మూడు పదవులు ఆశిస్తున్నాం: చిరు మక్కువ
posted on Dec 20, 2011 @ 2:20PM
ఢిల్లీ: తిరుపతి శాసనసభ్యుడు చిరంజీవి ఓవైపు తనకు ఏ పదవిపైనా మక్కువ లేదంటూనే మనసులోని మాటను బయటపెట్టారు. కేంద్ర కేబినెట్‌లో మూడు మంత్రి పదవులు ఆశిస్తున్నామని ఢిల్లీలో చిరంజీవి తెలిపారు.ఢిల్లీ పర్యటనలో ఉన్న చిరంజీవి మంగళవారం పర్యాటక శాఖ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా చిరంజీవి మీడియాతో మాట్లాడుతూ మంత్రి పదవులపై గల కోరికను బయటపెట్టారు. మూడు మంత్రి పదవులను ఆశించడం ద్వారా మూడు ప్రాంతాల్లో ప్రాతినిధ్యం వహిస్తామన్నారు. తెలంగాణలోనూ మా పార్టీ ఎమ్మెల్యేలు ఉన్నందున అందరికీ న్యాయం జరిగేందుకే మూడు పదవులను ఆశిస్తున్నామని చెప్పారు.
ఇంకా శోభానాగిరెడ్డిపై విప్ జారీ అంశంపై చిరంజీవి మాట్లాడుతూ అనర్హత వేటు నుంచి తప్పించుకునేందుకే శోభానాగిరెడ్డి సాకులు చెబుతున్నారన్నారు. పీఆర్పీ తరపున ఎమ్మెల్యే శోభానాగిరెడ్డికి విప్ జారీచేసే అధికారం ఉందని చిరంజీవి స్పష్టం చేశారు. టెక్నికల్‌గా శోభానాగిరెడ్డిపై అనర్హత వేటు వేయడం సరైందేనని చిరంజీవి తెలిపారు.