త్వరలో వరంగల్ వాసులకు విమానయాన సేవలు
posted on Aug 25, 2020 @ 5:11PM
ఎయిర్ పోర్టుకు తగిన స్థలం కోసం 10 రోజుల్లో సర్వే
వరంగల్ నగర అభివృద్ధిలో భాగంగా మామునూరు ఎయిర్ పోర్టు సేవలు ప్రారంభించాలని తెలంగాణ రాష్ట్ర సమితి కార్యనిర్వాహక అధ్యక్షులు, ఐటీ, పురపాలక, పరిశ్రమల శాఖల మంత్రి కేటిఆర్ కేంద్ర మంత్రి ని కోరారు.
వరంగల్ లోని మామునూరు ఎయిర్ పోర్టును ఉడాన్ పథకంలో చేర్చి, మామునూరు ఎయిర్ పోర్టును ఆపరేషన్ లోకి తీసుకురావాలని కోరుతూ ఢిల్లీలో కేటిఆర్ కేంద్ర పౌర విమానయాన, పట్టణ వ్యవహారాలు, గృహ నిర్మాణ శాఖల మంత్రి హర్దీప్ సింగ్ పూరిని కలిసి విజ్ణప్తి చేశారు. 10 రోజుల్లో ఇందుకోసం సర్వే చేయిస్తామని కేంద్ర మంత్రి హామీ ఇచ్చారు. దాంతో త్వరలో ఓరుగల్లు వాసులకు విమాన సర్వీసులు అందుబాటులోకి రానున్నాయి. తెలంగాణ రాష్ట్రంలో మరో ఐదు చోట్ల ఎయిర్ పోర్టులను ఏర్పాటు చేయడంపై సర్వే జరుగుతుంది. అయితే మామునూరులో రన్ వే ఉండడంతో త్వరలో ఓరుగల్లులో విమానయాన సేవలు అందుబాటులోకి వస్తాయని అనుకుంటున్నారు.
వరంగల్ లో విమానయాన సేవలు అందుబాటులోకి వస్తే హైదరాబాద్ తర్వాత అంతటి స్థాయి, వసతులున్న నగరంగా వరంగల్ మారుతుంది. ఎయిర్ పోర్ట్ నిర్మాణం నగర అభివృద్ధిలో కీలక ఘట్టంగా మారుతుంది.