రాజకీయాలనుంచి కేసీఆర్ రిటైర్మెంట్?
posted on Dec 6, 2023 @ 9:56AM
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలలో పార్టీ ఓటమి తరువాత బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు రాజకీయాల నుంచి తప్పుకునే యోచన చేస్తున్నారా? కనీసం బీఆర్ఎస్ శాసనసభా పక్ష నాయకుడిని కూడా ఏకగ్రీవంగా ఎంపిక చేయలేనంతగా పార్టీలో తన పట్ల అవిధేయత పెరిగిపోవడాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. తాను గెలిచిన గజ్వేల్ స్థానానికి కూడా రాజీనామా చేసి రాజకీయాల నుంచి వాలంటరీ రిటైర్మెంట్ తీసుకోనున్నారా? అంటే పరిశీలకులు ఔననే అంటున్నారు. అందుకు తార్కానంగా గజ్వేల్ లో ఉప ఎన్నికకు సిద్ధం కమ్మంటూ ఒంటేరుకు కేసీఆర్ సూచన చేసినట్లుగా సమాజిక మాధ్యమంలో వైరల్ అవుతున్న పోస్టును చూపుతున్నారు.
కేసీఆర్ మనస్తత్వం, వైఖరి తెలిసిన వారంతా ఇది నిజమేనని నమ్ముతున్నారు. ఎందుకంటే ఆయన బీఆర్ఎస్ అధినేతగా పార్టీని తన క నుసన్నలలో నడిపారు. ధిక్కారం, అవిధేయతను ఇసుమంతైనా సహించేవారు కాదు. అటువంటి వైఖరి కనిపించిన నేత ఎంతటి వారైనా నిర్దాక్ష్యిణ్యంగా వేటు వేసేవారు. ఈటల ఉదంతం అందుకు తిరుగులేని నిదర్శనం. ఇక ఉద్యమంలో ఒక్కరొక్కరుగా తనతో పాటు అడుగు వేసిన వారిని పార్టీకి దూరం పెట్టడం, చివరాఖరికి ఉద్యమంలో అడుగడుగునా చేదోడు వాదోడుగా ఉన్న కోదండ రాం లాంటి వారిని కూడా కోదండరామా కోదండమా అంటూ ఎగతాళిగా మాట్లాడిన ఉదంతాలను పరిశీలకులు ఉదహరిస్తున్నారు.
అసలు టీఆర్ఎస్, బీఆర్ఎస్’గా పేరు మార్చుకున్న తర్వాత ఒక్కటొక్కటిగా కేసీఆర్ కు అన్నీ ప్రతికూలతలే కనిపించాయి. జాతీయ రాజకీయాలలో తనతో కలిసి వచ్చే వారు కానీ, తనను కలుపుకుని పోయే వారు కానీ కనిపించక ఏకాకిగా మారిపోయారు. అదే సమయంలో రాష్ట్ర పాలనా వ్యవహారాలపైనే కాదు, పార్టీ వ్యవహారాలను కూడా పట్టించుకోవడం మానేశారు. దీంతో అనివార్యంగా ప్రభుత్వ, పార్టీ వ్యవహారాలలో ఆయన కుమారుడు కేటీఆర్ అంతా తానై అన్నట్లుగా వ్యవహరించారు. అయితే జాతీయ రాజకీయాలపై సీరియస్ గా దృష్టి పారించి దేశమంతా కలియదిరుగుతున్న సందర్భంలో ఒక సారి కేసీఆర్ స్వయంగా తనకు రాష్ట్ర రాజకీయాలపై ఆసక్తి తగ్గిపోయిందనీ, బోర్ కొడుతోందని చెప్పారు.
2018లో రెండవసారి అధికారంలోకి వచ్చింది మొదలు, పార్టీ, ప్రభుత్వ పగ్గాలు వారసుడు కేటీఆర్ కు అప్పగించే ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. అయితే, వినాయకుడి పెళ్లికి వేయి విఘ్నాలు అన్నట్లుగా కేటీఆర్ పట్టాభిషేక ముహూర్తం వాయిదాలు పడింది. ఈ నేపథ్యంలోనే జాతీయ రాజకీయాలలో కేసీఆర్ ఒక అడుగు కూడా వేయకుండానే అదో విఫలయత్నంగా మారిపోయింది.
ఈ నేపద్యంలోనే ఇప్పుడు తెలంగాణలో పార్టీ పరాజయం పాలు కావడం, గతంలోలా తన నాయకత్వంపై పార్టీలో సంపూర్ణ సమ్మతి లేకపోవడంతో రాజకీయాల నుంచి వైదొలిగే యోచనలో కేసీఆర్ ఉన్నారనీ, అందుకే గజ్వేల్ ఉప ఎన్నిక గురించి ఎన్నికలు పూర్తయిన రోజుల వ్యవధిలోనే ప్రస్తావించారనీ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.