Read more!

దేశ జ్ఞానాన్ని వెలిగించే జాతీయ విద్యాదినోత్సవం!

విధ్యా వినయేన శోభతేః... అన్నారు పెద్దలు. అంటే వినయాన్ని చేకూర్చే విద్యనే ఉత్తమమైనది అని అర్థం. విధ్య లేని వాడు వింత పశువు అని కూడా అన్నారు.. విద్య వల్ల మనిషిలో మేధాపరంగా గొప్ప మార్పు చోటు చేసుకుంటుంది. ఎంత ఎక్కువ చదువుకుంటే అంత గొప్ప జ్ఞానం వ్యక్తి సొంతం అవుతుందని చెప్పేవారు. అయితే కేవలం డిగ్రీ పట్టాలకు మాత్రమే పరిమితమయ్యే జ్ఞానం మనిషి మాససిక వికాసానికి దోహదం చెయ్యదు. అక్షరము అంటే నాశనం లేనిది అని అర్థం.అందుకే కాలం ఎంత మారినా చదువుకున్న చదువు మనిషికి ఏదో ఒక మార్గాన్ని చూపిస్తూనే ఉంటుంది. చరిత్రలోకి చూస్తే ఎంతో మంది గొప్పగా ఎదిగిన వారు కష్టపడి చదివి ఉన్నత శిఖరాలకు ఎదిగినవారే... వారందరికీ చదువు విలువ ఎంతో స్పష్టంగా తెలుసు కాబట్టే వారు ఎంత గొప్పవారు అయినా చివరికంటూ నిత్యవిద్యార్థులుగా కొనసాగారు. 

భారతదేశంలో ప్రతి సంవత్సరం నవంబర్ 11 న జాతీయ విద్యాదినోత్సవాన్ని జరుపుకుంటూ వస్తున్నారు. భారతదేశ మొట్టమొదటి కేంద్ర విద్యాశాఖమంత్రి మౌలానా అబుల్ కలాం ఆజాద్ గారి జయంతిని పురస్కరించుకుని మన దేశంలో ప్రతి సంవత్సరం నవంబర్ 11న జాతీయ విద్యాదినోత్సవాన్ని జరుపుకోవాలని నిర్ణయించారు. 

ఎప్పుడు ఏర్పడింది..

ప్రస్తుతం మానవ వనరుల అభివృద్ది మంత్రిత్వ శాఖ గా పిలువబడుతున్న విద్యాశాఖ  2008 సంవత్సరం నవంబర్ 11 న భారతదేశ మొదటి విద్యాశాఖ మంత్రి మౌలానా అబుల్ కలాం ఆజాద్ జయంతిని పురస్కరించుకుని జాతీయ విద్యాదినోత్సవాన్ని జరుపుకోవాలని నిర్ణయించి, ప్రకటించింది. అప్పటి నుండి జాతీయ విద్యా దినోత్సవ వేడుక సాగుతోంది. 

థీమ్ ఏంటో తెలుసా...

ఈ విషయం మీద అవగాహన పెంపొందించే దిశగా ప్రతి సంపత్సరం ఒక కొత్త థీమ్ ను ప్రకటించి దాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళే ప్రయత్నాలు చేస్తుంది భారత ప్రభుత్వం. అదే విధంగా 2022 సంవత్సరానికి సంబంధించిన థీమ్ "Changing the course and transforming education".

పై థీమ్ తో భారత ప్రభుత్వం ప్రజల్లో విద్యమీద అవగాహన పెంచే కార్యక్రమాలను ఈ ఏడాది చేపట్టబోతోంది.

జాతీయ విద్యా దినోత్సవంగా జరుపుకుంటున్న మౌలానా అబుల్ కలామ్ గురించి తెలుసుకుంటే…..

నవంబర్ 18, 1888న జన్మించిన మౌలానా అబుల్ కలాం  పూర్తి పేరు "అబుల్ కలాం గులాం ముహియుద్దీన్ అహ్మద్ బిన్ ఖైరుద్దీన్ అల్-హుస్సేనీ ఆజాద్". ఈయన  భారత స్వాతంత్ర్య కార్యకర్త,  రచయిత మరియు భారత జాతీయ కాంగ్రెస్ సీనియర్ నాయకుడు. భారత దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తరువాత, ఈయన భారత ప్రభుత్వంలో మొదటి విద్యా మంత్రి అయ్యాడు.   ఆగస్టు 15, 1947 నుండి ఫిబ్రవరి 2, 1958 వరకు ఈయన భారత విద్యా మంత్రిగా పనిచేశాడు.  ఫిబ్రవరి 22, 1958న ఢిల్లీలో మరణించాడు. అంటే ఈయన తన పదవి నుండి  తాను మరణించడానికి 20 రోజుల ముందు తప్పుకున్నాడు. 

జాతీయ విద్యా దినోత్సవం సందర్భంగా ఏమి చేయవచ్చు??

జాతీయ విద్యాదినోత్సవ సందర్భంగానే కాకుండా సాధారణ రోజుల్లో కూడా  కృషి చేయవచ్చు కదా అని కొందరు ఎద్దేవా చేస్తూ ఉంటారు. అయితే జాతీయ విద్యాదినోత్సవం నాడు ఈ అవగాహనా కార్యక్రమాలు మరింత పుంజుకుంటాయి.

అవగాహన!!

జాతీయ విద్యాదినోత్సవం రోజు అవగాహనా కార్యక్రమాలు ఏర్పాటు చేయాలి. నిరక్షరాస్యత కలిగిన ప్రాంతాలలో ఈ కార్యక్రమాల ఏర్పాటు ఉండేలా చూసుకోవాలి. పిల్లలను పనికి పంపే పెద్దవారి విద్య విలువ అర్థమయ్యేలా చెప్పాలి. పిల్లలను పని నుండి బడికి పంపే దిశగా వారి ఆలోచనలు మళ్లించాలి. విద్య వల్ల ఉద్యోగావకాశాలు ఎలా చేజిక్కించుకోవచ్చో, ఉద్యోగం చేసే వారికి ఈ సమాజంలో ఎంతటి సముచిత స్థానం లభిస్తోందో వివరించి చెప్పాలి. 

సహాయం!!

చదువు కోవడానికి ఇబ్బంది పడే పిల్లలు ఈ కాలంలో చాలామందే ఉన్నారు. చదువు ఖరీదు అయిపోయిన ఈ కాలంలో ఆర్థిక సమస్యలు కారణంగా విద్యకు ఉద్వాసన పలికే పేద మాణిక్యాలు చాలానే ఉన్నాయి. అలాంటి వారిని చదువులో ప్రోత్సహించాలి. నేరుగా సహాయం కావచ్చు, లేదా స్వచ్చంధ సంస్థల తరపున కావచ్చు లేదా విరాళాలు సేకరించి కావచ్చు ప్రతిభ కలిగిన పేద విద్యార్థులను చదువులో రాణించేలా చేస్తే దేశానికి విద్యా వంతులను అందించినట్టు అవుతుంది.  

ఇలా ప్రతి ఒక్కరూ ఈ జాతీయ విద్యాదినోత్సవం రోజున తమకు చేతనైన విధంగా చేయూతను అందించవచ్చు. 

                                     ◆నిశ్శబ్ద.