తెలంగాణలో నైట్ కర్ఫ్యూ పొడిగింపు!
posted on Apr 30, 2021 @ 2:49PM
కరోనా కట్టడి విషయంలో తెలంగాణ సర్కార్ మరో కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా కేసుల ఉద్ధృతిని దృష్టిలో ఉంచుకుని రాత్రి పూట కర్ఫ్యూను మరో వారం పొడిగించారు. ఈ మేరకు ప్రభుత్వం ఓ ప్రకటన చేసింది. రాష్ట్రంలో ఈ నెల 20 నుంచి నైట్ కర్ఫ్యూ అమల్లో ఉంది. రాత్రి 10 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు కర్ఫ్యూ విధించారు. అయినా కొత్త కేసులు పెరుగుతుండటంతో నైట్ కర్ఫ్యూను పొడిగించాలని ప్రభుత్వం నిర్ణయింది. మే 8వ తేదీ ఉదయం 5 గంటల వరకు రాత్రి కర్ఫ్యూ పొడిగిస్తున్నట్టు ఓ ప్రకటనలో పేర్కొంది. నైట్ కర్ఫ్యూ సందర్భంగా నిబంధనలను పక్కాగా అమలు చేయాలని అన్ని జిల్లాల పోలీసులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది.
అంతకుముందు తెలంగాణలో నైట్ కర్ఫ్యూ , కరోనా పరిస్థితులపై హైకోర్టులో విచారణ జరిగింది. నైట్ కర్ఫ్యూ ముగుస్తున్న తరుణంలో తదుపరి తీసుకోబోయే చర్యలపై గురువారం హైకోర్టు విచారణ జరిపింది. అయితే వివరాలను శుక్రవారం ఇస్తామని కోర్టుకు నిన్న ఏజీ తెలిపారు. అయితే తదుపరి కార్యాచరణపై శుక్రవారం కూడా ఎలాంటి వివరాలను అంజేయకపోవడంతో... హైకోర్టు తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేసింది. రాష్ట్ర ప్రభుత్వం ఎందుకింత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ప్రశ్నించింది. 24 గంటల్లో ప్రభుత్వం ఎందుకు నిర్ణయం తీసుకోలేకపోయిందని నిలదీసింది.
హైకోర్టు ప్రశ్నకు బదులుగా శనివారం ఉదయం 5 గంటల వరకు నైట్ కర్ఫ్యూ ఉందని ఏజీ తెలిపారు. ఈ అంశంపై చీఫ్ సెక్రటరీ సమీక్షను నిర్వహిస్తున్నారని చెప్పారు. ప్రభుత్వం తన నిర్ణయాన్ని చెప్పేందుకు 45 నిమిషాల సమయాన్ని ఇస్తున్నామని తెలిపింది. తాము ఇచ్చిన సమయంలోగా ప్రభుత్వం నిర్ణయాన్ని తెలుపకపోతే.. తామే ఆదేశాలను జారీ చేయాల్సి ఉంటుందని హెచ్చరించింది. ఈ నేపథ్యంలో, ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. నైట్ కర్ఫ్యూని మరో వారం రోజులు పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.