Read more!

ఇరాక్‌లో ఇరుక్కున్న తెలంగాణ బిడ్డలు

 

 

 

ఇరాక్‌లో అంతర్యుద్ధం జరుగుతోంది. ఇరాక్‌లో తుపాకులు, బాబులు విచ్చలవిడిగా పేలుతున్నాయి. ఇరాక్‌లో మిలిటెంట్లకు, ప్రభుత్వ బలగాలకు మధ్య హోరాహోరీ ఘర్షణలు సాగుతున్నాయి. సిరియా సరిహద్దులోని వ్యూహాత్మక షియా పట్టణం తల్ అఫర్‌పై పట్టుకోసం ఇరు పక్షాలు భీకరంగా తలపడ్డాయి. మిలిటెంట్లు కొన్ని గంటలపాటు పట్టణంపై దాడి చేసి తల్‌అఫర్‌ను స్వాధీనం చేసుకున్నాయి. బాంబులు, తుపాకులు అక్కడ పేలుతున్నప్పటికీ వాటి ప్రతిధ్వని మాత్రం ఉత్తర తెలంగాణలోని అనేకమంది గుండెల్లో వినిపిస్తోంది. దీనికి కారణం.. ఇరాక్‌లోని వివిధ ప్రాంతాలలో ఉత్తర తెలంగాణ జిల్లాలకు చెందిన అనేక మంది వివిధ పనుల నిమిత్తం వెళ్ళారు. ప్రస్తుతం ఇరాక్‌లో స్థానిక ప్రజలకే భద్రత కరువైపోయింది. ఇక వలస వెళ్ళినవారి పరిస్థితి ఊహించడానికే వీల్లేకుండా వుంది. పైగా ఇరాక్‌లో తిరుగుబాటు చేసిన వర్గాలు ఇతర దేశాలకు చెందిన వారు ఇరాక్‌ వదిలిపోవాలని ఇప్పటికే హెచ్చరించారు. ఈ నేపథ్యంలో ఇరాక్‌లో వున్న తెలంగాణ వారి బంధువులు ఇక్కడ భయపడుతున్నారు. ఈ నేపథ్యంలో ఇరాక్ పరిణామాల గురించి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అధికారులను ఆరా తీశారు. ఇరాక్ పరిణామాలకు సంబంధించిన అన్ని వివరాలను తెలుసుకోవాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మను ఆదేశించారు. ఈ నేపథ్యంలో విదేశాంగ శాఖతో సీఎస్ రాజీవ్ శర్మ సంప్రదింపులు జరుపుతున్నారు. ఇరాక్లో ఉన్న తెలుగువారి పరిస్థితిపై ఆయన ఆరా తీస్తున్నారు.