కెట్‌లో సోమవారం నాణ్యమైన మొదటి రకం టమోటా గరిష్ఠంగా కిలో రూ.104 పలికింది. గత పదిహేను ఏళ్లలో ఇదే్ రికార్డుస్థాయి రేట్ అని మార్కెట్ అధికారులు చెబుతున్నారు. రెండో రకం కనిష్ఠ ధర కిలో రూ.18 పలికింది. మార్కెట్‌కు 260 మెట్రిక్ టన్నుల టమోటా విక్రయానికి వచ్చినా దూరప్రాంతాల వ్యాపారులు రావడంతో ధరలు ఒక్కసారిగా పైకి ఎగబాకాయి. చిత్తూరు, అనంతపురం జిల్లాలో టమోటా ధరలు వేలాది ఎకరాల్లో నాశనమయ్యాయని, రానున్న రోజుల్లో టమోటా ధరలు మరింతగా పెరుగుతాయని అధికారులు అంచనా వేస్తున్నారు.
మరోవైపు ధరలు భారీగా పలకడంతో టమోటా రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఓ వైపు వర్షాలతో టమోటా పంట దెబ్బతిన్న రైతులు ఆవేదన వ్యక్తం చేస్తుండగా, మరో వైపు టమోటా కోత వస్తున్న రైతులు సంతోషంగా వున్నారు. వినియోగదారులకు మాత్రం టామోటా భారంగా మారింది.