పశ్చిమ బెంగాల్ లో ఐప్యాక్ కార్యాలయంపై ఈడీ దాడులు.. బయటపడ్డ వైసీపీ ఆర్థిక లోసుగులు
posted on Jan 9, 2026 9:23AM
ప్రపంచంలో ఎక్కడ ఏ ఆర్థిక నేరం జరిగినా దానితో వైసీపీకి ఉన్న లింకులు బయటపడుతున్నాయి. తాజాగా కోల్ కతాలో ఐప్యాక్ కార్యాలయంపై ఈడీ దాడులు నిర్వహించింది. పశ్చిమ బెంగాల్ లో అధికారంలో ఉన్న తృణమూల్ కాంగ్రెస్ కు ఐ ప్యాక్ సంస్థ ఎన్నికల వ్యూహాలను అందిస్తున్న సంగతి తెలిసిందే. ఐప్యాక్ తో తృణమూల్ అనుబంధం 2021 ఎన్నికలకు ముందు నుంచీ ఉంది. అలాగే ఇదే ఐ ప్యాక్ ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి జగన్ రెడ్డికి కూడా 2024 ఎన్నికలలో ఇటువంటి సహకారమే అందించింది. అది పక్కన పెడితే ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ పశ్చిమబెంగాల్ లోని ఐప్యాక్ ప్రధాన కార్యాలయంలో జరిపిన సోదాలలో.. గతంలో ఆ సంస్థ ఆంధ్రప్రదేశ్ లో వైసీపీకి ఎన్నికల వ్యూహాలపై సహకారం అందించిన సమయంలో జరిగిన ఆర్థిక లావాదేవీల గుట్టు బయటపడింది.
ఆ ఆర్థిక అవకతవకలపై కూడా ఇప్పుడు ఈడీ దృష్టి సారించినట్లు రాజకీయవర్గాలలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. కోల్ కతా ఈడీ సోదాల్లో.. జగన్‌కు అత్యంత సన్నిహితుడైన రాజ్ కసిరెడ్డికి చెందిన పలు కీలక డాక్యుమెంట్లు ఈడీకి లభించినట్టు తెలుస్తోంది. ఈ రాజ్ కసిరెడ్డి ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణంలో ప్రధాన నిందితుడిగా ఉన్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణం కేసులో అరెస్టై రిమాండ్ ఖైదీగా ఉన్న రాజ్ కసిరెడ్డికి సంబంధించిన కీలక డాక్యుమెంట్లు కోల్ కతాలో ఐప్యాక్ కార్యాలయంలో ఈడీ జరిపిన సోదాలలో లభ్యం కావడంతో, ఈడీ రాజ్ కసిరెడ్డి ఆర్థిక లావాదేవీలపై దృష్టి సారించి దర్యాప్తునకు సమాయత్తమౌతున్నట్లు తెలుస్తోంది.