ఒకే ఇంట్లో మూడు పార్టీలు.. సమాజ హితం కోసమేనన్న డీఎస్..
posted on Jul 16, 2021 @ 9:13PM
ధర్మపురి శ్రీనివాస్.. తెలుగు రాష్ట్రాల్లో పరిచయం అక్కరలేని రాజకీయ నేత. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ పీసీసీ చీఫ్‌గా రెండు సార్లు వ్యవహించారు డీఎస్. ఆయన పీసీసీగా ఉన్నప్పుడు రెండు సార్లు కాంగ్రెస్ అధికారంలోకి రావడం మరో విశేషం. ప్రస్తుతం తెలంగాణలో సీనియర్ నేతగా ఉన్న డీఎస్ కుటుంబంలో రాజకీయంగా విచిత్ర పరిస్థితి నెలకొంది. కాంగ్రెస్ లో సుదీర్ఘ కాలం పని చేసిన డీఎస్.. 2017లో టీఆర్ఎస్ లో చేరారు. డీఎస్ ను రాజ్యసభకు పంపారు కేసీఆర్. అయితే కేసీఆర్ తో విభేదాలు రావడంతో కొంత కాలంగా టీఆర్ఎస్ కు దూరంగా ఉంటున్నారు. కాని ఆయన్ను అధికార పార్టీ సస్పెండ్ చేయలేదు. రాజ్యసభలో టీఆర్ఎస్ ఎంపీగా అధికారికంగా ఉన్నా.. ఆయన మాత్రం కారు పార్టీకి వ్యతిరేకంగా ఉన్నారు. లోక్ సభ ఎన్నికల్లో టీఆర్ఎస్ కు వ్యతిరేకంగా ప్రచారం చేశారని చెబుతారు.
అయితే డీఎస్ చిన్న కుమారుడు అర్వింద్ బీజేపీలో చేరి.. ఎంపీగా పోటీ చేసి విజయం సాధించారు. ఇక పెద్ద కుమారుడు సంజయ్ గతంలో కాంగ్రెస్ నుంచి నిజామాబాద్ మేయర్ గా పనిచేశారు. తర్వాత తండ్రితో కలిసి టీఆర్ఎస్ లో చేరారు. డీఎస్ దూరమయ్యాక సంజయ్ కూడా రాజకీయంగా సైలెంటుగానే ఉన్నారు. అయితే ఇటీవలే సంజయ్ మళ్లీ యాక్టివ్ అయ్యారు. పీసీసీ చీఫ్ గా రేవంత్ రెడ్డి బాధ్యతలు తీసుకోగానే వెళ్లి తల కలిశారు. త్వరలో భారీ సభ ద్వారా కాంగ్రెస్ లో చేరతానని ప్రకటించారు. దీంతో డీఎస్ ఇంట్లో ముగ్గురు ముడు పార్టీలు అన్నట్లుగా మారిపోయింది. దీనిపై సోషల్ మీడియాలో సెటైర్లు పేలుతున్నాయి. మూడు పార్టీల ముచ్చటైన కుటుంబం అంటూ కొందరు పోస్టులు పెడుతున్నారు.
తమ కుటుంబంపై జరుగుతున్న ప్రచారంపై డీఎస్ స్పందించారు. ఒకే ఇంట్లో మూడు పార్టీలు అంటూ చాలా మంది బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. తాను రాజ్యసభ సభ్యుడిగా ఉన్నప్పటికీ టీఆర్ఎస్ పార్టీలో ఉన్నది లేనిది కేసీఆరే చెప్పాలని వ్యాఖ్యానించారు. తాను ఏ పార్టీలో ఉన్నది తనకే తెలియదని డీఎస్ కామెంట్ చేశారు. చాలా మంది ఎంపీల ఇళ్లల్లో భార్యాభర్తలు వేర్వేరు పార్టీల్లో ఉన్నారన్నారు డీఎస్. తండ్రి ఒక పార్టీలో ఉంటే కొడుకులు ఇతర పార్టీలో ఉండడం కొత్త విషయం కాదని కొట్టిపారేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో పీసీసీ చీఫ్‌గా చక్రం తిప్పానని గుర్తు చేసుకున్నారు.
తన కొడుకులిద్దరు ఏది చేసినా సమాజానికి ఉపయోగపడే విధంగా చేస్తారన్న నమ్మకం తనకు ఉందన్నారు డీఎస్. ఇద్దరు పిల్లలు స్వతంత్రంగా సొంత నిర్ణయాలు తీసుకునే విధంగా ఎదిగారని చెప్పారు. తనకు సంబంధం లేని పార్టీలో అరవింద్ చేరినా అభ్యంతరం చెప్పలేదని అన్నారు. అతడు కష్టపడి ఎంపీగా గెలిచాడని అన్నారు. నిజామాబాద్ మేయర్‌గా సంజయ్ ఐదు సంవత్సరాలు రిమార్క్ లేకుండా పని చేశాడని డీఎస్ అన్నారు. తనకు జీబులు ఎక్కి, కార్లలో తిరిగి ఫోజులు కొట్టాల్సిన అవసరం లేదని అన్నారు. తనకు సంజయ్, అరవింద్‌లు రెండు కళ్ళ లాంటి వారని అన్నారు.