పోసాని అరెస్టుతో విజయసాయి లో మొదలైన టెన్షన్!?
posted on Feb 28, 2025 @ 1:32PM
జనసేన అధినేత పవన్ కల్యాణ్, తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్‌పై అనుచిత విమర్శలు చేశారన్న ఫిర్యాదుపై పోలీసులు పోసాని కృష్ణమురళిని అరెస్టు చేశారు. ఆయనపై 196, 353(2), 111 రెడ్‌విత్ 3(5) సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేసి హైదరాబాద్ లోని మై హోం భూజా అపార్ట్ మెంట్స్ లో ఉంటున్న ఆయనను అదుపులోనికి తీసుకుని ఆంధ్రప్రదేశ్ కు తరలించారు. అన్నమయ్య జిల్లాలోని ఓబులవారిపల్లె పోలీసు స్టేషన్ లో ఆయనను సుదీర్ఘంగా విచారించారు. అనంతరం ఆయనను రైల్వేకోడూరు జూనియర్ సివిల్ జడ్జి కోర్టు మెజిస్ట్రేట్ ముందు హాజరు పరిచారు. మేజిస్ట్రేట్ ఆయనకు 14 రోజుల రిమాండ్ విధించారు. దీంతో పోలీసులు పోసాని కృష్ణ మురళిని రాజం పేట సబ్ జైలుకు తరలించారు.
వైసీపీ హయాంలో అధికారాన్ని అడ్డుపెట్టుకొని ఎవరైతే చట్టాన్ని ఉల్లంఘించి ప్రజలను, టీడీపీ కార్యకర్తలను ఇబ్బంది పెట్టారో.. వారిని వదిలే ప్రసక్తే లేదు.. వెయిట్ అండ్ వాచ్.. మార్క్ మై వర్డ్స్.. టైం.. డేట్ కూడా రాసుకోండి అంటూ మంత్రి నారా లోకేశ్ మండలిలో ప్రతిపక్ష సభ్యులను ఉద్దేశిస్తూ వ్యాఖ్యానించారు. తద్వారా త్వరలో మరికొంత మంది వైసీపీ నేతలు అరెస్టు కాబోతున్నారని లోకేశ్ క్లియర్ కట్ గా చెప్పారు. దీంతో వైసీపీ నేతలు వణికిపోతున్నారు. ఎవరు ఎప్పుడు కటకటాల పాలుకావాల్సి వస్తుందోనని భయపడుతున్న పరిస్థితి. సరిగ్గా ఆ పరిస్థితిలో పోసాని కృష్ణ మురళి అరెస్టయ్యారు. దీంతో ఇప్పుడు అధికారం అండ చూసుకుని ఇష్టారీతిగా చెలరేగిపోయిన వైసీపీయులందరిలో వణుకు మొదలైంది? తరువాతి వంతు ఎవరు? అన్న ఆందోళన ప్రారంభమైంది.
అయితే పోసాని కృష్ణ మురళి అరెస్టుతో అందరి కన్నా ఎక్కువగా ఆందోళన పడుతున్నది మాత్రం విజయసాయి రెడ్డి అన్న చర్చ రాజకీయవర్గాలలో జోరుగా సాగుతోంది.
ఎందుకంటే వైసీపీ అధికారం కోల్పోయిన తరువాత జ్ణానోదయం అయ్యి రాజకీయాలకు గుడ్ బై చెప్పేసి.. చేసిన తప్పులు దండంతో సరిపెట్టేయండి ప్లీజ్ అంటూ వేడుకున్న పోసాని కృష్ణ మురళి అరెస్టు అయ్యారు. విజయసాయిరెడ్డి కూడా అరెస్టు తప్పించుకోవడానికి రాజకీయ సన్యాసం ప్రకటించేశారు. ఇక తన వ్యాపకం వ్యవసాయమేనని చాటి చెప్పారు. పనిలో పనిగా గతంలో తాను విమర్శలు చేసిన వారికి పరోక్షంగా క్షమాపణలు కూడా చెప్పేశారు. చంద్రబాబు, లోకేష్, పవన్ కల్యాణ్ తనకు మంచి మిత్రులని ఉద్ఘాటించారు. అంతే కాదు.. తన రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేయడం ద్వారా కీలకమైన ఒక రాజ్య సభ స్థానాన్ని తెలుగుదేశం కూటమికి అప్పగించేశారు. ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో వైసీపీ ఒక్కటంటే ఒక్క రాజ్యసభ స్థానం కానీ, ఎమ్మెల్సీ స్థానం కానీ గెలుచుకునే అవకాశాలు ఇసుమంతైనా లేవు.
వైసీపీకి రాజీనామా చేసి, రాజకీయాలకు గుడ్ బై చెప్పేయడం, అప్పనంగా రాజ్యసభ సీటును పాలక కూటమికి అప్పగించేయడం ద్వారా ప్రభుత్వం తనపై కరుణ చూపుతుందని విజయసాయిరెడ్డి ఆశించారనడంలో సందేహం లేదు. ఇప్పుడు ఆయన ఖాళీ చేసిన రాజ్యసభ స్థానంలో తెలుగుదేశం పార్టీ బీజేపీకి అవకాశం ఇస్తుందా లేదా అన్నది పక్కన పెడితే.. బీజేపీ మాత్రం ఏదో మేరకు విజయసాయిపై సాఫ్ట్ కార్నర్ ప్రదర్శించే అవకాశం ఉన్నప్పటికీ తెలుగుదేశం మాత్రం విజయసాయి విషయాన్ని అంత తేలిగ్గా తీసుకుంటుందని భావించలేం. ఎందుకంటే జగన్ ఆస్తుల కేసులో విజయసాయి ఆయన సహ నిందితుడు. జగన్ ఏ1 అయితే విజయసాయి ఏ2. అలాగే వైఎస్ రాజారెడ్డి కాలం నుంచీ విజయసాయి వైఎస్ఆర్ కుటుంబానికి ఆడిటర్. అన్నిటికీ మించి రాజకీయాలలో జగన్ కు వెన్నంటి నడిచిన వాడు, నడిపించిన వాడూ కూడా విజయసాయిరెడ్డే. అటువంటి విజయసాయిరెడ్డి 2029 ఎన్నికల సమయానికి మళ్లీ రాజకీయాలలోకి వచ్చి జగన్ కు వెన్నుదన్నుగా నిలిచే అవకాశాలను పూర్తిగా కొట్టి పారేయలేం. అందుకే విజయసాయిరెడ్డిని తేలికగా తీసుకోవడానికి తెలుగుదేశం సిద్ధంగా ఉండే అవకాశాలు లేవు.