అసెంబ్లీలో తెలంగాణ నినాదాలు
posted on Mar 14, 2013 @ 9:51AM
విద్యుత్ ఛార్జీల పెంపుకు నిరసనగా పది వామపక్ష పార్టీలు ఛలో అసెంబ్లీకి పిలుపునిచ్చాయి. ఓల్డ్ ఎమ్మెల్యే క్వార్టర్స్ నుంచి భారీ ర్యాలీ ప్రారంభించారు. అయితే అనుమతి లేదంటూ పోలీసులు ర్యాలీని అడ్డుకున్నారు. ఈ సందర్భంగా ఇరువర్గాల మధ్య తోపులాట జరిగింది. వామపక్ష నేతలు నారాయణ, బీవీ రాఘవులు సహా పలువురిని పోలీసులు అరెస్ట్ చేశారు.
ఇక మరోవైపు అసెంబ్లీ తెలంగాణ నినాదాలతో హోరెత్తుతోంది. స్పీకర్ పోడియాన్ని చుట్టుముట్టి టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు నినాదాలు చేస్తున్నారు. సభ సజావుగా జరిగేలా సహకరించాలని స్పీకర్ నాదెండ్ల మనోహర్ వారిని కోరుతున్నారు. విపక్షాలు ఇచ్చిన వాయిదా తీర్మానాన్ని స్పీకర్ తిరస్కరించారు. వాయిదా తీర్మానం ఆమోదించాలని డిమాండ్ చేస్తున్నారు. టీఆర్ఎస్ నిరసనకు నాగం మద్దతుగా నిలిచారు. గవర్నర్ ప్రసంగానికి ధన్యవాద తీర్మానాన్ని విపక్షాలు అడ్డుకున్నాయి. దీంతో స్పీకర్ అసేంబ్లీని 10 గంటల వరకు వాయిదా వేశారు.