అందరికీ థ్యాంక్స్.. సీఎంగా ఎంపికయ్యాక రేవంత్ తొలి ట్వీట్
posted on Dec 6, 2023 9:01AM
తెలంగాణ ముఖ్యమంత్రిగా అధిష్ఠానం తన పేరు ప్రకటించిన తరువాత రేవంత్ రెడ్డి తొలిసారి Xవేదికగా స్పందించారు. తనను సీఎంగా ఎంపిక చేసిన ఏఐసీసీ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గేకు, సోనియా గాంధీకి, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, కేసీ వేణుగోపాల్, డీకే శివకుమార్, మాణిక్ రావు థాక్రేకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. , ఇటీవల వెలువడిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు కాంగ్రెస్ పార్టీ సంపూర్ణ మెజార్టీ ఇచ్చారు. మ్యాజిక్ ఫిగర్‌కు మించి స్థానాలు కట్టబెట్టారు. అనంతరం సుదీర్ఘంగా చర్చలు జరిపిన కాంగ్రెస్ హైకమాండ్ సీఎల్పీ నేతగా రేవంత్ రెడ్డిని ప్రకటించింది. శుక్రవారం (డిసెంబర్ 7) రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు.
ఇలా ఉండగా తెలంగాణ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి పేరును కాంగ్రస్ ప్రధాన కార్యదర్శి వేణుగోపాల్ ప్రకటించిన క్షణం నుంచీ రేవంత్ కు అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. రేవంత్ కు పీసీసీ చీఫ్ పదవి కట్టబెట్టడాన్ని తొలుత గట్టిగా వ్యతిరేకించిన కోమటిరెడ్డి వెంకటరెడ్డి సీఎంగా రేవంత్ ఎంపికను స్వాగతిస్తూ ఆయనకు అభినందనలు తెలిపారు.మీడియాతో మాట్లాడిన సీఎంగా బాధ్యతలు చేపట్టనున్న సోదరుడు రేవంత్ కు శుభాకాంక్షలు అని చెప్పారు.
ఇలా ఉండగా.. తెలంగాణ రాష్ట్ర రెండో ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టనున్న రేవంత్ రెడ్డికి అభినందనలు, శుభాకాంక్షలూ వెల్లువెత్తుతున్నాయి. తెలుగుదేశం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ రేవంత్ రెడ్డిని అభినందించారు. రాజకీయాల్లో అంచెలంచెలుగా ఎదిగిన రేవంత్ పై తెలంగాణ ప్రజలు పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేయకుండా వారి ఆకాంక్షలను నేరవేర్చాలని, రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపించాలని కోరారు. పరిపాలనలో ప్రత్యేకమైన ముద్ర వేసి తెలంగాణ ప్రజల హృదయాల్లో సుస్థిర స్థానం సంపాదించుకోవాలని కోరారు.
ఇక రేవంత్ రెడ్డి తెలంగాణ రాజకీయాలలో సృష్టించిన సంచలనాలు అన్నీ ఇన్నీ కావు. 2017, అక్టోబర్ లో కాంగ్రెస్ గూటికి చేరిన రేవంత్ సల్వ కాలంలోనే పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా ,పార్టీ ప్రెసిడెంట్ గా ప్రమోట్ అయ్యారు. ఆ తర్వాత 2018 డిసెంబర్ లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కొడంగల్ నుంచి పోటీ చేసి ఓటమి పాలైనా ఆ తర్వాత 2019 జరిగిన లోక్ సభ ఎన్నికల్లో మల్కాజిగిరి పార్లమెంట్ నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఎంపీగా గెలుపొందారు. మల్కాజిగిరి పార్లమెంట్ సెగ్మెంట్ లో ఏడు అసెంబ్లీ స్థానాల్లో అధికార బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు ప్రతినిధ్యం వహిస్తున్నప్పటికీ ప్రశ్నించే గొంతుక ను గెలిపించుకోండంటూ ప్రజల మన్ననలు పొంది విజయం సాధించారు.
టీపీసీసీ చీఫ్ గా రేవంత్ ప్రజా సమస్యలపై అధికార బీఆర్ఎస్ అక్రమాలు, అవినీతిపై నిరంతర పోరాటం చేశారు. అలాగే తెలంగాణ ఆవిర్భావం నుంచీ వరుస పరాజయాలతో ఉనికి మాత్రంగా మిగిలిన రాష్ట్ర కాంగ్రెస్ లో నూతనోత్సాహం నింపి పార్టీకి జవసత్వాలు తీసుకువచ్చారు. పార్టీ విజయం సాధించిన తరువాత ఎటువంటి ప్రతిష్ఠంభనకూ తావు లేకుండా రేవంత్ సీఎంగా ఏకగ్రీవంగా గెలుపొందిన ఎమ్మెల్యేలంతా ఎన్నుకుంటారనే అంతా భావించారు. అయితే అయితే పార్టీ విజయం సాధించిన తరువాత అగ్రపీఠం కోసం సీనియర్ల మంటూ కొందరు పట్టుబట్టడంతో రెండు రోజుల పాటు సీఎం ప్రకటనపై అధిష్ఠానం తాత్సారం చేసింది.
తాత్సారం అయితే చేసింది కానీ తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డే అన్న స్పష్టమైన సంతాకేలను మాత్రం ఇచ్చింది. సీఎం పీఠం కోసం పట్టుబడుతున్న నేతలను హస్తిన పిలిపించుకుని క్లాస్ పీకింది. పరిస్థితిని విడమరచి చెప్పి వారిని ఒప్పించింది. చివరికి వారిద్దరినీ పక్కన పెట్టుకునే కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి హస్తినలోనే తెలంగాణ సీఎం రేవంత్ అంటూ విస్పష్ట ప్రకటన చేశారు. దీంతో గురువారం ఉదయం 10.15 గంటలకు రేవంత్ తెలంగాణ సీఎంగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఎట్టకేలకు తెలంగాణ ఇచ్చిన పార్టీ.. ఆ రాష్ట్రంలో అధికారాన్ని హస్తగతం చేసుకుంది.