అభినయానికి ప్రాణమిచ్చిన నాటక రంగం..
posted on Apr 16, 2025 @ 9:30AM
కళలకు భారతదేశం పెట్టింది పేరు. ఇప్పుడు సినిమా హాళ్లలో సినిమాలు ఇంతగా వస్తున్నాయి కానీ.. కొన్ని సంవత్సరాల క్రితం వీధులలో నాటకాల రూపంలో వివిధ కథలు, చారిత్రాత్మక సంఘటనలను ప్రదర్శించేవారు. ఇలా పుట్టిందే నాటక రంగం. రాత్రి సమయాల్లో లాంతర్లు, దివిటీలు పెట్టి నాటకాలను ప్రదర్శించేవారు. పగలంతా కష్టం చేసిన ఆనాటి ప్రజలకు రాత్రయ్యే సరికి ఇదొక మంచి వినోదంగా ఉండేది. ఈ కోవలో హరికథలు, బుర్రకథలు, తోలుబొమ్మలాట వంటివి ఎన్నో ఉన్నాయి. కానీ సినీ పరిశ్రమ ఇంత ఎత్తు ఎదగడానికి కారణమైనది మాత్రం నాటక రంగమే.. ప్రతి ఏడాది ఏప్రిల్ 16వ తేదీని తెలుగు నాటక రంగ దినోత్సవం గా జరుపుకుంటారు. అయితే ఇందులో ఉన్న ప్రత్యేకత ఏమిటంటే.. ఈ తెలుగు నాటక రంగ దినోత్సవం అనేది ప్రముఖ సంఘసంస్కర్త కందుకూరి విరేశలింగం పంతులు గారి జన్మదినోత్సవం సందర్బంగా జరుపుకుంటారు. తెలుగు ప్రజల గుండెల్లో చెరగని ముద్ర వేసుకున్న కందుకూరి విరేశలింగం పంతులు గారి జన్మదినోత్సవం తెలుగు నాటక రంగ దినోత్సవంగా ఎలా మారింది? తెలుగు నాటక రంగ దినోత్సవం గురించి పూర్తీగా తెలుసుకుంటే..
కందుకూరి వీరేశలింగం పంతులు తెలుగు నాటక రంగానికి మార్గదర్శకుడు (రచయిత). బహుముఖ ప్రజ్ఞాశాలి అయిన ఆయన నాటకాలు, నవలలు, సామాజిక వ్యంగ్య రచనలు రాశారు. ఇవి తెలుగు సాహిత్యంపై గొప్ప ప్రభావాన్ని చూపాయి. అన్నింటికంటే మించి వీరేశలింగం గొప్ప సంఘ సంస్కర్త కూడా. ఆయన తన రచనల ద్వారా జాతి వివక్ష, అనేక ఇతర సామాజిక దురాచారాలకు వ్యతిరేకంగా పోరాడారు. ఆ సమయంలో అరుదుగా ఉండే వితంతు పునర్వివాహాలను ఆయన ప్రోత్సహించారు. మొదటి తెలుగు నాటకం కందుకూరి రాసిన వ్యవహార ధర్మ బోధని మొదటిసారిగా ప్రదర్శించబడింది.
2007లో, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కందుకూరి వీరేశలింగం పుట్టినరోజును 'తెలుగు నాటకరంగ దినోత్సవం'గా జరుపుకుంటామని ప్రకటించింది. అప్పటి నుండి నాటక కార్యకర్తలు ఏప్రిల్ 16ని తెలుగు నాటక దినోత్సవంగా జరుపుకుంటున్నారు.
కందుకూరి విరేశలింగం పంతులు గారు ఆధునిక నాటక ప్రదర్శనకు రూపం ఇచ్చిన వారిలో ఒకరు. విరేశలింగం పంతులు గారు డైలాగ్స్ రూపంలో బ్రాహ్మ వివాహము అనే నాటకాన్ని హాస్య సంజీవని అనే పత్రికలో రచించారు. ఆ తరువాత వ్యవహార ధర్మభోధిని అనే నాటకాన్ని ప్రకటించారు. ఆనాటి గ్రాంథిక భాష కాలంలో వ్యవహారిక బాషలో ఒక నాటకాన్ని సాగించడం పెద్ద సాహసమనే చెప్పాలి. వేదిక మీద ప్రదర్శించిన తొలి నాటకం ఇది. తెలుగు రాష్ట్రంలో తొలి నాటక సమాజాన్ని స్థాపించిన ఘనత కందుకూరి విరేశలింగం పంతులు గారిదే. ఈ కారణంగానే కందుకూరి విరేశలింగం పంతులు గారి జన్మదినోత్సవాన్ని తెలుగు నాటక రంగ దినోత్సవంగా జరుపుకుంటున్నారు.
*రూపశ్రీ.