జీవితంలో విజయం వరించాలంటే ఇవే కీ పాయింట్స్..!

 


విజయం.. ప్రతి వ్యక్తి కల. ముఖ్యంగా యువత విజయం అనే ఒక లక్ష్యం కోసం చాలా శ్రమిస్తూ ఉంటారు. జీవితంలో విజయం సాధించాలంటే దానికంటూ కొన్ని కమిట్‌మెంట్స్ ఉండాలి. కొన్ని త్యాగాలు చేయాలి,  మరికొన్ని ఇష్టంగా మార్చుకోవాలి.  జీవితంలో సంతోషంగా గడిచిపోయే దారిలో విజయం ఎప్పటికీ లభించదు.  కష్టమైన దారిని దాటితేనే విజయాన్ని అందుకోగలుగుతారు.  కొందరికి ఈ విషయం తెలిసినా దాన్ని చేరుకునే మార్గం, జీవితంలో చేసుకోవాల్సిన మార్పులు,  మార్చుకోవాల్సిన ఆలోచనా విధానం మొదలైనవి మాత్రం తెలియకుండా ఉంటాయి.  అయితే విజేతలు కావాలంటే కొన్ని విషయాలు తప్పక తెలుసుకుని పాటించాలి.


రోజును ఎలా ప్రారంభించినా సరే.. సాయంత్రం ఉండే అలవాట్లలో కొన్ని జీవితం మీద చాలా ప్రభావం చూపిస్తాయట.  ఈ అలవాట్లే జీవితంలో విజయాన్ని,  విజయ శిఖరాల వైపు వ్యక్తులను తీసుకెళ్తాయి.  అందుకే ప్రతిరోజూ సాయంత్రం కొన్ని పనులు తప్పక చేయాలి.

ప్రతిరోజూ సాయంత్రం 10 నుండి 15 నిమిషాలు ధ్యానం చేయాలి.  ధ్యానం చేయడం ద్వారా మనస్సును శాంతంగా ఉంచుకోవచ్చు.  మనస్సును సంతోషంగా ఉంచుకోవచ్చు.  దీని వల్ల ఒత్తిడి కూడా తగ్గుతుంది. రోజంతా అనుభవించిన ఒత్తిడి కూడా సాయంత్రం ధ్యానం చేయడం వల్ల మాయమవుతుంది.

ధ్యానం చేయడంతో పాటు యోగ కూడా చేయాలి.  తేలికపాటి యోగ చేయడం వల్ల శరీరానికి విశ్రాంతి లభిస్తుంది.  శరీరం ఫిట్ గా కూడా ఉంటుంది.  ఒక వ్యక్తి జీవితంలో విజయం సాధించాలంటే శారీరకంగా ఫిట్ గా ఉండటం చాలా ముఖ్యం. ఆరోగ్యంగా ఉన్న వ్యక్తులు లక్ష్యాలు సాధించడంలో ముందుంటారు.


ప్రతిరోజూ సాయంత్రం సమయంలో కాసింత వాకింగ్,  యోగ,  ధ్యానం చేయగానే వెచ్చని నీటితో స్నానం చేయాలి.  ఇది శరీరానికి చాలా రిలాక్సింగ్ ను ఇస్తుంది. మానసిక ఆరోగ్యాన్ని కూడా మెరుగ్గా ఉంచుతుంది.  మనస్సును ప్రశాంతంగా ఉంచుతుంది. రాత్రి సమయంలో హాయిగా నిద్రపోవడానికి కారణమవుతుంది.

ప్రణాళిక ఒక వ్యక్తి కార్యాచరణను సులభతరం చేస్తుంది. రేపటి రోజు చేయాల్సిన కార్యాచరణను ముందు రోజే రెఢీ చేసి పెట్టుకోవడం వల్ల పనులకు తగ్గట్టు సన్నద్ధం కావచ్చు. ఇది సమయాన్ని కూడా పర్పెక్ట్ గా వినియోగించుకునేలా చేస్తుంది.


ప్రతిరోజూ రాత్రి పడుకునే ముందు ఏదైనా మంచి పుస్తకంలో కొన్ని పేజీలను తప్పక చదవాలి. దీని వల్ల రాత్రి పడుకునే ముందు మానసికంగా ప్రశాంతత లభిస్తుంది.  ఇది మంచి నిద్రకు దారితీస్తుంది.


సాయంత్రం సమయంలో కొన్ని నిమిషాలు రోజును రివిజన్ చేసుకోవడం ఎంతో సహాయపడుతుంది.  ఆ రోజు ఉదయం లేచిన నుండి సాయంత్రం ఏ పనులు చేయగలిగాం,  ఏవి చేయలేకపోయాం అనే విషయం గమనించుకోవచ్చు.  ఒక వేళ ఏదైనా పని చేయలేకపోతే అలా పనులు మిగుల్చకుండా ఎలా పూర్తీ చేయాలో కూడా తెలుస్తుంది.

రాత్రి సమయంలో తీసుకునే భోజనం చాలా తేలికగా ఉండాలి.  ఆహారం చాలా భారీగా తీసుకుంటే అది నిద్రకు ఆటంకం కలిగిస్తుంది.  అదే తేలికగా ఉన్న ఆహారం తీసుకుంటే హాయిగా నిద్ర పడుతుంది. అలాగని అస్సలు తినకుండా ఉండటం కూడా మంచిది కాదు.. ముఖ్యంగా నిద్రపోవడానికి కనీసం రెండు నుండి మూడు గంటల ముందే భోజనం ముగించాలి.


ఫోన్ కు వ్యసనపరులుగా ఉండటం అంటే లక్ష్యాలను లైట్ గా తీసుకున్నట్టే.. ఫోన్ ను కూడా లక్ష్యాలను చేరుకోవడానికి సహాయపడే వస్తువుగా వినియోగించడం మంచిది.  టీవీ, ల్యాప్టాప్, స్మార్ట్ ఫోన్.. ఇతర గ్యాడ్జెట్స్ ను లక్ష్యాల కోసం,  కమ్యూనికేషన్ కోసం మాత్రమే వినియోగించాలి.  అనవసరమైన కాలయాపన కోసం వినియోగించకూడదు.


నిద్రపోవడానికి ఒక ఖచ్చితమైన సమయాన్ని నిర్ణయించుకోవాలి.  ప్రతిరోజూ ఎన్నిపనులు ఉన్నా ఒకే సమయానికి నిద్రపోవాలి. దీని వల్ల మరుసటి రోజు ఉదయం కూడా ఖచ్చితమైన సమయానికి నిద్ర లేవడం పనులను క్రమశిక్షణగా పూర్తీ చేసుకోవడం సాధ్యమవుతుంది.


                                                 *రూపశ్రీ.