షర్మిల చెంతకు కౌశిక్‌రెడ్డి? రేవంత్ దెబ్బకు కల చెదిరినట్టేనా?
posted on Jul 16, 2021 @ 10:29PM
ఎన్నెన్నో అనుకుంటాం. అన్నీ అవుతాయాయేం. కౌశిక్‌రెడ్డి చిరకాల స్వప్నం.. హుజురాబాద్ ఎమ్మెల్యే కావడం. అందుకోసమే ఆయన 10ఏళ్లుగా ప్రయత్నిస్తున్నారు. కాంగ్రెస్‌ను నమ్ముకొని రాజకీయం చేశారు. ఓసారి ప్రయత్నించి ఓడిపోయారు. ఈసారి మరింత గట్టిగా కొట్లాడతానని.. గెలుపు పక్కా అనుకునేంతలోనే అంతా తలకిందులు అయిపోయింది. ఆయన తలరాత.. తికమక మకతికగా మారిపోయింది. ఒక్క ఫోన్ కాల్. ఒకే ఒక్క ఫోన్ కాల్. కౌశిక్‌రెడ్డి రాజకీయ భవితవ్యాన్ని రంగులరాట్నంలా గిర్రున తిప్పేసింది. ఓ బ్యాడ్ మార్నింగ్ ఆయన ఫోన్ ఆడియో వైరల్‌గా మారడం.. మధ్యాహ్నానికల్లా గాంధీభవన్ నుంచి నోటీసులు రావడం.. సాయంత్రానికి కాంగ్రెస్‌కు రాజీనామా చేయడం.. రేవంత్‌రెడ్డిపై విమర్శలు గుప్పించి పార్టీ నుంచి వెళ్లిపోవడం.. ఇలా ఒక్కరోజులోనే కౌశిక్‌రెడ్డి రాజకీయ జీవితం.. నడిరోడ్డు మీదకు వచ్చింది. ఇప్పుడు ఆ పొలిటికల్ జంక్షన్‌లో దిక్కుతోచని స్థితిలో నిలబడి ఓ దిక్కుకోసం ఎదురుచూస్తున్నారు పాడి కౌశిక్‌రెడ్డి.
తనకు టీఆర్ఎస్ ఎమ్మెల్యే టికెట్ కన్ఫామ్ అయిందనేది ఆ ఫోన్‌కాల్ సారాంశం. అది నిజమో, అబద్దమో ఆయనకే తెలియాలి. ఆ ఒక్కమాటే ఆయన్ను కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చేలా చేసింది. రేవంత్‌రెడ్డిపై విమర్శలు గుప్పించేలా చేసింది. కౌశిక్‌రెడ్డిని చిన్నపిల్లాడని.. ఆయనతో కేసీఆరే అలా మాట్లాడించారంటూ రేవంత్ ఆ ఎపిసోడ్‌ను చాలా లైట్‌గా తీసుకున్నారు. అదే సమయంలో ఓ అనుమానమూ వ్యక్తం చేశారు. కౌశిక్‌కు కేసీఆర్ టీఆర్ఎస్ టికెట్ ఇస్తారని తాను అనుకోవటం లేదని బాంబు పేల్చారు.
రేవంత్‌రెడ్డి అనుమానించినట్టే జరుగుతోంది. హుజురాబాద్ టీఆర్ఎస్ టికెట్ రేసులో కౌశిక్‌రెడ్డి లేరని తెలుస్తోంది. ఆయన ఇంకా కారు పార్టీలో చేరకున్నా.. రేపేమాపో కారెక్కడం ఖాయమనే ప్రచారం ఇన్నాళ్లూ జరిగింది. అయితే, కౌశిక్‌రెడ్డి ఫోన్‌కాల్ వైరల్ కావడం, అందులో కార్యకర్తలకు డబ్బులు ఖర్చు చేద్దామంటూ మాట్లాడటం, ఆ వెంటనే కాంగ్రెస్‌ను వీడటంతో.. కౌశిక్ ఇమేజ్ బాగా డ్యామేజ్ అయిందని అంటున్నారు. కౌశిక్‌రెడ్డి కాంగ్రెస్‌లో ఉంటూ టీఆర్ఎస్ కోవర్టుగా పని చేశారనే ఆరోపణ.. బలమైన కారణం లేకుండా ఒక్క రోజులోనే అన్నేళ్లపాటు ఉన్న పార్టీని వీడటంతో.. స్థానికంగా కౌశిక్‌రెడ్డి మీద వ్యతిరేకత వెల్లువెత్తుతోందనే సమాచారం ఇంటెలిజెన్స్ వర్గాల ద్వారా కేసీఆర్ దృష్టికి చేరిందంటున్నారు. అందుకే, ఇప్పుడు కౌశిక్‌రెడ్డిని గులాబీ పార్టీ పక్కన పెట్టేసిందని.. ఆయన దారి ఆయన చూసుకోమని చెప్పేసిందని అంటున్నారు. దీంతో.. కొత్త దారి అన్వేషణలో ఉన్న కౌశిక్‌రెడ్డి అడుగులు.. తెలంగాణలో కొత్త పార్టీ అయిన వైఎస్సార్‌టీపీ వైపు పడుతున్నాయని తెలుస్తోంది.
కాంగ్రెస్‌ను వీడుతూ మీడియా సమావేశంలోనే కౌశిక్‌రెడ్డి స్పష్టంగా చెప్పారు.. వైఎస్సార్ మీద అభిమానంతో ఆయన సమక్షంలోనే తాను కాంగ్రెస్‌లో చేరానని. ఆ ఒక్క పాయింట్‌ను బేస్ చేసుకొని.. షర్మిల పార్టీ ఈయనకు గాలం వేయడం.. తనకు టీఆర్ఎస్ టికెట్ రాదని లీకులు వస్తుండటంతో కౌశిక్‌రెడ్డి సైతం ఆ పార్టీకి టచ్‌లోకి రావడం జరిగిపోయిందట. షర్మిల పార్టీకి చెందిన ఓ కీలక నేతతో చర్చలు జరిగాయట. ఇరువర్గాలు ఓకే అనుకున్నాయట. అయితే, కౌశిక్‌రెడ్డే కాస్త వెనకాడుతున్నారట. ఆఖరి నిమిషం వరకూ టీఆర్ఎస్ టికెట్ కోసమే గట్టిగా ట్రై చేసి.. అది వర్కవుట్ కాకపోతేనే.. షర్మిల పార్టీలో చేరి.. వైఎస్సార్‌టీపీ తరఫున హుజురాబాద్‌లో పోటీ చేయాలని భావిస్తున్నారని తెలుస్తోంది. కౌశిక్‌కి ఇంకా కారు డోరులు పూర్తిగా మూసుకుపోలేదని.. రన్నింగ్ కార్ ఎక్కేందుకు ఆయన ఇంకా పరుగులు పెడుతున్నారని.. బై బ్యాడ్‌లక్ అది మిస్ అయితే.. అల్టర్‌నేట్‌గా వైఎస్సార్ ఇమేజ్‌తో ఆయన కూతురు షర్మిలతో చేతులు కలిపి.. హుజురాబాద్‌లో పొలిటికల్ క్రికెట్ ఆడాలనేది కౌశిక్‌రెడ్డి గేమ్ ప్లాన్‌గా కనిపిస్తోంది. మరి, ఈ ప్రమాదకర ఆటలో.. ఈ మాజీ క్రికెటర్ మ్యాచ్ విన్ అవుతారా? లేక, క్లీన్‌బౌల్డ్ అవుతారా? చూడాలి....