చీలిక పేలికలవుతున్న మీడియాను కాపాడేదెవరు
posted on Aug 11, 2014 @ 8:37PM
ఇంతవరకు ప్రజలు సాక్షి వెర్సెస్ ఆంధ్రజ్యోతి, ఈనాడు మీడియా యుద్దాన్నే చూసారు. వారి యుద్దంలో ఇప్పుడు మరో కొత్త భాగస్వామి కూడా వచ్చి చేరింది. అదే ‘నమస్తే తెలంగాణా’ పత్రిక. ఆంధ్రజ్యోతిలో తెలంగాణా ప్రభుత్వానికి వ్యతిరేఖంగా వెలువడుతున్నకధనాలపై, వాటిని ప్రచురిస్తున్న సంపాదకుడు రాధాకృష్ణపై నేరుగా విమర్శలు గుప్పిస్తూ ‘ఆంధ్రజ్యోతి చెత్త పలుకులు’ పేరిట ఈరోజు సంచికలో ఒక కధనం ప్రచురించింది. బహుశః రేపు దానికి దీటుగా ఆంద్రజ్యోతి కూడా ఒక కధనం ప్రచురించినా ఆశ్చర్యం లేదు.
తమ మేధస్సును ప్రజాస్వామ్య పరిరక్షణకు, ప్రజాభిప్రాయాన్ని, ప్రజా సమస్యలను ఎత్తి చూపేందుకు వాడవలసిన మీడియా ఈ విధంగా ఒకదానిపై మరొకటి బురద జల్లు కోవడానికి వినియోగించుకోవడం చాలా బాధ కలిగిస్తుంది. దానివలన ప్రజలకు మీడియాపై ఉన్న నమ్మకం, గౌరవం రెండూ పోతాయి. ఇప్పటికే పార్టీల వారిగా చీలిపోయిన మీడియా, రాష్ట్రవిభజనతో ఆంద్ర, తెలంగాణా మీడియాలుగా కూడా రెండుగా చీలిపోయింది.
ఒకప్పుడు ఏదయినా మీడియా మీద ఈగ వాలితే యావత్ మీడియా అక్కడ కాకుల్లా వాలిపోయి దానికి అండగా నిలబడేది. కానీ ఇప్పుడు మీడియానే ముక్కలు చెక్కలుగా విడిపోతూ ఒకదానినొకటి కాకుల్లా పొడుచుకోవడం చూడవలసి రావడం చాలా దురదృష్టకరమే. మీడియాకు, రాజకీయాలకు, నేతలకు మధ్య ఉండాల్సిన సన్నటి గీత చెరిగిపోయినప్పటి నుండే మీడియాకు ఈ దుస్థితి ఆరంభమయిందని చెప్పవచ్చును.
ఒకప్పుడు సమున్నత విలువలు పాటిస్తూ రాజకీయ నేతలకు మార్గదర్శనం చేసిన తెలుగు మీడియాలో చీలికపేలికలు ఏర్పడి నానాటికి బలహీనపడుతూ ఇపుడు మెల్లగా రాజకీయ నాయకుల చేతుల్లోకి వెళ్ళిపోతోంది. ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే మీడియా క్రమంగా తన స్థాయి తానే స్వయంగా దిగజార్చుకొంటూ ప్రజల దృష్టిలో కూడా పలుచనయ్యే లక్షణాలే ఎక్కువ కనిపిస్తున్నాయి. ప్రజాస్వామ్య వ్యవస్థకు మూలస్థంభం వంటి మీడియా పునాదులు ఈవిధంగా బలహీనపడటం మంచి పరిణామం కాదు. మీడియా తన ఉనికిని, గౌరవాన్ని కోల్పోకూడదని భావిస్తే తనను తానే పునరుద్దరించుకోవలసి ఉంటుంది తప్ప దానిని సామాన్య జనాలు కాపాడలేరు.