సంగీత దర్శకుడు జెవి రాఘవులు అస్తమయం
posted on Jun 7, 2013 @ 11:31AM
జననీ జన్మ భూమిశ్చ లాంటి దేశభక్తి గీతాలు.. చినుకు చినుకుగా లాంటి విరహగీతాలు. ఇంట్లో రామయ్య వీదిలో కృష్ణయ్య లాంటి హుషారెత్తించే పాటలు.. ఈ జీవన తరంగాలలో లాంటి వేదాంత గీతాలు.. ఆయన స్వరం చేయని పాటలేదు.. ఆస్వరం పాడని పాటా లేదు.. ఆయన సుమధుర సుస్వర సంగీత దర్శకుడు జెవి రాఘవులు.. ఎన్నో మరపురాని మథుర గీతాలను అందించిన రాఘవులుగారు ఈ ఉదయం తుది శ్వాస విడిచారు.. తెలుగు సినిమాకు ఎన్నో సూపర్ హిట్ సినిమాలను అందించిన ఈ సంగీత ప్రవాహానికి నివాళులర్పిద్దాం..
ఘంటసాల ప్రియశిష్యుడిగా ప్రస్థాన్నాన్ని ప్రారంభించిన ఆయన ఎన్నో మరుపురాని గీతాలతో గాయకుడిగా మరెన్నో విజయవంతమైన చిత్రాలతో సంగీత దర్శకునిగా కూడా మంచి పేరు తెచ్చుకున్నారు.. దాదాపు 112 సినిమాలకు సంగీత దర్శకత్వం వహించారు..
నాటకాలలో చిన్న చిన్న వేషాలు వేస్తూ తన ప్రస్థానాన్ని ప్రారంభించిన ఆయన తరువాత రేడియోలో పాటలు పాడేవారు.. ఒకసారి రికార్డింగ్‌లో ఆయన పాట విన్న ఘంటసాల గారు ఆయన్ను తన శిష్యునిగా స్వీకరించి ఆయన సినీ ప్రయాణానిరి బాటలు వేశారు..
ఘంటసాల పిలుపు అందుకున్న రాఘవులు గారు మరో ఆలోచన లేకుండా కనీసం ఇంట్లో తన తల్లిదండ్రులకు కూడా చెప్పకుండా మద్రాసు ట్రైన్ ఎక్కేశారు.. ఘంటసాల గారి దగ్గర అసిస్టెంట్‌గా చేరారు..
ఘంటసాల గారు స్వరపరిచిన ఎన్నో సినిమాల్లో రాఘవులు గారు పాటలు పాడారు.. వాటిలో లవకుశ, జగదేకవీరుని కథ, పరమానందయ్య శిష్యుల కథ లాంటి సినిమాలు ఉన్నాయి ఈ సినిమాలతో జెవి రాఘవులుకు గాయకునిగా కూడా మంచి గుర్తింపు వచ్చింది..
కేవలం ఘంటసాల గారితోనే కాదు.. కెవి మహదేవన్, ఎమ్ ఎస్ విశ్వనాధన్ సంగీత దర్శకుల సినిమాలలో కూడా చాలా పాటలు పాడారు.. సంగీత దర్శకునిగా మారకముందే వందల సంఖ్యలో పాటలు పాడారు..
కెవి మహాదేవన్ సంగీతం అందించిన ప్రేమ్‌నగర్ సినిమాలో కూడా ఓ పాట కంపోజ్ చేశారు రాఘవులు.. వ్యక్తిగత కారణాలతో ఓ పాట చేయకుండానే మహదేవన్‌గారు తప్పుకోవడంతో ఆ సినిమాలోని ఎవరి కోసం పాటను రాఘవులుగారు కంపోజ్ చేశారు..
1970లో ఘంటసాలగారి మరణంతో తప్పని పరిస్థితుల్లో ద్రోహి సినిమాతో పూర్తి స్థాయి సంగీత దర్శకునిగా పరిచయం అయ్యారు రాఘవులు.. తరువాత ఎక్కువగా దాసరి, కోడి రామకృష్ణ లాంటి దర్శకుల సినిమాలకు పని చేశారు..
అప్పట్లో స్టార్ హీరోలుగా వెలుగొందుతున్న ఎన్టీఆర్, ఏఎన్నార్, కృష్ణ, కృష్ణంరాజు, చిరంజీవి లాంటి స్టార్ హీరోలందరి సినిమాలకు సంగీత దర్శకత్వం వహించారు. వీరి కాంభినేషన్‌లో ఎన్నో సూపర్ హిట్స్ కూడా వచ్చాయి..
సినీ రంగం చైన్నైలో ఉన్నన్ని నాళ్లు స్టార్ మ్యూజిక్ డైరెక్టర్‌గా వెలుగొందిన రాఘవులు గారికి ఇండస్ట్రీ హైదరాబాద్ వచ్చాకా అవకాశాలు తగ్గిపోయాయి.. దీంతో ఆయన తన సొంత ఊరు రాజమండ్రిలో స్థిరపడిపోయారు.. వందకు పైగా సినిమాలకు అద్భుతమైన సంగీతం అందించిన రాఘవులు గారు చివరి దశలో ఆర్ధికంగా ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొన్నారు..
ఇలా తెలుగు కళామతల్లికి పాటల పట్టం కట్టిన జెవి రాఘవులు గారు.. ఈ లోకాన్ని విడిచినా ఆయన పాటలతో ఎప్పుడూ మనతో ఉంటారు.. మరోసారి ఆ సంగీత సాగరానికి నివాళులర్పిద్దాం