తెలంగాణ జిన్నా కేసీఆర్!
posted on Jun 2, 2024 @ 5:20PM
తెలంగాణ రాష్ట్రం దశాబ్ది వేడుకలు జరుపుకుంటున్న శుభవేళ రాష్ట్ర మంతి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ నాయకుడు కేసీఆర్‌ని ‘తెలంగాణ జిన్నా’ అని అభివర్ణించారు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం మీద కోమటిరెడ్డి మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో కేసీఆర్ అరెస్టు కాక తప్పదని ఆయన అన్నారు. ఈ అంశంలో అన్ని విషయాలూ బయటపడుతున్నాయని, మే 26న ఎమిరేట్స్ విమానంలో హరీష్ రావు దొంగచాటుగా అమెరికా వెళ్ళి వచ్చింది పరారీలో వున్న ప్రభాకరరావు ఇండియా రాకుండా ఆపడానికేనని కోమటిరెడ్డి ఆరోపించారు. ఇదంతా కేసీఆర్ ప్లానింగ్ ప్రకారమే జరిగిందని ఆయన చెప్పారు. కేసీఆర్ తెలంగాణకు జిన్నాలా మారారని, కేసీఆర్‌తో స్నేహం చేసిన జగన్ చేసిన మోసం వల్ల కేసీఆర్ తెలంగాణను ఎండబెట్టారని కోమటిరెడ్డి చెప్పారు. తాను అమెరికా వెళ్ళలేదని ప్రమాణం చేయడానికి హరీష్ రావు సిద్ధమా అని కోమటిరెడ్డి ప్రశ్నించారు. ఎవరికీ చెప్పకుండా అమెరికా వెళ్ళి రావాల్సిన అవసరం హరీష్ రావుకి ఏమొచ్చిందని ఆయన ప్రశ్నించారు. కేసీఆర్‌ని వదిలిపెట్టేది లేదని, ప్రభాకరరావు లొంగిపోయేలా కేసీఆర్ ఒప్పించాలని కోమటిరెడ్డి అన్నారు.