మంత్రి లోకేష్ మాట.. 3 రోజుల్లోనే అమలు బాట!
posted on Jun 19, 2024 7:11AM
మాట ఇస్తే నెరవేరాల్సిందే... ఇది మంత్రి నారా లోకేష్ ఫాలో అవుతున్న పాలసీ. లోకేష్ ఇంకా విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రిగా సచివాలయంలోకి అడుగు పెట్టలేదు. అయినా ఆయన చేపట్టిన విద్యాశాఖలో యాక్షన్ ప్లాన్‌ని శరవేగంగా ప్రారంభించేశారు. ఇంటర్ విద్యార్థులకు ఉచిత పాఠ్య పుస్తకాలపై జీఓ విడుదల చేశారు. తాను మాట ఇచ్చిన మూడు రోజుల్లోనే అమలు చేశారు. ఈనెల 15వ తేదీన ఉండవల్లి నివాసంలో ఉన్నత విద్యాశాఖ అధికారులతో నారా లోకేష్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ విద్యా సంస్థల్లో ఇంటర్మీడియట్ చదివే విద్యార్థులకు గత ప్రభుత్వం పాఠ్య పుస్తకాలు ఇవ్వడం నిలిపివేసిందని తెలుసుకున్నారు. పుస్తకాలు లేకుండా పిల్లలు ఎలా చదువుకుంటారని లోకేష్ ఆ సమావేశంలోనే అధికారులను ప్రశ్నించారు. ఈ విద్యాసంతవ్సరం నుంచి వెంటనే విద్యార్థులకు పాఠ్య పుస్తకాలు పంపిణీ చేయాలని ఆదేశించారు. దాంతో అధికారులు మూడురోజుల్లోనే జీవో నంబర్ 28ని విడుదల చేశారు. త్వరలోనే పుస్తకాల పంపిణీ కార్యక్రమాన్ని కూడా ప్రారంభించబోతున్నారు. గవర్నమెంట్ పనులు అంటేనే నత్త నడక నడుస్తాయన్న అభిప్రాయం అందర్లోనూ నెలకొన్న నేపథ్యంలో లోకేష్ ఇంత వేగంగా నిర్ణయాలు తీసుకోవడం, వాటిని అమలు చేయడం పట్ల విద్యార్థుల తల్లిదండ్రులు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు.