నందిగ్రామ్ లో మమత ఓటమి! ఎగ్జిట్ పోల్స్ తో టీఎంసీలో టెన్షన్
posted on Apr 30, 2021 @ 2:10PM
దేశవ్యాప్తంగా రాజకీయ మంటలు రేపిన పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలపై ఎగ్జిట్ పోల్స్ అంచనాలు వచ్చాయి. మెజార్టీ సర్వేలు టీఎంసీదే మళ్లీ అధికారమని తేల్చేశాయి. మమతా బెనర్జీ మూడోసారి ముఖ్యమంత్రి కాబోతున్నారని వెల్లడించాయి. ఒకటి రెండు సర్వేలు మాత్రం హంగ్ ఫలితం రావొచ్చని చెప్పగా.. రిపబ్లిక్ ఛానెల్ సర్వేలో మాత్రం బీజేపీకి విజయం సాధిస్తుందని వెల్లడైంది. ఎగ్జిట్ పోల్స్ అంచనాల తర్వాత హ్యాట్రిక్ విజయంపై టీఎంసీ ధీమాగా కనిపిస్తోంది. అటు బీజేపీ కూడా తామే గెలుస్తామని చెబుతోంది. అయితే ఎగ్టిల్ పోల్స్ అంచనాల్లోనే మరో ఆసక్తికర విషయం వెల్లడవుతోంది. టీఎంసీ మేజిక్ ఫిగర్ సాధించినా.. నందిగ్రామ్ లో మాత్రం ముఖ్యమంత్రి మమతా బెనర్జీ గెలవడం కష్టమని తెలుస్తోంది. దాదాపు అన్ని సర్వేల్లోనూ నందిగ్రామ్ లో టఫ్ ఫైట్ జరిగిందనే రావడంతో ఉత్కంఠ రేపుతోంది.
గ్రౌండ్ జీరో రీసెర్చ్ సంస్థ సర్వే ప్రకారం.. పశ్చిమ బెంగాల్ లో మొత్తం 294 అసెంబ్లీ స్థానాలు ఉండగా.. పోటీలో ఉన్న అభ్యర్థులు చనిపోవడంతో 292 స్థానాలకే పోలింగ్ జరిగింది. 292లో ప్రస్తుతం అధికారంలో ఉన్న టీఎంసీ టీఎంసీకి 157 నుంచి 185 సీట్లు, బీజేపీకి 96 నుంచి 125 సీట్లు, కాంగ్రెస్ కూటమికి 8 నుంచి 14 సీట్లు వస్తాయని వెల్లడైంది. ప్రాంతాలవారీగా సర్వే ఫలితాలను ఇచ్చింది గ్రౌండ్ జీరో రీసెర్చ్ సంస్థ. దీని ప్రకారం కోల్ కతా రీజియన్, సెంట్రల్ రీజియన్, నార్త్ బెంగాల్ లో టీఎంసీకి లీడ్ కనిపిస్తుండగా..తీవ్ర ఉద్రిక్తతలు స్పష్టించిన జంగల్ మహాల్, మిడ్నాపూర్ ఏరియాలో మాత్రం బీజేపీ సత్తా చాటనుందని తెలుస్తోంది. ఇక్కడ బీజేపీకి స్పష్టమైన ఆధిక్యత కనిపిస్తోంది.
జంగల్ మహాల్, మిడ్నాపూర్ ఏరియాలో బీజేపీకి 31-37 అసెంబ్లీ సీట్లు గెలవనుండగా.. టీఎంసీ కేవలం 18-24 స్థానాలకే ఆగిపోనుందని సర్వే చెబుతోంది. మమతా బెనర్జీ పోటీ చేసిన నందిగ్రామ్ అసెంబ్లీ స్థానం ఈ ఏరియాలోనే ఉంది. ఎన్నికలకు ముందు టీఎంసీ నుంచి బీజేపీలో చేరిన సువేందు అధికార ఈసారి కూడా నందిగ్రామ్ ఏరియాలో తన పట్టు నిలుపుకున్నారని గ్రౌండ్ జీరో రీసెర్చ్ ఎగ్జిట్ పోల్స్ ను బట్టి అంచనా వేస్తున్నారు. దీంతో నందిగ్రామ్ లో మమతా బెనర్జీ పరిస్థితి ఏంటన్నది ఆసక్తిగా మారింది. నందిగ్రామ్ లో తాము తప్పకుండా గెలుస్తామని బీజేపీ ధీమాగా చెబుతోంది.
మమతా బెనర్జీ పోటీ చేసిన నందిగ్రామ్ అసెంబ్లీ నియోజకవర్గం పుర్బా మిడ్నాపూర్ జిల్లాలో ఉంది. ఈ జిల్లాలో 17 అసెంబ్లీ నియోజకవర్గాలున్నాయి. గ్రౌండ్ జీరో రీసెర్చ్ సంస్థ సర్వే ప్రకారం పుర్బా మిడ్నాపూర్ జిల్లాలో టీఎంసీకి 6-7, బీజేపీకి 10-11 సీట్లు వస్తాయని తేలింది. బీజేపీది అధికారమని చెప్పిన రిపబ్లికన్ సర్వేలో.. పుర్బా మిడ్నాపూర్ జిల్లాలో టీఎంసీ కేవలం మూడు స్థానాలకే పరిమితం కానుంది. నందిగ్రామ్ లో మమతా బెనర్జీ వెనకబడి ఉందని రిపబ్లికన్ సర్వే స్పష్టం చేస్తోంది. ఇదే ఇప్పుడు చర్చనీయంశంగా మారింది.
సువేందు అధికారితో మమత నేరుగా తలపడ్డ నందిగ్రామ్ అసెంబ్లీ స్థానంలో గట్టిపోటీ ఉందని, విజయం ఎవరిని వరిస్తుందో అంచనా వేయడం కష్టమని పలు సంస్థలు పేర్కొన్నాయి. ఒక వేళ టీఎంసీకి మెజార్టీ వచ్చి నందిగ్రామ్‌లో మమత ఓడిపోతే మాత్రం అది ట్విస్టే అవుతుంది. అప్పుడు బెంగాల్ కొత్త ముఖ్యమంత్రి టీఎంసీ నుంచి ఎవరు అవుతారు ? అన్న దానిపై కూడా అప్పుడే రకరకాల చర్చలు నడుస్తున్నాయి. ఏదేమైనా బెంగాల్ ఉత్కంఠకు వచ్చే నెల 2వ తేదీన తెరపడనుంది.